అగ్నిదేవుడి రహస్యాలు: అగ్నిదేవుడి 5 రూపాలు, ఇష్టమైన నైవేద్యాలు ఇవే!
సనాతన ధర్మంలో అగ్నిదేవునికి అత్యున్నత స్థానం ఉంది. బ్రహ్మాండంలో నాలుగు రూపాల్లో, భూమిపై ఐదు రూపాల్లో దర్శనమిచ్చే అగ్నిదేవుడి పుట్టుక, ఆయనకు ఉన్న శాపం వెనుక ఉన్న ఆసక్తికర కథనాలు ఇక్కడ తెలుసుకోండి.
సనాతన వైదిక సంప్రదాయంలో అగ్నిదేవునికి అత్యున్నత స్థానం ఉంది. వేదాలలో మొదటిదైన ఋగ్వేదంలో తొలి మంత్రమే అగ్నిదేవుని ఆరాధనతో ప్రారంభమవుతుంది. "ఓం అగ్నిమీళే పురోహితమ్ యజ్ఞస్య దేవమృత్విజమ్..." అంటూ ఋషులు అగ్నిని కొలిచారు. ఋగ్వేదం మొదటి అధ్యాయంలోని తొలి తొమ్మిది శ్లోకాలు పూర్తిగా అగ్నిదేవునికే అంకితం చేశారు.

దీనిని బట్టి వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు అగ్ని విశిష్టతను గుర్తించారని స్పష్టమవుతోంది. యాస్కాచార్యుల వారు అగ్నిని 'అగ్రణి' అని పేర్కొన్నారు, అంటే అందరికంటే ముందుండేవాడు అని అర్థం. అష్టవసువులలో కూడా అగ్నిదేవుని స్థానం మొదటిదే. ఎల్లప్పుడూ పైకే ప్రవహించడం అగ్ని సహజ లక్షణం.
బ్రహ్మాండంలో నాలుగు రూపాలు
ఈ సృష్టిలో అగ్ని నాలుగు ప్రధాన రూపాలలో విస్తరించి ఉంది. ఆకాశంలో సూర్యుడిగా, అంతరిక్షంలో మెరుపుగా, భూమిపై సాధారణ నిప్పుగా, పాతాళంలో అగ్నిపర్వతం (జ్వాలాముఖి) రూపంలో అగ్నిదేవుడు కొలువై ఉన్నాడు.
భూమిపై పంచ రూపాలు
భూలోకంలో అగ్నిదేవునికి ఎన్నో రూపాలు ఉన్నప్పటికీ, వాటిలో ఐదు రూపాలు అత్యంత ప్రసిద్ధమైనవి.
యజ్ఞాగ్ని: లోకకల్యాణం కోసం, దైవకృప కోసం చేసే యజ్ఞయాగాల్లో ఈ రూపంలో అగ్నిని ఆరాధిస్తారు.
భోజాగ్ని: మనం తినే ఆహారాన్ని వండటానికి ఈ రూపం ఉపయోగపడుతుంది. నేటికీ చాలా ఇళ్లలో అగ్నిదేవునికి కృతజ్ఞతగా వండిన మొదటి ముద్దను అగ్నికే సమర్పిస్తారు.
జఠరాగ్ని: మనుషుల కడుపులో ఉండి ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి ఇది. ఇది మానవులను పురుషార్థాల వైపు నడిపిస్తుంది.
దావాగ్ని: అడవుల్లో వచ్చే మంటలు. ఇది వినాశనమే కాదు, కొత్త సృష్టికి, ప్రకృతి పునరుజ్జీవనానికి కూడా దారి తీస్తుంది.
స్మశానాగ్ని: మానవ జీవితం ముగిసిన తర్వాత పార్థివ దేహాన్ని పంచభూతాలలో కలిపేసే ఐదో రూపం ఇది.
