ఆచార్య చాణక్యుడి మాట: మనిషిని నిలువునా దహించే ఆ 6 పరిస్థితులు ఇవే!

జీవితంలో ప్రశాంతత కరువై, మనిషి నిరంతరం అంతర్మథనంతో సతమతమవుతుంటే దానికి కారణాలు ఏమిటి? ఆచార్య చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో మనిషిని చితిలా దహించే ఆరు అంశాల గురించి వివరించారు.

Published on: Jun 23, 2026, 14:00:58 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మహా పండితుడు, రాజనీతిజ్ఞుడు ఆచార్య చాణక్యుడు చెప్పిన విషయాలు నేటికీ ఎంతో ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. చంద్రగుప్త మౌర్యుడిని చక్రవర్తిని చేసిన చాణక్యుడి మేధస్సు వెనుక ఎన్నో జీవిత సత్యాలు ఉన్నాయి. ఒక మనిషి బయటికి అగ్నితో కాలాల్సిన అవసరం లేదు, జీవితంలో ఎదురయ్యే కొన్ని చేదు అనుభవాలే అతడిని బ్రతికుండగానే దహించివేస్తాయని ఆయన హెచ్చరిస్తున్నారు.

ఆచార్య చాణక్యుడి మాట: మనిషిని నిలువునా దహించే ఆ 6 పరిస్థితులు ఇవే!
ఆచార్య చాణక్యుడి మాట: మనిషిని నిలువునా దహించే ఆ 6 పరిస్థితులు ఇవే!

ఆయన పేర్కొన్న ఆ శ్లోకం ఇదే:

కుగ్రామవాసః కులహీన సేవ కుభోజనం క్రోధముఖీ చ భార్యా

పుత్రశ్చ మూర్ఖో విధవా చ కన్యా వినాగ్నిమేతే ప్రదహంతి కాయమ్

అసలు మనిషిని దహించే ఆ 6 విషయాలు ఏవి?

1.నివాసానికి యోగ్యం కాని చోట ఉండటం:

మనం ఉండే ప్రాంతం లేదా ఊరు సంస్కారవంతమైనది కాకపోతే, అక్కడ నివసించే వారి ప్రవర్తన సరిగ్గా లేకపోతే మనిషి మానసిక ప్రశాంతతను కోల్పోతాడు. సమాజంలో మంచి వాతావరణం లేని చోట మనిషి ఎప్పటికీ ఎదగలేడు.

2.నీచమైన వారి సేవ:

స్వార్థపరులు, దుర్మార్గుల కింద పనిచేయడం లేదా వారికి సేవ చేయడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. ఇది మనిషిని నిరంతరం కుంగదీస్తుంది.

3.ఆరోగ్యానికి హాని చేసే ఆహారం:

అపౌష్టిక ఆహారం, కలుషితమైన పదార్థాలు తింటూ జీవించడం మనిషి శరీరాన్ని, ఆరోగ్యాన్ని రోజురోజుకీ క్షీణింపజేస్తుంది.

4.గొడవపడే భార్య:

ఇంట్లో ఎప్పుడూ కలహాలు, అశాంతి ఉంటే ఆ ఇల్లు నరకంలా మారుతుంది. భార్య ఎప్పుడూ కోపంతో, వాదించే మనస్తత్వంతో ఉంటే గృహస్థుడి జీవితం ఛిద్రమైపోతుంది.

5.మూర్ఖుడైన సంతానం:

కన్న కొడుకు వివేకం లేనివాడు, మాట విననివాడు, తల్లిదండ్రుల పట్ల గౌరవం లేనివాడు అయితే, ఆ తల్లిదండ్రులకు ఆవేదన తప్పదు.

6.విధవ అయిన కూతురు:

సమాజంలో కూతురు వైధవ్యాన్ని అనుభవించడం తండ్రికి లేదా కుటుంబ సభ్యులకు తీరని దుఃఖాన్ని మిగులుస్తుంది.

ఈ పరిస్థితుల నుంచి ఎలా బయటపడాలి?

చాణక్యుడి ఉద్దేశంలో, ఈ ఆరు పరిస్థితులు మనిషిని బయటి మంటలతో పని లేకుండా లోలోపలే కాల్చివేస్తాయి. అయితే, వీటి నుంచి బయటపడటానికి మనిషికి మానసిక ధైర్యం అవసరం. ఎక్కడైతే గౌరవం, ప్రశాంతత ఉండవో ఆ పరిస్థితుల నుండి దూరంగా జరగడమే విజ్ఞత అని ఆయన సూచిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే కష్టాలను చూసి కుంగిపోకుండా, వివేకంతో నిర్ణయాలు తీసుకున్నప్పుడే మనిషి సుఖసంతోషాలను పొందగలడు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More