దీపావళి నాడు గోధుమలతో ఈ ఒక్క శక్తివంతమైన దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది, ఐశ్వర్యం కలుగుతుంది!

ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న వచ్చింది. దీపావళి నాడు ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దీపావళి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్ముతారు. చాలా మంది రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. వాటి నుంచి బయటపడడానికి కొన్ని పరిహారాలు ఇవిగో.

Published on: Oct 13, 2025, 15:00:18 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను ఆనందంగా జరుపుకుంటారు. దీపావళి నాడు పిల్లలు, పెద్దలు కూడా అందరితో కలిసి సరదాగా, సంతోషంగా పండుగను చేసుకుంటారు. ఈ సంవత్సరం దీపావళి పండుగ అక్టోబర్ 20న వచ్చింది. దీపావళి నాడు ప్రత్యేకించి లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. దీపావళి నాడు రాత్రి సమయంలో లక్ష్మీదేవిని పూజించడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగుపెడుతుందని నమ్ముతారు. చాలా మంది రకరకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు.

దీపావళి పండుగ 2025 (pinterest)
దీపావళి పండుగ 2025 (pinterest)

ఏ ఇబ్బంది లేకుండా సంతోషంగా ఉండడానికి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి లక్ష్మీదేవిని ఆ రోజు ఆరాధించడం మంచిది. అలా ఆరాధించడం వలన సకల శుభాలు కలుగుతాయి. అయితే దీపావళి సందర్భంగా లక్ష్మీదేవిని ఎలా పూజించాలి, ధన త్రయోదశి పూజ విధానం, నరక చతుర్దశి నాడు పాటించాల్సిన నియమాలు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

దీపావళి 2025

ధన త్రయోదశి నాడు యమ దీపాలను పెట్టండి

పండుగ మొదటి రోజు ధన త్రయోదశిని జరుపుకుంటారు. ఈ సంవత్సరం ధన త్రయోదశి అక్టోబర్ 18, శనివారం నాడు వచ్చింది. ప్రతి సంవత్సరం ఒక్కసారి మాత్రమే శక్తివంతమైన ధన త్రయోదశి ఏర్పడుతుంది. ఆ రోజు లక్ష్మీదేవిని, కుబేరుని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయి. ఆ రోజు ఎవరైతే కుబేరుని ఆరాధిస్తారో వారి ఇంట్లో డబ్బు పుష్కలంగా చేరుతుంది. మృత్యు దోషాలు తొలగిపోతాయి. అపమృత్యు బాధల నుంచి కూడా బయటపడవచ్చు. అందుకే ఆ రోజు యమ దీపాలను వెలిగిస్తారు. ధన త్రయోదశి నాడు పూజ గదిలో లక్ష్మీదేవి చిత్రపటం పెట్టి, దాని ముందు మట్టి ప్రమిదలో రెండు నెయ్యి దీపాలు వెలిగించాలి.

దానిమ్మ పండ్లను లక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టాలి. ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలను వెలిగించాలి. అలా చేస్తే లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు కలుగుతాయి. అక్టోబర్ 18 సాయంత్రం ఇంటి దక్షిణ దిశలో యమ దీపాన్ని వెలిగించండి. బియ్యం పిండితో ఒక ప్రమిద తయారు చేసి, దానిలో ఆవు నూనె వేసి నాలుగు వత్తులు పెట్టి, దక్షిణముఖంగా దీపాన్ని వెలిగించాలి. ఇలా చేయడం వలన యముడు ఆశీస్సులు లభిస్తాయి. అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు.

నరక చతుర్దశి నాడు ఇలా చేస్తే నరపీడ దోషాలను తొలగించుకోవచ్చు

నరక చతుర్దశి ఈ సంవత్సరం అక్టోబర్ 19న వచ్చింది. తప్పకుండా తలకు నువ్వుల నూనె రాసుకొని తల స్నానం చేయాలి. అభ్యంగన స్నానం చేసిన తర్వాత కొత్త వస్త్రాలు ధరించాలి. అలా చేస్తే నరపీడ దోషాలు తొలగిపోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. ఆ రోజు మహాలక్ష్మిని పూజిస్తే సుఖ సంతోషాలను పొందవచ్చు.

దీపావళి పండుగ

ఆ రోజు ఇంటి ముందు దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని ఆరాధించాలి. అక్టోబర్ 20 సోమవారం సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల మధ్యలో లక్ష్మీదేవిని అలంకరించి పూజలు చేయాలి. బంగారం, వెండి ఆభరణాలను లక్ష్మీదేవి ముందు పెట్టి పూజించాలి. ఆ రోజు అఖండ ఐశ్వర్యం కలగాలంటే గోధుమల దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం వెలిగించడం వలన సంవత్సరం అంతా లక్ష్మీదేవి మీతోనే ఉంటుంది, మీ ఇంటి నుంచి ఎక్కడికీ వెళ్ళిపోదు.

గోధుమ దీపం విధానం:

సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇంటి ముఖద్వారం బయట ఒక పళ్లెంలో నిండా గోధుమలు పోయాలి. ఆ తర్వాత మట్టి ప్రమిదను ఆ గోధుమల మీద పెట్టి, నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఈ దీపం ఎంత ఎక్కువ సేపు వెలిగితే, అంత ఐశ్వర్యం కలుగుతుంది. దీపం కొండెక్కాకా ఆ గోధుమలను నానబెట్టి గోమాతకు ఆహారంగా పెట్టాలి. గోధుమ దీపాన్ని దీపావళి నాడు వెలిగించడం వలన ఐశ్వర్యం కలిగి, సంతోషంగా ఉండవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More