Jyeshtha Masam: నేటి నుంచి జ్యేష్ఠ మాసం.. ఈసారి 60 రోజులు.. ఈ మాసంలో వచ్చే ముఖ్య తిధులు, కష్టాలకు పరిహారాలు తెలుసుకోండి!

Jyeshtha Masam 2026: తెలుగు పంచాంగం ప్రకారం అత్యంత పవిత్రమైన జ్యేష్ఠ మాసం మే 2 నుంచి ప్రారంభమైంది. ఈ ఏడాది 'అధిక మాసం' రావడంతో జ్యేష్ఠ మాసం 60 రోజుల పాటు ఉండటం విశేషం. ఈ అరుదైన కాలంలో పితృ దోషాలు తొలగి, బ్రహ్మదేవుడి అనుగ్రహం కలగాలంటే ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకోండి.

Published on: May 2, 2026, 08:00:21 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వైశాఖ మాసం పూర్తయిపోయింది. జ్యేష్ఠ మాసం ఈరోజు నుంచి మొదలు కాబోతోంది. తెలుగు పంచాంగం ప్రకారం జ్యేష్ఠ మాసం అనేది మూడవ మాసం. ఈ నెలలో బ్రహ్మదేవుని ఆరాధించడం వలన ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు. పితృదేవతల రుణాన్ని తీర్చుకోవడానికి కూడా ఈ మాసం సరైనది. అలాగే పాపాలను పరిహరించుకోవడానికి, దైవ సేవలో లీనం అవ్వడానికి కావాల్సిన పుణ్య తిధులు జ్యేష్ఠ మాసంలో ఉంటాయి.

Jyeshtha Masam 2026: ఈసారి 60 రోజులు.. మీ కష్టాలు తీరాలంటే ఈ పనులు తప్పనిసరి (pinterest)
Jyeshtha Masam 2026: ఈసారి 60 రోజులు.. మీ కష్టాలు తీరాలంటే ఈ పనులు తప్పనిసరి (pinterest)

ఈ ఏడాది అధిక మాసం కూడా ఉంది. అంటే ఒక నెల ఎక్కువగా ఉంటుంది. అది కూడా జ్యేష్ఠ మాసమే ఎక్కువగా ఉంటుంది. అంటే 60 రోజుల పాటు జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ జ్యేష్ఠ మాసంలో ఉన్న విశేష తిధులతో పాటుగా పాపాలు తొలగిపోవాలంటే ఏం చేయాలో కూడా తెలుసుకుందాం.

జ్యేష్ఠ మాసం నేటి నుంచి ప్రారంభం

తెలుగు పంచాంగం ప్రకారం మే 2వ తేదీ నుంచి జ్యేష్ఠ మాసం మొదలైంది. ఈ నెలలో కొన్ని తిధులు చాలా ప్రత్యేకమైనవి. ఆ రోజుల్లో దైవారాధన గురించి, ఈ మాసం విశిష్టత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

బ్రహ్మదేవుడి అనుగ్రహం కోసం జ్యేష్ఠ మాసంలో ఇలా చేయండి:

జ్యేష్ఠ మాసం బ్రహ్మదేవుడికి చాలా ఇష్టం. ఈ నెలలో బ్రహ్మదేవుడికి గోధుమ పిండితో దీపం చేసి పూజ చేయడం వలన చక్కటి ఫలితం కనబడుతుంది. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే కూడా ఎంతో పుణ్యం కలుగుతుంది.

నిర్జల ఏకాదశి:

జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిని నిర్జల ఏకాదశి అంటారు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని ఆరాధించడం వలన ఎంతో పుణ్యం కలుగుతుంది. నిర్జల ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా కఠిన ఉపవాసం ఉండాలి. ఏకాదశి వ్రతం చేసి పెసరపప్పు, పాయసం, నెయ్యి, గొడుగు, పానకం వంటి వాటిని దానం చేస్తే చాలా మంచిది. ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే 12 ఏకాదశులను చేసిన పుణ్యం వస్తుంది.

రంభా తృతీయ:

జ్యేష్ఠ శుద్ధ తదియని రంభా తృతీయ అంటాము. ఈరోజు పార్వతి దేవిని ప్రత్యేకంగా పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్ని రకాల దానాలు చేయడానికి కూడా ఇది చాలా మంచి రోజు. అన్నదానం చేస్తే కూడా విశేష ఫలితాన్ని పొందవచ్చు.

దశపాపహర దశమి:

జ్యేష్ఠ శుద్ధ దశమిని దశపాపహర దశమి అని పిలుస్తారు. గంగా స్నానం లేదా ఏదైనా నదిలో స్నానం చేస్తే ఎంతో మంచి ఫలితం ఉంటుంది. పదిసార్లు మునిగితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆ రోజు నల్ల నువ్వులు, నెయ్యి, పేలాలు, బెల్లాన్ని నదిలో వేస్తే కూడా మంచిది.

వట సావిత్రి వ్రతం:

జ్యేష్ఠ పౌర్ణమి తర్వాత 13వ రోజున మహిళలందరూ కూడా వట సావిత్రి వ్రతం చేస్తారు. భర్త ఆరోగ్యంగా, దీర్ఘాయుష్మంతులు కావాలని కోరుకుంటారు.

మహా జ్యేష్ఠి (జ్యేష్ఠ పౌర్ణమి):

జ్యేష్ఠ పౌర్ణిమను మహా జ్యేష్ఠి అని అంటారు. ఇది కూడా చాలా విశేషమైన రోజు. ఆ రోజు దానాలు చేస్తే చాలా మంచి జరుగుతుంది. ఈ పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. ఇది రైతులు జరుపుకునే పండుగ. ఎద్దులను అందంగా అలంకరించి, పొంగలి పెట్టి ఊరేగింపుగా పొలాల దగ్గరికి తీసుకువచ్చి దుక్కి దున్నిస్తారు.

యోగినీ/సిద్ధ ఏకాదశి:

జ్యేష్ఠ బహుళ ఏకాదశిని యోగినీ ఏకాదశి లేదా సిద్ధ ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి వ్రతం ఆచరిస్తే కూడా మంచి జరుగుతుంది.

ఇలా జ్యేష్ఠ మాసంలో చూసినట్లయితే ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఎంతో పవిత్రమైన ఈ జ్యేష్ఠ మాసంలో పైన చెప్పినట్లు ఆచరిస్తే శుభ ఫలితాలను పొందవచ్చు.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More