మరణం తర్వాతే అసలైన కథ మెుదలవుతుందా? చనిపోయాక కొన్ని గంటలు ఆత్మ ఏం చేస్తుంది?

మనిషి పుట్టుక ఎంత గొప్పదో.. చావు కూడా అంతే గొప్పది. రెండింటినీ సమానంగా స్వీకరించాలి. చాలా మందికి మరణం తర్వాత ఏం జరుగుతుందోననే ప్రశ్నలు వస్తుంటాయి. గురడ పురాణంలో దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఉన్నాయి.

Published on: May 20, 2026, 18:32:53 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

మరణం తర్వాత ఏం జరుగుతుందనేది చాలా పెద్ద ప్రశ్న. ఎందుకంటే బతికి ఉన్నవాళ్లకు దీని సమాధానం తెలియదు కాబట్టి. కానీ గరుడ పురాణంలోని ప్రేత ఖండంలో చెప్పినట్లుగా మరణం తర్వాత కొన్ని గంటలలో ఆత్మకు చాలా విషయాలు అర్థం అవుతాయ్. సంపాదన, బంధుత్వం, నాది-నీది.. ఇలా చాలా విషయాలపై క్లారిటీ వస్తుంది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఒక మనిషి చనిపోయిన తర్వాత శ్మశానంలో చితికి నిప్పంటించి అందరూ తిరిగి వస్తారు. ఇక అక్కడ మిగిలేది కేవలం బూడిద, నిశ్శబ్దం, చనిపోయిన వ్యక్తి ఆత్మ మాత్రమే. ఎన్నో ఏళ్లుగా తాను ప్రేమించి, అలంకరించుకుని, అద్దంలో గర్వంగా చూసుకున్న తన శరీరం కేవలం బూడిదగా మారిపోతుంది. అందం అనే పదానికి అర్థం లేకుండా పోతుంది. ఈ సమయంలో తన శరీరం కాలిపోవడాన్ని చూసి ఆత్మ బాధపడుతుంది. అగ్ని వేడికి అది తిరిగి శరీరంలోకి ప్రవేశించలేకపోతుందని గరుడ పురాణం చెబుతోంది. ఈ భౌతిక ప్రపంచంలో తాను భాగం కాదనే చేదు నిజాన్ని ఆత్మ అర్థం చేసుకుంటుంది

గరుడ పురాణం ప్రకారం, పుర్రె పగిలిన వెంటనే వచ్చే పెద్ద శబ్దంతో ఆత్మకు మరింత క్లారిటీ వస్తుంది. ఈ క్షణంలో భౌతిక శరీరంతో ఆత్మకు ఉన్న చివరి బంధం శాశ్వతంగా తెగిపోతుంది. శ్మశానం నుండి తిరిగి వచ్చేటప్పుడు కుటుంబ సభ్యులు వెనక్కి తిరిగి చూడకూడదనే నియమం ఉంది. ఎందుకంటే ఆ భయంకరమైన ప్రదేశంలో తమను ఒంటరిగా వదిలి వెళ్తున్న వారిని చూసి నన్ను కూడా తీసుకువెళ్ళండి అని ఆత్మ అరుస్తుందట.

శ్మశానంలోని ఒంటరితనం, వింత ఆత్మలకు భయపడి, ఆత్మ తన కుటుంబ సభ్యుల వెంట పరిగెత్తి ఇంటికి తిరిగి వస్తుంది. అయితే కుటుంబ సభ్యులు వేప ఆకులు నమలడం, ఇనుము లేదా నిప్పును తాకడం వంటి ఆచారాలు నిర్వహిస్తారు. అంతేకాదు పులు తీసుకెళ్లి ఫొటో దగ్గర పెట్టడం, చేదు నోరు.. ఇలా ప్రాంతాన్ని బట్టి ఆచారాలు ఉన్నాయి. దీనివల్ల ఆత్మ వెంటనే ఇంట్లోకి ప్రవేశించడం కష్టమవుతుంది.

తాను చనిపోయినందుకు ఇంట్లోని కొందరు కుటుంబ సభ్యులు మరణానికి దుఃఖిస్తుంటాడు. మరికొందరు ఆస్తిపాస్తుల లెక్కల గురించి ఆలోచిస్తుంటారు. ఇవన్నింటినీ ఆత్మ నిశితంగా గమనిస్తుంది. తన జీవితాంతం ఇతరుల మనసులను గాయపరిచిన డబ్బు, ఆస్తిపాస్తులు, నగలు అన్నీ వ్యర్థమని, తాను ఒట్టి చేతులతో నిలబడి ఉన్నానని గ్రహిస్తుంది. అంతేకాదు బంధాలను చూసి ఆత్మ బాధపడుతుంది. శూన్యతా భావన ఆత్మను తీవ్రంగా కుంగదీస్తుంది.

బాల్యం నుండి వృద్ధాప్యం వరకు తాను చేసిన పాపాలు, పుణ్యకార్యాలు అన్నింటినీ గుర్తు చేసుకుంటుంది ఆత్మ. ఎవరినైనా మోసం చేసి ఉంటే కన్నీరు కార్చుతుంది. పాపాలు చేసిన ఆత్మలు రెప్పవేయని కళ్ళతో, భయంకరమైన రూపంతో యమదూతలను చూస్తుండగా, పుణ్యకార్యాలు చేసిన ఆత్మలను సౌమ్యమైన యమదూతలు లేదా నిజమైన విష్ణుదూతలు గౌరవంగా వచ్చి తీసుకువెళతారని నమ్మకం.

గరుడ పురాణం ప్రకారం, మరణించినవారికి పిండం సమర్పించడం చాలా ముఖ్యం. ఆచారం ప్రకారం ఇది చేయకపోతే, ఆత్మ తీవ్రమైన ఆకలి కారణంగా శ్మశానంలో లేదా నీటి వనరుల సమీపంలో సంచరిస్తుందని చెబుతుంటారు. ఒక వ్యక్తి జీవించి ఉన్నప్పుడు అహంకారాన్ని విడిచిపెట్టి దానధర్మాలు చేయాలి. పేదలకు సహాయం చేయాలి. మనం జీవించి ఉన్నప్పుడు చేసిన మంచి పనులు మాత్రమే మరణం తర్వాత మనతో ఉంటాయి.

గమనిక : ఇది కేవలం నమ్మకాల మీద ఆధారపడిన కథనం. ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More