కార్తీక అక్షయ నవమి 2026: ఉసిరి చెట్టు పూజ ఎందుకు చేస్తారు? మహాలక్ష్మి ప్రారంభించిన ఆచారం, పురాణ విశేషాలు ఇవే!
హిందూ సంప్రదాయంలో కార్తీక శుక్ల నవమిని అక్షయ నవమిగా అత్యంత పవిత్రంగా భావిస్తారు. ఈ రోజుకు ఆధ్యాత్మికంగా, పౌరాణికంగా ఎంతో విశిష్టత ఉంది. ఈ తిథి రోజున ఉసిరి చెట్టును పూజించడం వల్ల శ్రీమహావిష్ణువు, పరమశివుడి అనుగ్రహం లభిస్తుందని భక్తుల విశ్వాసం.
హిందూ సంప్రదాయంలో కార్తీక మాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ మాసంలో వచ్చే ప్రతి పండగకూ, తిథికీ ప్రత్యేక ఆధ్యాత్మిక నేపథ్యం ఉంటుంది. అందులోనూ కార్తీక శుక్ల నవమిని అక్షయ నవమిగా అత్యంత పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ విశేషమైన రోజునే ద్వాపర యుగం ప్రారంభమైందని, శ్రీకృష్ణ భగవానుడు ఇదే కాలంలో జన్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, కృష్ణుడు బృందావనం, గోకుల వీధులను వీడి మధురకు పయణమైన చారిత్రక ఘట్టం కూడా ఈ నవమితోనే ముడిపడి ఉంది.

సాక్షాత్తు శ్రీమహావిష్ణువు, శివుడు ఇద్దరి ఆశీస్సులు ఒకేసారి లభించే ఈ పర్వదినాన ఉసిరి చెట్టును పూజించడం విశేష ఫలితాలను ఇస్తుంది. సంతాన సౌభాగ్యాలు, కుటుంబంలో సుఖశాంతులు వెల్లివిరియాలని కోరుకుంటూ భక్తులు ఈ రోజు ప్రత్యేక వ్రతాలు ఆచరిస్తారు.
మహాలక్ష్మి ప్రారంభించిన ఆచారం
ఈ పర్వదినం వెనుక ఒక సుందరమైన పౌరాణిక గాథ ప్రచారంలో ఉంది. ఒకసారి లక్ష్మీదేవి భూలోక సంచారానికి వచ్చినప్పుడు, విష్ణువుతో పాటు శివుడిని ఇద్దరినీ ఒకేసారి పూజించాలని సంకల్పించింది. విష్ణు పూజకు తులసి, శివ పూజకు బిల్వత్రం ముఖ్యమైనప్పుడు, ఈ రెండింటినీ కలిపి ఏకకాలంలో ఎలా పూజించాలనే మీమాంసలో పడింది. అప్పుడే లక్ష్మీదేవికి ఒక దివ్యమైన ఆలోచన వచ్చింది. ఉసిరి చెట్టులో తులసి, మారేడు రెండింటి గుణాలు లీనమై ఉంటాయని, ఆ చెట్టులో హరిహరులుద్దరూ నివసిస్తారని ఆమె గ్రహించింది.
అందుకే ఉసిరి చెట్టును విష్ణు-శివుల ప్రతీకగా భావించి లక్ష్మీదేవి భక్తిశ్రద్ధలతో పూజించింది. ఆమె భక్తికి మెచ్చి హరిహరులిద్దరూ ప్రత్యక్షమయ్యారు. ఆ తర్వాత లక్ష్మీదేవి స్వయంగా ఉసిరి చెట్టు కిందే భోగ్య పదార్థాలు వండి వారికి వడ్డించింది. అప్పటి నుంచే ఈ నవమి రోజున ఉసిరి చెట్టు కింద పూజలు చేసి, అక్కడే భోజనం చేసే సంప్రదాయం వచ్చింది.
రాక్షస సంహారము
ఈ ప్రత్యేక రోజున శ్రీమహావిష్ణువు కూష్మాండకుడు అనే రాక్షసుడిని వధించాడని పురాణాలు చెబుతున్నాయి. విష్ణువు చేతిలో ఆ దైత్యుడు హతమైన తర్వాత, అతడి శరీరం నుంచి వచ్చిన రోమాల ద్వారా 'కూష్మాండ' (గుమ్మడికాయ) తీగ ఉద్భవించింది. అందుకే ఈ నవమి రోజున గుమ్మడికాయను దానం చేయడం వెనుక పెద్ద విశేషం దాగి ఉంది.
ఉసిరి చెట్టు ఆవిర్భావ రహస్యం
ఉసిరి చెట్టు ఎలా పుట్టిందనే అంశంపై పద్మ పురాణం, స్కంద పురాణాల్లో ప్రధానంగా రెండు గాథలు కనిపిస్తాయి. ప్రళయ కాలంలో బ్రహ్మదేవుడి కళ్ల నుంచి రాలిపడిన ఆనంద బాష్పాల ద్వారా ఉసిరి చెట్టు ఉద్భవించిందని కొందరి నమ్మకం. ఇక సముద్ర మథనం సమయంలో అమృతం ఉద్భవించిన వేళ, భూమిపై చినుకులు పడటం వల్ల కూడా ఉసిరి వృక్షం వెలసిందని మరొక కథనం చెబుతుంది. అలాగే, విష్ణుమూర్తి వరాహ అవతారంలో భూమిని ఉద్ధరిస్తున్నప్పుడు సంతోషంతో ఆయన కళ్ల నుంచి జారిన కన్నీటి బిందువుల నుంచి ఈ వృక్షం పుట్టుకొచ్చిందని చెబుతారు.
దాన ధర్మాలతో అక్షయ ఫలితం
కార్తీక శుక్ల నవమి నుంచి పౌర్ణమి వరకు శ్రీమహావిష్ణువు ఉసిరి చెట్టుపైనే నివసిస్తాడని నమ్ముతారు. అందుకే ఈ ఐదు రోజులు ఉసిరి చెట్టుకు చేసే పూజలు అత్యంత శక్తివంతమైనవిగా భావిస్తారు. ఈ పర్వదినాన చేసే జపం, తపస్సు, దానం మరియు పూజా కార్యక్రమాల ఫలితం ఎప్పటికీ తరగకుండా 'అక్షయం'లా నిలిచిపోతుంది.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


