ఆగస్టులో కామిక, పుత్రద ఏకాదశి ఎప్పుడు? తేదీ, సమయంతో పాటు పూర్తి వివరాలు ఇవిగో!
హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు విశేష ప్రాధాన్యం ఉంది. శ్రావణ మాసంలో వచ్చే కామికా ఏకాదశి మరియు పుత్రదా ఏకాదశి వ్రతాలను శ్రీమహావిష్ణు, మహాలక్ష్మి అనుగ్రహం కోసం భక్తిశ్రద్ధలతో ఆచరిస్తారు.
హిందూ సనాతన ధర్మంలో ప్రతినెలా రెండుసార్లు ఏకాదశి వ్రతాలు వస్తుంటాయి. చాంద్రమాన క్యాలెండర్ ప్రకారం నెలకు ఒకసారి వచ్చే కృష్ణ పక్షం, మరోసారి వచ్చే శుక్ల పక్షంలో ఈ పవిత్ర ఉపవాసాలను ఆచరిస్తారు. ముఖ్యంగా పవిత్ర శ్రావణ మాసంలో వచ్చే ఏకాదశి వ్రతాలకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది.

ఈ క్రమంలోనే రాబోయే ఆగస్టు నెలలో భక్తులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే కామికా ఏకాదశి, శ్రావణ పుత్రదా ఏకాదశి వ్రతాల రాకతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. శ్రీమహావిష్ణువు అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి, సకల పాప విముక్తి పొందేందుకు ఈ వ్రతాలు అద్భుతమైన మార్గమని పెద్దలు, పురోహితులు చెబుతుంటారు.
శ్రీహరి, మహాలక్ష్మి అనుగ్రహం కోసం
పురాణాల ప్రకారం ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల మనుషుల పూర్వ జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని, అంతిమంగా మోక్షప్రాప్తి కలుగుతుందని ప్రగాఢ విశ్వాసం ఉంది. ఈ ప్రత్యేక రోజున జగత్ రక్షకుడు శ్రీ మహావిష్ణువుతో పాటు ధన దేవత అయిన శ్రీ మహాలక్ష్మిని ప్రత్యేకంగా పూజిస్తారు.
సామాన్యులు సైతం తమ కుటుంబ కలహాలు తొలగిపోయి, ఇంటా బయటా సుఖశాంతులు వెల్లివిరియాలని ఈ రోజున నిష్టతో పూజలు నిర్వహిస్తారు. కొత్తగా ఏకాదశి వ్రతం ప్రారంభించాలనుకుంటే, ఆగస్టు నెలలో ఏ తేదీల్లో ఏకాదశి వస్తాయో కచ్చితమైన వివరాలను ఇక్కడ తెలుసుకోవడం ముఖ్యం.
ఆగస్టులో కామికా ఏకాదశి తేదీ, సమయాలు
హిందూ పంచాంగం ప్రకారం, వర్షాకాలంలో వచ్చే ఈ పవిత్ర కామికా ఏకాదశి తిథి 2026 ఆగస్టు 8వ తేదీ ఉదయం 10:29 గంటలకు ప్రారంభమవుతుంది. మరుసటి రోజు అంటే ఆగస్టు 9వ తేదీ ఉదయం 07:34 గంటలకు ఈ తిథి ముగుస్తుంది. అయితే హిందూ సంప్రదాయంలో ఉదయ తిథి ప్రామాణికం కాబట్టి, భక్తులు ఆగస్టు 9, 2026వ తేదీనే కామిక ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలని పండితులు సూచిస్తున్నారు.
కామిక ఏకాదశి పారణ ముహూర్తం
వ్రతం ఎంతో నియమబద్ధంగా ముగించడాన్ని పారణ అంటారు. కామిక ఏకాదశి వ్రత విరమణ లేదా పారణను ఆగస్టు 10, 2026న నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం 06:36 నిమిషాల నుంచి ఉదయం 09:32 నిమిషాల మధ్యలో పారణ చేయడం అత్యంత శుభప్రదమని పంచాంగకర్తలు పేర్కొన్నారు.
పుత్రదా ఏకాదశి ఎప్పుడంటే?
పుత్రదా ఏకాదశికి సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే శక్తి ఉందని నమ్ముతారు. పంచాంగం ప్రకారం, ఈ ఏకాదశి తిథి 2026 ఆగస్టు 22వ తేదీ రాత్రి 10:30 గంటలకు ప్రారంభమై, ఆగస్టు 23వ తేదీ అర్ధరాత్రి దాటాక 12:48 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి నిబంధనల ప్రకారం పుత్రదా ఏకాదశి వ్రతాన్ని ఆగస్టు 23, 2026వ తేదీన జరుపుకోవాలి.
పుత్రదా ఏకాదశి పారణ సమయం
పుత్రదా ఏకాదశి వ్రత పారణను ఆగస్టు 24, 2026వ తేదీన చేపట్టాలి. ఆ రోజు ఉదయం 07:19 నిమిషాల నుంచి ఉదయం 09:43 నిమిషాల వరకు పారణ చేయడానికి మంచి సమయం ఉందని పండితులు స్పష్టం చేస్తున్నారు. ఈ నియమాలను పాటిస్తూ శ్రీహరిని ఆరాధిస్తే సకల ఇష్టార్థాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


