దశ దానాలు, వాటి వలన కలిగే లాభాలు.. ఈ దానం చేస్తే అఖండ విజయాలు, అనంత సంపదలు

పేదవారికి మన శక్తి కొద్దీ దానం చేస్తే, దాని వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. మనం చేసే ద్రవ్య సహాయం లేదా వస్తు సహాయాన్ని ధర్మం అని అంటారు. శాస్త్ర నియమాల ప్రకారం చూస్తే, దాన యోగ్యమైనవి కొన్ని ఉంటాయి. వాటినే దానంగా ఇవ్వాలి. వాటిని దశ దానాలు అని పిలుస్తారు.  దశ దానాలు, వాటి వలన కలిగే లాభాలు తెలుసుకోండి.

Published on: Jan 10, 2026, 08:30:12 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

దానం చేయడం వలన విశేషమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. దానం, ధర్మం అనే మాటలు ప్రతి ఒక్కరూ వింటారు. అయితే ఎవరైనా పేదవారికి మన శక్తి కొద్దీ దానం చేస్తే, దాని వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. మనం చేసే ద్రవ్య సహాయం లేదా వస్తు సహాయాన్ని ధర్మం అని అంటారు. ధర్మం చేయడం వలన ఎంతో పుణ్యం వస్తుంది. ఇహలోక సౌక్యాలకు దోహదం చేస్తుంది. చాలా మందికి దశ దానాలు అంటే ఏంటి? అనే సందేహం ఉంటుంది. మరి దశ దానాలు అంటే ఏంటి? ఏ దానం చేయడం వలన ఎలాంటి పుణ్య ఫలితం కలుగుతుంది? అనే దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దశ దానాలు, వాటి వలన కలిగే లాభాలు (pinterest)
దశ దానాలు, వాటి వలన కలిగే లాభాలు (pinterest)

దశ దానాలు అంటే ఏంటి?

నిజానికి శాస్త్ర నియమాల ప్రకారం చూస్తే, దానయోగ్యమైనవి కొన్ని ఉంటాయి. వాటినే దానంగా ఇవ్వాలి. వాటిని దశ దానాలు అని పిలుస్తారు. ఆవు నెయ్యి, దూడతో కూడి ఉన్న ఆవు, భూమి, నువ్వులు, బంగారం, ధాన్యం, వస్త్రాలు, బెల్లం, ఉప్పు, వెండి ఈ పదిని కూడా దశ దానాలు అని అంటారు. శాస్త్రం కూడా ఇదే చెప్తోంది. అయితే వీటిని దానం చేసేటప్పుడు మంత్రపూర్వకంగా మాత్రమే దానం చేయాలి అని గుర్తుపెట్టుకోండి. ఇక ఏ దానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూద్దాం.

దశ దానాలు, వాటి వలన కలిగే లాభాలు:

1.భూదానం

భూమిని దానం చేస్తే అనంత పుణ్య ఫలితం పొందడానికి వీలవుతుంది. భూదానం చేయడం వలన శివలోక ప్రాప్తిని అనుగ్రహించడానికి ఆ దాతకు వీలవుతుంది. శివుడు ఎంతో సంతోషిస్తాడు.

2.గోదానం

గోదానం చేసేటప్పుడు కచ్చితంగా బాగా పాలు ఇచ్చే, వయసులో ఉన్న ఆవుని, దూడతో కూడిన ఆవుని ఇవ్వాలి. ఆవును బంగారు కొమ్ములు, వెండి డెక్కలు, కంచు మూపురం, రాగి తోకతో పాటు నూతన వస్త్రాలతో అలంకరించాలి. ఆవును ఇచ్చేటప్పుడు పాలు పితికే పాత్రను కూడా ఇచ్చి, ఫల, దక్షిణ, తాంబూలాలను సమర్పించాలి. ఆవుకు కనీసం 6 నెలల గ్రాసాన్ని కూడా సమర్పించాలి. ఇలా దానం చేయడం వలన విష్ణువు సంతోషించి స్వర్గలోక ప్రాప్తిని అందిస్తాడు.

3.తిలదానం

తిల దానం అంటే నువ్వులను దానం ఇవ్వడం. విష్ణువు శరీరం నుంచి పుట్టిన నువ్వులను దానం చేస్తే సమస్త పాపాలు కూడా తొలగిపోతాయి. విష్ణువు యొక్క ప్రాప్తిని పొందవచ్చు.

4.సువర్ణ దానం

హిరణ్య దానం లేదా సువర్ణ దానం అంటే బంగారాన్ని దానంగా ఇవ్వడం. బ్రహ్మదేవుని గర్భం నుంచి వచ్చిన బంగారాన్ని దానం చేస్తే సమస్త కర్మల నుంచి విముక్తిని పొందవచ్చు. సువర్ణ దానం చేస్తే అగ్నిదేవుడు సంతోషించి అగ్నిలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

5.ఆజ్య దానం

ఆజ్య అంటే నెయ్యి. ఆవు నెయ్యిని దానం చేయాలి. ఆవు నెయ్యిని దానం చేయడం వలన మహేంద్రుడు సంప్రీతుడై ఇంద్రలోక ప్రాప్తిని కలిగిస్తాడు.

6.వస్త్ర దానం

వస్త్రాలను దానం చేస్తే సర్వదేవతలు సంతోషిస్తారు. సకల శుభాలు కలుగుతాయి.

7.గుడ దానం

గుడ దానం అంటే బెల్లం దానంగా ఇవ్వడం. బెల్లం దానం చేస్తే లక్ష్మీ గణపతులు సంప్రీతులవుతారు. అఖండ విజయాలు, అనంత సంపదలను ఇస్తారు.

8.ధాన్య దానం

ధాన్యాన్ని దానంగా ఇవ్వడం కూడా మంచిది. ధాన్యాన్ని దానంగా ఇవ్వడం వలన సకల సౌఖ్యములు కలుగుతాయి. సకల దిక్పాలకులు కూడా సంతృప్తి చెందుతారు.

9.రజత దానం

వెండిని దానంగా ఇవ్వడం కూడా మంచిది. ఈ దానంతో శివకేశవులు సంతోషిస్తారు. సర్వ సంపదలను, వంశాభివృద్ధిని కలిగిస్తారు.

10.లవణ దానం

ఉప్పును దానంగా ఇస్తే ఆ జాతకునికి ఆయుర్దాయం కలుగుతుంది. బలం, ఆనందం కూడా కలుగుతాయి.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More