మహాభారతంలో ఖాండవ వన దహనం
మహాభారత గాథ ప్రకారం, శ్వేతకి అనే రాజు చేసిన యజ్ఞాలలో విపరీతంగా నెయ్యి తాగడం వల్ల అగ్నిదేవునికి అజీర్తి చేసింది. తన అనారోగ్యాన్ని నయం చేసుకోవడానికి ఆయన శ్రీకృష్ణుడు, అర్జునుల సహాయం కోరారు. వారి సాయంతో ఖాండవ వనాన్ని దహనం చేసి, తన కోల్పోయిన శక్తిని తిరిగి పొందారు. దీనికి సంతోషించిన అగ్నిదేవుడు అర్జునునికి అమోఘమైన 'గాండీవం' ధనస్సును, శ్రీకృష్ణునికి 'కౌమోదకి' గదను బహుమతిగా ఇచ్చారు. ఈ ఖాండవ వన దహనం తర్వాతే పాండవులు అక్కడ ఇంద్రప్రస్థ నగరాన్ని నిర్మించుకున్నారు.
అగ్నిదేవునికి భృగు మహర్షి శాపం
ఒకానొక సందర్భంలో అగ్నిదేవుని ప్రేరణతో 'పులోముడు' అనే అసురుడు భృగు మహర్షి భార్య అయిన 'పులోమ'ను అపహరించాడు. ఈ నిజాన్ని తెలుసుకున్న భృగు మహర్షి తీవ్ర ఆగ్రహానికి లోనై, అగ్నిదేవుడిని 'సర్వభక్షి'వి కావాలని శపించారు. ఆ శాపం వల్లే అగ్నిదేవుడు మంచి, చెడు అనే తేడా లేకుండా అన్ని పదార్థాలను దహించే సర్వభక్షకుడిగా మారారు.
స్వాహాదేవితో వివాహం - కుటుంబం
మనుషులు చేసే పాప పుణ్యాలను బట్టి దండన విధించే అధికారం అగ్నిదేవునికి ఉంది, అందుకే ఆయన్ను 'దండాధీశుడు' అని కూడా పిలుస్తారు. ఆయన పుట్టుక గురించి పురాణాలలో రకరకాల కథలు ఉన్నాయి. ఋగ్వేదం ప్రకారం ఆయన శక్తి పుత్రుడు. కొన్ని చోట్ల పరమాత్ముని ముఖం నుండి జన్మించినట్లు పేర్కొన్నారు. మరో కథనం ప్రకారం ధర్ముని భార్య అయిన వసువుకు అగ్ని జన్మించారు. కశ్యప ప్రజాపతి కుమార్తె అయిన స్వాహాదేవితో అగ్నిదేవుని వివాహం జరిగింది. వీరికి పావకుడు, పవమానుడు, శుచి అనే ముగ్గురు కుమారులు ఉన్నారు. అగ్నిదేవుని కుమారులు, పౌత్రుల (మనుమలు) మొత్తం సంఖ్య నలభై తొమ్మిది.
అగ్నిదేవునికి ఇష్టమైన నైవేద్యాలు
"మనుషులకు, దేవతలకు మధ్య అగ్నిదేవుడు ఒక ఉత్తమ సందేశవాహకుడిగా పనిచేస్తాడు," అని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు. యజ్ఞాలలో సమర్పించే హవిస్సులను దేవతలకు చేరవేసే దివ్య పురోహితుడు ఆయనే. అగ్నిదేవునికి ఆవు నెయ్యి, యవలు, నువ్వులు, పెరుగు, పరమాన్నం (క్షీరాన్నం) వంటి పదార్థాలు అంటే ఎంతో ఇష్టం. తనకున్న ఏడు నాలుకలతో (సప్తా జిహ్వలు) ఆయన ఈ నైవేద్యాలను స్వీకరిస్తారు. అందుకే ఏ శుభకార్యమైనా, పూజలైనా అగ్ని సాక్షిగా జరగకపోతే అవి సంపూర్ణం కావు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


