...
...
Next Story

ఆగస్టు నెలలో ముఖ్య పర్వదినాలు: వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణిమ వరకు పూర్తి వివరాలు!

ఆగస్టు నెల ఆధ్యాత్మిక, జ్యోతిష్యపరంగా ఎంతో విశిష్టమైనది. ఈ నెలలో శ్రావణమాసం ప్రారంభం కావడంతో పాటు సంకట చతుర్థి, కామిక ఏకాదశి, మాస శివరాత్రి, చుక్కల అమావాస్య, నాగ చతుర్థి, నాగపంచమి, గరుడ పంచమి, వరలక్ష్మి వ్రతం, పుత్రదా ఏకాదశి, శ్రావణ పౌర్ణిమ (రాఖీ పౌర్ణిమ) వంటి అనేక ముఖ్యమైన పర్వదినాలు వస్తున్నాయి.

Published on: Aug 1, 2026, 12:30:48 IST
Advertisement

ఆగస్టు నెల వచ్చేసింది. ఆగస్టు నెలలో కొన్ని పండుగలు, ముఖ్యమైన పర్వదినాలు ఉన్నాయి. ఏ రోజు ఏ పూజ చేయాలి? ఆగస్టులో రానున్న ముఖ్య పర్వదినాల గురించి పూర్తి జాబితా ఇక్కడ ఉంది. చూసేయండి.

ఆగస్టు నెలలో ముఖ్య పర్వదినాలు: వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణిమ వరకు పూర్తి వివరాలు!
ఆగస్టు నెలలో ముఖ్య పర్వదినాలు: వరలక్ష్మీ వ్రతం నుంచి రాఖీ పౌర్ణిమ వరకు పూర్తి వివరాలు!

ఆగస్టు నెల ఆధ్యాత్మికంగా, జ్యోతిష్యపరంగా చాలా విశేషమైనదని చెప్పొచ్చు. ఆషాఢం పూర్తయి శ్రావణ మాసం కూడా ఆగస్టు నెలలో వస్తుంది. ఆగస్టు నెలలో శివారాధన, విష్ణు పూజ చేయడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. మహాలక్ష్మి ఉపాసన, వేదోపాకర్మలు వంటి అనేక విశేషాలు చోటు చేసుకోబోతున్నాయి. ఆగస్టు నెలలోనే కామిక ఏకాదశి, చుక్కల అమావాస్య, నాగ చతుర్థి, గరుడ పంచమి, నాగ పంచమి, వరలక్ష్మి వ్రతం, రాఖీ పౌర్ణిమ వంటి పర్వదినాలు ఈ మాసం ప్రత్యేకతను ఇంకా పెంచనున్నాయి.

ఆగస్టులో రానున్న ముఖ్య పర్వదినాల వివరాలు ఇవిగో...

సంకట చతుర్థి: ఆగస్టు 2

సంకట చతుర్థిని ప్రతి నెలా కృష్ణపక్ష చవితి నాడు జరుపుకుంటాము. ఈ రోజున వినాయకుడిని ప్రత్యేకించి ఆరాధిస్తాము. విఘ్నాలు తొలగి కార్యసిద్ధి కలుగుతుందని విశ్వసిస్తూ, వినాయకుడికి పూజ, ఉపవాసం, అర్చన వంటివి చేస్తారు. చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం చేసి వ్రతాన్ని విరమించాలి.

కామిక ఏకాదశి: ఆగస్టు 9

ఆషాఢ కృష్ణపక్ష ఏకాదశిని కామిక ఏకాదశి అంటారు. ఈ రోజున విష్ణువును ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. ఉపవాసం ఉంటే చాలా మంచిది. అలాగే తులసి దళాలతో విష్ణుమూర్తిని ఆరాధించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వలన కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి.

