ఇంట్లో శివలింగం పెట్టుకోవచ్చా? పూజించడానికి ఎలాంటి నియమాలు పాటించాలి? శివ పురాణం ఏం చెబుతోంది?
హిందూ సంప్రదాయంలో పరమశివుడికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. అయితే ఇంట్లో శివలింగాన్ని పెట్టుకోవచ్చా? దానిని ఎలా పూజించాలి? ఎలాంటి నియమాలు పాటించాలి? అనే సందేహాలు చాలామందిలో ఉంటాయి.
హిందువులు ఆ పరమేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తారు. హిందూ సంప్రదాయంలో శివుడికి ఎంతో విశిష్ట స్థానం ఉంది. ముఖ్యంగా కార్తీక మాసంలో శివుడిని ప్రత్యేకంగా ఆరాధిస్తారు. ప్రతిరోజూ శివాలయానికి వెళ్లి దీపారాధన చేయడం, కార్తీక సోమవారాల్లో ఉపవాసం ఉండడం.. ఇలా రకరకాల పద్ధతులను పాటిస్తూ ఉంటారు. అయితే శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోవచ్చా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. ఇంట్లో శివలింగం ఉండొచ్చా? పూజించడానికి ఎటువంటి నియమాలను పాటించాలి? శివ పురాణం ఏం చెబుతుంది? వంటి విషయాలను తెలుసుకుందాం.

కొంతమంది శివుడి చిత్రపటాన్ని పూజిస్తారు. ఇంకొంతమంది శివలింగాన్ని పెట్టి అభిషేకాలు, అర్చనలు వంటివి చేస్తారు. శివాలయాలకు వెళ్లలేని వారు ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని రోజూ పూజించాలని అనుకుంటారు. అయితే ఇంట్లో శివలింగం ఉండొచ్చా? శివలింగం ఉండకూడదని కొంతమంది అంటూ ఉంటారు. మరి కొంత మంది తప్పనిసరిగా శివలింగాన్ని పూజించవచ్చని అంటారు. అసలు ఇందులో నిజం ఎంత అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
ఇంట్లో శివలింగం ఉండొచ్చా? రోజూ శివలింగానికి పూజలు చేయొచ్చా?
ఇంట్లో శివలింగం ఉండొచ్చు. పూజ మందిరంలో పెట్టి పూజించుకోవడంలో ఎటువంటి తప్పు లేదు. శివలింగం పరమేశ్వరుడి నిరాకార, అనంత స్వరూపానికి ప్రతీక. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకున్నట్లయితే భక్తిశ్రద్ధలతో పూజించాలి. శివుడిని ఆరాధించేటప్పుడు ఎలాంటి కఠిన నియమాలు లేవు. స్వచ్ఛమైన మనసుతో నీటిని సమర్పించి, బిల్వపత్రాలను సమర్పించి, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని జపిస్తే చాలు. శివుని అనుగ్రహం కలుగుతుంది. అయితే కచ్చితంగా ప్రతి ఒక్కరూ ఒక నియమాన్ని పాటించాలి. ఇంట్లో శివలింగాన్ని పెట్టుకునేటప్పుడు చిన్న పరిమాణంలో ఉండేటట్టు చూసుకోవాలి. బొటనవేలు పరిమాణంలో ఉండే శివలింగాన్ని ఎంచుకోవడం మంచిది.
ఎలాంటి శివలింగాన్ని పెట్టుకోవాలి?
నర్మదేశ్వర శివలింగం: నర్మదా నదిలో సహజంగా లభించే రాళ్లతో ఈ శివలింగాన్ని తయారు చేస్తారు. ఎక్కువగా ఇళ్లల్లో ఈ శివలింగాన్ని పెట్టి పూజిస్తారు.
స్ఫటిక శివలింగం: స్ఫటికంతో చేసిన శివలింగాన్ని కూడా ఇంట్లో పెట్టి పూజించుకోవచ్చు. ఈ శివలింగం ఆకర్షణీయంగా కూడా కనిపిస్తుంది.
లోహపు శివలింగం: వెండి, ఇత్తడి, రాగి వంటి లోహాలతో చేసిన శివలింగాలను కూడా ఇంట్లో పెట్టి పూజించొచ్చు.
రాతి శివలింగం: నల్లరాయి లేదా ఇతర సహజ రాళ్లతో చేసిన శివలింగాలను కూడా ఇంట్లో పెట్టి పూజించొచ్చు.
శివలింగాన్ని ఏ దిశలో పెట్టి పూజించాలి?
వాస్తు ప్రకారం ఇంట్లో పూజా మందిరాన్ని ఈశాన్య దిశలో ఏర్పాటు చేసుకోవాలి.
పూజ చేసేటప్పుడు ఉత్తరం లేదా తూర్పు వైపు కూర్చుని పూజ చేయడం ఉత్తమం. శివలింగాన్ని ఎప్పుడూ కూడా శుభ్రమైన పీఠంపై ఉంచాలి.
అభిషేకం చేసేటప్పుడు ఆ నీరు బయటకు వెళ్లడానికి జలధార ఏర్పాటు చేసుకోవాలి. శివలింగాన్ని నేలపై నేరుగా ఉంచకూడదు.
రోజూ శివలింగానికి అభిషేకం చేయాలా?
ఇంట్లో శివలింగాన్ని పెట్టుకున్నట్లయితే ప్రతి రోజూ శుభ్రం చేసి పూజించాలి. శివలింగానికి నీటితో అభిషేకం చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుంది. పూజా మందిరాన్ని శుభ్రం చేసుకుని, శివలింగాన్ని కూడా శుభ్రమైన నీటితో కడగాలి. ఓం నమః శివాయ అని నీటితో అభిషేకం చేయండి. బిల్వపత్రాలు, శివుడికి ఇష్టమైన పూలను సమర్పించండి. విభూతిని కూడా సమర్పించండి. అలాగే దీపారాధన చేసి, పండ్లు లేదా ఇతర పదార్థాలను నైవేద్యంగా శివుడికి సమర్పించండి.

శివుడికి ఏ పదార్థాలతో అభిషేకం చేయాలి?
జలాభిషేకం: నీటితో శివుడికి అభిషేకం చేయొచ్చు.
పాలు: పాలతో శివుడికి అభిషేకం చేయొచ్చు. అద్భుతమైన ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు.
అలాగే తేనె, పెరుగు, బిల్వపత్రాలు, తెల్లని పూలు కూడా శివుడికి సమర్పించవచ్చు.
శివలింగాన్ని ఇంట్లో పెట్టుకునేటప్పుడు ఈ తప్పులు చేయకండి!
- పూజా మందిరాన్ని అపరిశుభ్రంగా ఉంచడం మంచిది కాదు.
- శివలింగాన్ని నేలపై పెట్టకూడదు.
- అభిషేకం చేసే పాత్రలు, పూజా సామగ్రిని కూడా అపరిశుభ్రంగా ఉంచకూడదు.
- శివలింగాన్ని ఇంట్లో పెట్టినప్పుడు ఏమాత్రం నిర్లక్ష్యం చేయకూడదు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


