వారంలో ఈ 3 రోజులు మాంసాహారం తింటే గ్రహ దోషాలు పెరుగుతాయా? శాస్త్రం ఏం చెప్తోంది
హిందూ సంప్రదాయంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో మాంసాహారం, ఉల్లిపాయ, వెల్లుల్లి తినడాన్ని నిషేధించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ రోజులు ఏవో, వాటి వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
మన హిందూ సంప్రదాయం ప్రకారం చాలా విషయాలను పాటిస్తూ ఉంటాం. తెలియక చేసినా కూడా వాటి పరిణామాలను మనం కచ్చితంగా ఎదుర్కోవాలి. హిందూ సంప్రదాయంలో మాంసాహారం, వెల్లుల్లి, ఉల్లి వంటివి కొన్ని రోజుల్లో తినడానికి నిషేధించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారంలో ఎప్పుడు ఉల్లి, మాంసాహారం వంటి వాటికి దూరంగా ఉండాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకు ఆహార నియమాలు?
మన హిందూ సంప్రదాయం ప్రకారం మనం తినే ఆహారం మన ఆలోచనలను ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ఆలోచనలకు, ఆహారానికి బలమైన సంబంధం ఉంది. శాస్త్రాలు కూడా ఈ విషయాన్ని చెబుతున్నాయి. మనం తీసుకునే ఆహారం మన గుణాలను నిర్ణయిస్తుంది. వారంలో కొన్ని ప్రత్యేక రోజుల్లో, కొన్ని తిథుల రోజుల్లో, పండుగ సమయాల్లో మాంసాహారం తినకూడదు. అలాగే వీలైతే ఉల్లి, వెల్లుల్లికి కూడా ఆ రోజుల్లో దూరంగా ఉండటం మంచిది. ఈ రోజుల్లో వీటిని తినడం వలన గ్రహదోషాలు పెరిగే అవకాశం ఉంది. దైవానుగ్రహం లభించదు అని చాలా మంది భక్తులు నమ్ముతారు. వారంలో ఏ రోజు వీటిని తినకుండా ఉంటే మంచిది ఇప్పుడు తెలుసుకుందాం.
మంగళవారం, గురువారం, శనివారం
మంగళవారం, గురువారం, శనివారం చాలా పవిత్రమైన రోజులు. మంగళవారం హనుమంతుడికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అంకితం చేశారు. ఈ రోజుల్లో మాంసాహారం తినడం వలన కుజదోషం తీవ్రంగా పెరిగిపోతుంది.అలాగే గురువారం విష్ణుమూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబాలను ప్రత్యేకంగా పూజిస్తాము. ఈ రోజున తామసిక ఆహారాన్ని పూర్తిగా ముట్టుకోకూడదు. శనివారం కలియుగ దైవం వెంకటేశ్వర స్వామివారి రోజు. శని దేవుడికి కూడా ఇష్టమైన రోజు. కనుక ఈ రోజు కూడా పొరపాటున మాంసాహారం ముట్టుకోకూడదు. ఈ మూడు రోజులు కచ్చితంగా నియమాలను పాటిస్తే మంచిది.
ఈ తిథుల్లో కూడా మాంసాహారం తినకూడదు
వారాలే కాదు, కొన్ని ప్రత్యేక తిథుల్లో కూడా మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి వంటివి తినకూడదు. ఏకాదశి, అమావాస్య, పౌర్ణమి రోజుల్లో మాంసాహారం తినకూడదు. అలాగే వీలైతే ఉల్లి, వెల్లుల్లికి కూడా దూరంగా ఉండాలి. ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే శరీరంతో పాటు మనసు కూడా ఎంతో పవిత్రంగా ఉంటుంది. ఏకాదశి వ్రతం ఆచరించడం వలన మోక్షం లభిస్తుంది. విష్ణు అనుగ్రహంతో ఆనందంగా ఉండొచ్చు. అమావాస్య నాడు పితృదేవతలకు పూజలు చేయాలి. కాబట్టి ఆ రోజు ఎంతో పవిత్రంగా ఉండాలి. తామసిక ఆహారాన్ని తీసుకోకూడదు.
ఉల్లి, వెల్లుల్లి ఎందుకు తినకూడదు?
మాంసాహారం వెనుక జీవకారుణ్యం ఉంటుంది. కానీ ఉల్లిని ఎందుకు దూరం పెట్టాలి అనే విషయానికి వస్తే, ఆయుర్వేదం మరియు జ్యోతిష్య శాస్త్రాల ప్రకారం ఆహారాన్ని వర్గీకరించడం జరిగింది. ఉల్లి, వెల్లుల్లి శరీరంలో అనవసరమైన కోపాన్ని, వేడిని, బద్ధకాన్ని పెంచుతాయని భావిస్తారు.
దైవ పూజలు చేసేటప్పుడు ఎప్పుడూ మనసు ప్రశాంతంగా ఉండాలి. ఏకాగ్రతతో ఉండాలి. అలాంటప్పుడు ఈ పదార్థాలను తింటే ఏకాగ్రత దెబ్బతింటుందని నమ్మకం. రాహువు, కేతువుల రక్తం నుంచి ఇవి ఉద్భవించాయని కూడా పురాణాల్లో ప్రస్తావన ఉంది. ఉపవాస రోజుల్లో, పండుగల్లో అందుకే ఉల్లిని కూడా వాడరు. అలాగే కార్తీక మాసం, శ్రావణ మాసం, మార్గశిర మాసంలో చాలా మంది ప్రతి రోజూ లేదా కొన్ని రోజుల్లో వీటిని ముట్టుకోరు. సాత్విక ఆహారం తీసుకోవడం వలన ఆరోగ్యం కూడా బాగుంటుంది. దైవచింతన పెరగడానికి, మానసిక ప్రశాంతతను పొందడానికి ఈ నియమాలను పాటిస్తే మంచిది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


