నవంబర్ 6న ధన త్రయోదశితో పాటు శుక్ర ప్రదోషం.. ఆ రోజు శివుడిని ఇలా పూజిస్తే విశేష ఫలితాలు!

2026 నవంబర్ 6వ తేదీన ధన త్రయోదశి (ధన్తేరస్)తో పాటు శుక్ర ప్రదోష వ్రతం రావడం విశేషంగా నిలవనుంది. శుక్రవారం రోజున త్రయోదశి తిథి రావడంతో దీనిని శుక్ర ప్రదోషంగా పిలుస్తారు. ఈ సందర్భంగా భక్తులకు మహాలక్ష్మి, కుబేరుడు, వినాయకుడితో పాటు పరమశివుడు, పార్వతీదేవిని కూడా ఆరాధించే అవకాశం లభిస్తుంది. 

Published on: Nov 2, 2026, 12:31:00 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

హిందూ సనాతన ధర్మంలో పండుగలకు, విశేష తిథులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈసారి వచ్చే ధన త్రయోదశి పండుగ మాత్రం భక్తులకు అత్యంత ప్రత్యేకమైనదిగా నిలవనుంది. నవంబర్ 6, 2026 నాడు ధన త్రయోదశి పర్వదినంతో పాటు 'శుక్ర ప్రదోష వ్రతం' కలిసి రావడం విశేషం.

నవంబర్ 6న ధన త్రయోదశితో పాటు శుక్ర ప్రదోషం.. ఆ రోజు శివుడిని పూజిస్తే విశేష ఫలితాలు!
నవంబర్ 6న ధన త్రయోదశితో పాటు శుక్ర ప్రదోషం.. ఆ రోజు శివుడిని పూజిస్తే విశేష ఫలితాలు!

వారం పరంగా శుక్రవారం నాడు త్రయోదశి తిథి రావడంతో దీనిని 'శుక్ర ప్రదోషం' అంటారు. సాధారణంగా ధన త్రయోదశి రోజున సిరుల తల్లి మహాలక్ష్మి, విఘ్నేశ్వర స్వామి, కుబేర దేవుడిని పూజిస్తుంటాం. అయితే, ఈసారి ప్రదోష వ్రతం తోడవడంతో జగత్జనని పార్వతీదేవితో పాటు పరమశివుడిని కూడా ఆరాధించే అద్భుతమైన అవకాశం భక్తులకు దక్కుతోంది. ఈ పర్వదినానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు పరిశీలిద్దాం.

నవంబర్ లో శుక్ర ప్రదోష వ్రతం ఎప్పుడు వస్తోంది?

హిందూ పంచాంగం ప్రకారం, కార్తీక మాసం కృష్ణ పక్ష త్రయోదశి తిథి నవంబర్ 6, 2026 ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ తిథి మరుసటి రోజు అంటే నవంబర్ 7న ఉదయం 10:47 గంటలకు ముగుస్తుంది.

ప్రదోష వ్రతంలో సాయంత్రం వేళ శివారాధనకు అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ప్రదోష కాలంలో త్రయోదశి తిథి నవంబర్ 6వ తేదీనే వస్తున్నందున, శుక్ర ప్రదోష వ్రతాన్ని కచ్చితంగా ఆరోజే ఆచరించాలని పండితులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారపు ప్రదోషం రోజున భక్తిశ్రద్ధలతో మహాదేవుడిని, పార్వతీదేవిని కొలిస్తే కుటుంబంలో సుఖసంతోషాలు నిలుస్తాయని ప్రగాఢ నమ్మకం.

పూజా శుభ ముహూర్తం వివరాలు

నవంబర్ 6వ తేదీన సాయంత్రం వేళ పూజ చేసుకోవడానికి అత్యుత్తమ సమయం లభిస్తోంది. దృక్ పంచాంగం ప్రకారం, ప్రదోష పూజా ముహూర్తం సాయంత్రం 5:14 గంటల నుంచి రాత్రి 7:49 గంటల వరకు ఉంటుంది. అంతేకాకుండా ఆ రోజు బ్రహ్మ ముహూర్తం ఉదయం 4:25 నుండి 5:17 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:19 నుండి మధ్యాహ్నం 12:04 వరకు ఉంది.

అలాగే నిశిత ముహూర్తం రాత్రి 11:16 నుండి 12:08 వరకు కొనసాగుతుంది. వ్రతం ఆచరించే వారు సాయంత్రం పూజా ముహూర్తంలో శివాలయానికి వెళ్లి లేదా ఇంట్లో రుద్రాభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవడం శ్రేయస్కరం.

ఈరోజు శివ పూజ విశిష్టత

లక్ష్మీదేవి, కుబేరుడి పూజలే గుర్తుకువస్తాయి. ఇంటా బయటా సిరిసంపదలు వర్షించాలని కోరుకుంటూ ప్రజలు ఈ పండుగను జరుపుకుంటారు. అయితే ఈసారి ఇదే రోజు శుక్ర ప్రదోషం కలవడం వల్ల భక్తులకు లక్ష్మీదేవితో పాటు పరమశివుడి అనుగ్రహాన్ని ఒకే రోజు పొందే అరుదైన అవకాశం లభిస్తోంది.

సాయంత్రం వేళ శివలింగానికి జలాభిషేకం, పాలు, మారేడు దళాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేయాలి. ఆ తర్వాత దీపారాధన చేసి శివమంత్రాలను పఠించడం వల్ల ఇంటా బయటా సానుకూల వాతావరణం ఏర్పడి, సుఖశాంతులు వెల్లివిరుస్తాయి.

శుక్ర ప్రదోష వ్రత పూజా విధానం

శుక్ర ప్రదోష రోజున ఉదయమే త్వరగా లేచి తలస్నానం చేసి, శుభ్రమైన వస్త్రాలు ధరించి వ్రత సంకల్పం తీసుకోవాలి.

రోజంతా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండటం మంచిది. సాయంత్రం ప్రదోష కాలం ప్రారంభం కాగానే పూజా మందిరాన్ని శుభ్రం చేసి, శివపార్వతుల ప్రతిమ లేదా చిత్రపటానికి దీపం వెలిగించాలి.

శివలింగానికి జలాభిషేకం, పాలు, అక్షతలు, పువ్వులతో పూజలు చేయాలి. గణేశుడిని స్మరించుకున్న తర్వాత శివ చాలీసా లేదా ప్రదోష వ్రత కథను పఠించాలి.

చివరిగా హారతి ఇచ్చి కుటుంబ సభ్యులందరి శ్రేయస్సును కోరుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత శక్తికొద్దీ పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యప్రదంగా భావిస్తారు.

ప్రదోష వ్రత ప్రాముఖ్యత

హిందూ సంప్రదాయంలో ప్రదోష వ్రతం లయకారకుడైన శివుడికి, పార్వతీదేవికి అంకితం చేయబడింది. ప్రతి నెలా కృష్ణ, శుక్ల పక్షాల త్రయోదశి తిథుల రోజున ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ప్రదోష కాలంలో మహాదేవుడిని అర్చించడం వల్ల సమస్త పాపాలు తొలగిపోయి భక్తులకు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More