Buddha Purnima 2026 : బుద్ధ పూర్ణిమ ఓ అద్భుతమైన సమయం..! సద్గురు చెప్పిన జ్ఞానోదయ పరమార్థం ఇదే
Buddha Purnima Significance : బుద్ధ పూర్ణిమ కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. అది ప్రతి మనిషిలోని అనంతమైన సంభావ్యతను మేల్కొలిపే అద్భుతమైన సమయం. గౌతమ బుద్ధుని జ్ఞానోదయం, పౌర్ణమి నాటి శక్తివంతమైన ప్రక్రియపై సద్గురు ఏం చెప్పారంటే..?
Spiritual Importance of Purnima : ప్రతి ఏటా వచ్చే బుద్ధ పూర్ణిమ మనకు అంతరంగంలోని నిశ్చలతను, పౌర్ణమి వెలుగుల సాక్షిగా నిశ్శబ్దంగా గుర్తు చేస్తుంది. ఆధ్యాత్మిక అన్వేషకులకు ఈ రాత్రి కేవలం ఒక మతపరమైన వేడుక మాత్రమే కాదు…! ఒక క్షణం ఆగి, లోపలికి తొంగి చూసుకుని, ఆత్మవిమర్శ చేసుకోవడానికి లభించే అద్భుతమైన అవకాశం. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేసిన గౌతమ బుద్ధుని జీవితం…. ఈ పౌర్ణమి నాటి శక్తితో విడదీయలేని విధంగా ముడిపడి ఉంది.

పరివర్తనకు ఇది తొలి అడుగు
యోగి, ఆధ్యాత్మిక గురువు సద్గురు అభిప్రాయం ప్రకారం.. ఈ పౌర్ణమికి ఉన్న ప్రాముఖ్యత అత్యంత విశిష్టమైనది. బుద్ధ పూర్ణిమ రోజునే సిద్ధార్థుడు గౌతముడిగా జన్మించడం, బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొందడం మరియు చివరకు మహాపరినిర్వాణం చెందడం యాదృచ్ఛికం కాదు.
"బుద్ధ పూర్ణిమ అనేది మానవుడు తనలోని అంతిమ సంభావ్యతను గ్రహించడం గురించి తెలియజేస్తుంది," అని సద్గురు వివరించారు. అంటే… ప్రతి మానవుడు తన పరిమితులను అధిగమించి బుద్ధత్వాన్ని పొందడం సాధ్యమేనని ఈ రోజు మనకు నిరంతరం గుర్తు చేస్తూనే ఉంటుంది.
యోగా సంప్రదాయాల ప్రకారం… మానవ వ్యవస్థ చంద్రుని చక్రాలకు అత్యంత బలంగా స్పందిస్తుంది. పౌర్ణమి రోజున ప్రకృతిలో ఏర్పడే ప్రకంపనలు మనలోని ప్రాణశక్తిని ఉద్దీపన చేస్తాయి. గౌతమ బుద్ధుడు ఇదే రోజున జ్ఞానోదయం పొందడం వల్ల, ఈ నిర్దిష్ట పౌర్ణమికి ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఆకర్షణ తోడైంది.
చరిత్రలో నిలిచిపోయిన ఆ మహాత్ముని మేల్కొలుపు కారణంగా…. ఈ రాత్రి ఆత్మసాక్షాత్కారానికి ఒక శక్తివంతమైన చిహ్నంగా మారిందని సద్గురు వివరిస్తారు. అందుకే చాలామంది అన్వేషకులు ఈ రాత్రి నిద్రపోకుండా ధ్యానం చేయడం, ఉపవాసం ఉండటం లేదా జీవితంలోని లోతైన అంశాలను అర్థం చేసుకోవడానికి నిశ్శబ్దంగా గడపడానికి ప్రాధాన్యత ఇస్తారు.
అన్వేషి నుంచి బుద్ధుడిగా..
గౌతముని ప్రయాణం ఒక సుఖవంతమైన జీవితం నుంచి తీవ్రమైన అన్వేషణ వైపు సాగింది. సత్యాన్వేషణలో భాగంగా ఎన్నో ఏళ్ల పాటు వివిధ మార్గాలను అన్వేషించిన తర్వాత, ఆయన చివరకు బోధి వృక్షం కింద నిశ్చలత్వంతో కూర్చున్నారు. జీవిత మూలాలను అర్థం చేసుకోవాలనే ఆయన పట్టుదలే ఆయనను పరివర్తన వైపు నడిపించింది. "బుద్ధుడు అంటే మేల్కొన్నవాడు అని అర్థం" అని సద్గురు పేర్కొన్నారు. ఒక సామాన్య మానవుడు తనలోని చైతన్యాన్ని ఎలా ఉన్నత స్థితికి తీసుకెళ్లవచ్చో చెప్పడానికి బుద్ధుని జీవితమే ఒక గొప్ప ఉదాహరణ.
రాత్రి ధ్యానం ఎందుకు…?
ఆధ్యాత్మిక సాధకులకు బుద్ధ పూర్ణిమ రాత్రి ధ్యానానికి ఎంతో అనుకూలమైన సమయం. ఆ వెన్నెల రాత్రిలోని నిశ్శబ్దం మనల్ని అంతర్ముఖులను చేస్తుంది. బుద్ధుని బోధనల సారాంశం కేవలం ఆచారాల్లో లేదు, అది అవగాహన, స్పష్టతలో ఉందని సద్గురు సూచిస్తున్నారు.
"ఆధ్యాత్మికత అంటే మరింత స్పృహతో ఉండటం" అని సద్గురు అంటారు. అందుకే బుద్ధ పూర్ణిమ రాత్రి పెద్ద పెద్ద క్రతువులకు బదులుగా…. నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని, మన శ్వాసను గమనిస్తూ, అంతరంగ స్థితిని నిశితంగా పరిశీలించడం వల్ల గొప్ప మానసిక ప్రశాంతత లభిస్తుంది. బుద్ధుని మేల్కొలుపును స్మరించుకుంటూ, మనలోని అజ్ఞానాన్ని తొలగించుకుని జ్ఞానమార్గం వైపు అడుగులు వేయడానికి ఈ బుద్ధ పూర్ణిమ ఒక గొప్ప ప్రేరణ అని విశ్లేషించారు.
బుద్ధ పూర్ణిమ 2026: తేదీ, టైమింగ్స్ :
హిందూ పంచాంగం ప్రకారం…. వైశాఖ శుద్ధ పూర్ణిమ తిథి ఏప్రిల్ 30వ తేదీ రాత్రి నుంచే ప్రారంభమవుతుంది.
పూర్ణిమ తిథి ప్రారంభం: ఏప్రిల్ 30, 2026 సాయంత్రం 09:13 గంటలకు.
పూర్ణిమ తిథి ముగింపు: మే 01, 2026 రాత్రి 10:52 గంటలకు.
ముఖ్య గమనిక: ఉదయ తిథి ప్రాధాన్యతను బట్టి…. మే 1, శుక్రవారం నాడు బుద్ధ పూర్ణిమ వ్రతం, పుణ్య స్నానాలు, దానధర్మాలు నిర్వహించుకోవాలి.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

