దిష్టి తగిలిందా? దిష్టి తీయడానికి ఈ రోజులు ఉత్తమం.. ఏ సమయంలో తీస్తే మంచిదో తెలుసుకోండి!
దృష్టి దోషం నిజంగా ఉందా? జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం నరదృష్టి లక్షణాలు, దిష్టి తీయడానికి అనుకూలమైన రోజులు, సరైన సమయం, పాటించాల్సిన నియమాలు ఏమిటో తెలుసుకోండి. అలాగే ఈ ఆచారాల గురించి ముఖ్యమైన వివరాలు చదవండి.
జీవితంలో అన్నీ సవ్యంగా సాగుతున్నాయనుకునే లోపే అనూహ్య అడ్డంకులు ఎదురైతే, పెద్దలు దాన్ని 'నజర్' లేదా 'దృష్టి దోషం'గా అభివర్ణిస్తారు. పని పూర్తి కాకుండానే ఆగిపోవడం, కారణం లేకుండానే పిల్లలు ఏడవడం, నిరంతరం అశాంతి, నీరసం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయా? అయితే, శాస్త్రబద్ధంగా దిష్టి తీసేసే పద్ధతులు మీకు ఉపశమనం కలిగిస్తాయి.

నరదృష్టి దోషం: అసలేం జరుగుతుంది?
మన చుట్టూ ఉన్న వ్యక్తుల చూపుల్లో లేదా ఆలోచనల్లో ఉండే నెగటివ్ ఎనర్జీ మనపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఏ శుభకార్యమైనా, కొత్త వస్తువు కొన్నా అందరికీ చెప్పేయడం వల్ల కూడా ఈ దృష్టి దోషం కలిగే అవకాశం ఉందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. పసిపిల్లలకు, వ్యాపారాల్లో ఉన్నవారికి, కొత్తగా ఇల్లు కట్టుకున్న వారికి ఈ సమస్య ఎక్కువగా వేధిస్తుంటుంది. అయితే, దీనికి భయపడాల్సిన పనిలేదు, చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తే ఈ నెగటివ్ ఎనర్జీని దూరం చేయవచ్చు.
దృష్టి దోషం పోగొట్టడానికి సరైన రోజులు
దిష్టి తీసేసేటప్పుడు ఏ రోజున ఆ పని చేస్తున్నామనేది చాలా ముఖ్యం. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వారం మొత్తం ఈ ప్రక్రియకు అనుకూలం కాదు:
మంగళవారం: ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజు దృష్టి దోషం తీయడం వల్ల జీవితంలో ఉన్న ప్రతికూల శక్తులు నశిస్తాయి.
శనివారం: శని దేవుని కృప కోసం, శని ప్రభావంతో కలిగే ఆటంకాలను తొలగించుకోవడానికి శనివారం దిష్టి తీయడం అత్యంత శక్తివంతమైనది.
ఆదివారం: సూర్య భగవానుని రోజైన ఆదివారం దృష్టి దోషం పోగొట్టుకుంటే, శరీరంలోకి కొత్త ఉత్తేజం, పాజిటివ్ ఎనర్జీ ప్రవేశిస్తాయని నమ్మకం.
దిష్టి తీయడానికి ఉత్తమ సమయం ఏది?
రోజు ఎంపిక ఎంత ముఖ్యమో, సమయం కూడా అంతే ముఖ్యం. సూర్యోదయ సమయంలో దృష్టి తీయడం కంటే, సూర్యాస్తమయం తర్వాత ఈ ప్రక్రియ చేయడం అత్యంత ప్రభావవంతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి వేళల్లో దిష్టి తీయడం వల్ల ఫలితం త్వరగా కనిపిస్తుంది. ఉదయం పూట చేసే ప్రయత్నాలు అంతగా ఫలితాన్నివ్వవని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
దిష్టి తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
దిష్టి తీసే ప్రక్రియ కేవలం ఆచారం మాత్రమే కాదు, దానికి ఒక నిశ్చలమైన మనస్తత్వం అవసరం. ఈ జాగ్రత్తలు పాటించండి:
ప్రశాంతత: దిష్టి తీసే వ్యక్తి ఎటువంటి కంగారు లేకుండా, ప్రశాంతమైన మనసుతో ఈ పని చేయాలి.
నిశ్శబ్దం: ప్రక్రియ జరుగుతున్నంత సేపు ఎవరితోనూ మాట్లాడకూడదు. ఫోన్ కాల్స్ లేదా పక్కవారి మాటలకు దూరంగా ఉండటం ముఖ్యం.
తొందర వద్దు: దిష్టి తీసేటప్పుడు ఎక్కడా హడావుడి చేయకూడదు.
దిష్టి తీయడానికి వాడిన పదార్థాలను లేదా నిప్పుల పొగను ఇంటి లోపల ఉంచకూడదు. ప్రక్రియ పూర్తయ్యాక ఆ వ్యర్థాలను వెంటనే ఇంటి బయట పడేయాలి.
నిరాకరణ- ఈ వ్యాసంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనదని మేము చెప్పము. వివరణాత్మక మరియు మరింత సమాచారం కోసం, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


