చాణక్య నీతి: ఈ 4 విషయాల్లో గర్వం ఉంటే సర్వనాశనమే!
జీవితంలో ఎంత ఎదిగినా అణకువ అవసరం అంటారు ఆచార్య చాణక్య. మనిషిని నాశనం వైపు నడిపించే ఆ నాలుగు రకాల అహంకారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నేడు 2026 జూన్ 10, బుధవారం. బుధగ్రహ అనుగ్రహం కోసం, బుద్ధి బలం కోసం చాణక్య నీతిని తెలుసుకోవడం ఎంతో ఉత్తమం. జీవితాన్ని ఉన్నత పథంలో నడిపించడానికి ఆచార్య చాణక్య ఎన్నో అమూల్యమైన సూత్రాలు అందించారు. నేటి ఆధునిక కాలంలోనూ ఈ సూత్రాలు మనల్ని ఎన్నో కష్టాల నుంచి కాపాడుతాయి. మనిషికి ఉండే జ్ఞానం, ఇతరులతో ప్రవర్తించే తీరే అతని అసలైన బలమని చాణక్యుడి నమ్మకం. అయితే, అహంకారం ప్రవేశిస్తే ఆ బలమంతా క్షణాల్లో బూడిదవుతుంది. తన కంటే గొప్పవారు ఎవరూ లేరనే భ్రమలో బతికే వ్యక్తి వరుసగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాడు. ఫలితంగా విజయం దూరమై, చేతిలో ఉన్నదంతా కోల్పోతాడు. మనిషిని పతనానికి గురిచేసే ఆ నాలుగు అహంకారాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

సంపద తెచ్చే అహంకారం
చేతిలో డబ్బు ఉంది కదా అని అది ఎప్పుడూ మనతోనే ఉంటుందని అనుకోవడం పెద్ద పొరపాటు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, కనురెప్ప మూసి తెరిచేలోగా పరిస్థితులు మారిపోవచ్చు. సంపద పెరిగినప్పుడు ఇతరులను తక్కువ చేసి చూడకూడదు. డబ్బు చూసుకుని విర్రవీగే వారు క్రమంగా తమకు అత్యంత ఆప్తులైన వారి నమ్మకాన్ని కోల్పోతారు. సంపద మనకు విలాసవంతమైన జీవితాన్ని ఇవ్వగలదేమో కానీ, సమాజంలో గౌరవాన్ని కేవలం మన మంచి ప్రవర్తన మాత్రమే తెచ్చిపెడుతుంది. లక్ష్మీదేవి చంచలమైనది, కనుక డబ్బున్నప్పుడు గర్వపడటం మూర్ఖత్వమే అవుతుంది.
జ్ఞానంపై మితిమీరిన గర్వం
చదువు లేదా అనుభవం పెరిగినంత మాత్రాన ప్రపంచంలో అన్నీ మనకే తెలుసనుకోవడం తగదు. జ్ఞానం పెరగడం వేరు, దానిపై గర్వం పెంచుకోవడం వేరు. ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా జీవించాలి. రోజువారీ జీవితంలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకుంటూనే ఉండాలి. తమ తెలివితేటలను ప్రదర్శిస్తూ ఇతరులను తక్కువ అంచనా వేసే వారికి సమాజం దూరంగా ఉంటుంది. "ఎల్లప్పుడూ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి, ఇతరుల మాటలకు విలువ ఇవ్వాలి," అని ఆచార్య చాణక్య స్పష్టం చేశారు. ఎవరైతే తమ జ్ఞానాన్ని ఇతరుల మేలు కోసం ఉపయోగిస్తారో వారే నిజమైన పండితులు.
పదవి, అధికార మదం
సమాజంలో ఉన్నత పదవి దక్కడం గొప్ప విషయమే, కానీ ఆ అధికారంతో అహంకారం పెంచుకుంటే ముప్పే. ఉద్యోగం, రాజకీయం, బాధ్యతలు ఎప్పుడూ శాశ్వతం కావు. తమకున్న అధికార బలంతో ఇతరులను ఇబ్బంది పెట్టే వారికి కాలం తగిన బుద్ధి చెబుతుంది. పవర్ ఉన్నప్పుడు ఎంత వినయంగా ఉంటే, అన్ని పనులు అంత సులువుగా సాగుతాయి. అధికారం కంటే అణకువ మిమ్మల్ని సమాజంలో ఉన్నత స్థానంలో నిలబెడుతుంది. పదవి, అధికారం శాశ్వతం కాదనే సత్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.
రూపం, అందం చూసి మురవడం
అందానికి ఎన్నో కొలమానాలు ఉన్నాయి. కొందరి మాటలు బాగుంటాయి, మరికొందరి ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. కొందరి మనసు నిర్మలంగా ఉంటే, ఇంకొందరు బాహ్య సౌందర్యంతో ఆకట్టుకుంటారు. అందంగా కనిపించడం తప్పు కాదు, కానీ ఆ అందాన్ని చూసుకుని అహంకరించడం తగదు. వయసుతో పాటు శారీరక సౌందర్యం తగ్గిపోతుంది, కానీ మంచి గుణం ఎప్పటికీ నశించదు. మనిషి అసలైన గుర్తింపు అతని నడవడిక, స్వభావం పైనే ఆధారపడి ఉంటుంది. సమాజం ఎప్పటికీ ప్రేమను పంచే వ్యక్తినే గుర్తుపెట్టుకుంటుంది.
డబ్బు, జ్ఞానం, పదవి, అందం.. ఇవన్నీ జీవితంలో ఎంత లభించినా మనిషి ఎల్లప్పుడూ వినయంతో మెలగాలని చాణక్య నీతి బోధిస్తోంది. అహంకారం తాత్కాలిక సంతోషాన్ని ఇవ్వవచ్చు, కానీ వినయపూర్వకమైన స్వభావం మాత్రమే శాశ్వత కీర్తిని అందిస్తుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