ప్రదోష వ్రతం: ఆగస్టు 10, 25

ఆగస్టు 10, 25 తేదీల్లో ప్రదోష వ్రతం వచ్చింది. త్రయోదశి సాయంకాలం వచ్చే ప్రదోషకాలంలో శివుడిని ప్రత్యేకించి ఆరాధించాలి. శివాభిషేకం చేస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు.

మాస శివరాత్రి: ఆగస్టు 11

ఆగస్టు 11న మాస శివరాత్రి వచ్చింది. ప్రతి నెలా కృష్ణపక్ష చతుర్దశి నాడు మాస శివరాత్రిని జరుపుతాము. ఆ రోజు శివుడికి బిల్వార్చన, శివలింగాభిషేకం చేయడం వలన మంచి ఫలితాలను పొందవచ్చు. రుద్ర పారాయణం చేస్తే కూడా మంచిదే.

అమావాస్య: ఆగస్టు 12

ఆగస్టు 13న శ్రావణమాసం ప్రారంభమవుతుంది. శ్రావణమాసంలో చాలా మంది స్త్రీలు మంగళగౌరీ వ్రతాలను ఆచరిస్తారు. వరలక్ష్మి వ్రతం కూడా శ్రావణమాసంలో వస్తుంది. ఆ రోజు అమ్మవారిని ఆరాధించడం వలన అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. శ్రావణమాసంలో శివుని ఆరాధిస్తే కూడా మంచి ఫలితాలు కనిపిస్తాయి.

నాగ చతుర్థి: ఆగస్టు 16

శ్రావణ శుక్ల చవితిని నాగ చతుర్థి అంటారు. ఈ రోజున నాగదేవతలకు పూజలు చేస్తే శుభ ఫలితాలను పొందవచ్చు. సంతానాభివృద్ధి కోసం కూడా ప్రత్యేకించి పూజలు చేయొచ్చు.

నాగ పంచమి, గరుడ పంచమి: ఆగస్టు 17

ఆగస్టు 17న శ్రావణ శుక్ల పంచమి వచ్చింది. దీనిని నాగ పంచమి లేదా గరుడ పంచమి అంటారు. ఈ రోజును కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది.

వరలక్ష్మి వ్రతం

శ్రావణమాసంలో వచ్చే వరలక్ష్మి వ్రతం చాలా విశేషమైనది. వరాలను ప్రసాదించే మహాలక్ష్మి దేవిని ఆవాహనం చేసి షోడశోపచార పూజ చేయాలి. అష్టోత్తరంతో అమ్మవారిని ఆరాధించాలి. ముత్తైదువులకు వాయనాలు ఇచ్చి ఈ వ్రతాన్ని ముగించాలి. ఈ వ్రతం ఆచరించడం వలన భర్తకు ఆయురారోగ్యాలు లభిస్తాయి. సంతానాభివృద్ధి, ధనధాన్య సమృద్ధి కలగడానికి స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు.

శ్రావణ సోమవారాలు (ఆగస్టు 17, 24, 31)

శ్రావణమాసంలో వచ్చే సోమవారాలు ఆగస్టు 17, 24, 31 తేదీల్లో వచ్చాయి. కాబట్టి శివలింగానికి జలాభిషేకం చేసి, పంచామృతాలతో కూడా అభిషేకం చేయాలి. శివుడికి ఎంతో ప్రీతికరమైన బిల్వదళాలతో అర్చన చేసి, రుద్ర పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చు.

పుత్రదా ఏకాదశి: ఆగస్టు 23

ఆగస్టు 23న పుత్రదా ఏకాదశి వచ్చింది. ఆ రోజు కూడా విష్ణువును ప్రత్యేకించి ఆరాధించండి. ఉపవాసం ఉంటే కూడా మంచిదే.

శ్రావణ పౌర్ణిమ

శ్రావణ పౌర్ణిమను రాఖీ పౌర్ణిమ అని కూడా అంటారు. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టి, వారికి ఆయురారోగ్యాలు, విజయాలు లభించాలని కోరుకుంటారు.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe