Nirjala Ekadashi Katha: భీముడికి ముక్తినిచ్చిన ‘నిర్జల ఏకాదశి’.. 100 తరాలకు మోక్షం.. దీని వెనుక అసలు కథ!
ఏడాది పొడవునా వచ్చే 24 ఏకాదశులలో అత్యంత శక్తివంతమైనది, విశిష్టమైనది 'నిర్జల ఏకాదశి'. ఏడాది మొత్తం చేసే ఏకాదశి వ్రతాల పుణ్యఫలాన్ని ఒక్క ఈ ఒక్క రోజు వ్రతంతోనే పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి. అయితే, అసలు ఈ వ్రతాన్ని ఎవరు మొదలు పెట్టారు?
మహాభారత సమయంలో, పాండవులు తమ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు, వ్యాస మహర్షి వారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో భీముడు వ్యాసుడితో తన బాధను పంచుకుంటాడు. "స్వామీ, ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అందరూ ఏకాదశి వ్రతం నియమబద్ధంగా పాటిస్తారు. కానీ, నా కడుపులో 'వృకోదర' అనే అగ్ని ఉంది. నాకు ఆకలిని తట్టుకోవడం అసాధ్యం. ఆహారం తీసుకోకుండా ఏకాదశి చేయడం నాకు సాధ్యపడదు. అలాగని పుణ్యాన్ని వదులుకోలేను. ఏడాదిలో ఒక్క రోజైనా నేను ఆచరించగలిగే, నాకు మోక్షాన్ని ప్రసాదించే ఏదైనా వ్రతం చెప్పండి" అని వేడుకుంటాడు.

వ్యాసుడి సూచన - భీమసేనుడికి పరిష్కారం
భీముడి ఆవేదనను అర్థం చేసుకున్న వ్యాస మహర్షి, జ్యేష్ఠ మాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశి గురించి వివరిస్తారు. "భీమా, నువ్వు ఏడాది పొడవునా ఉపవాసం ఉండనవసరం లేదు. జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నీరు కూడా ముట్టకుండా ఈ 'నిర్జల ఏకాదశి' వ్రతాన్ని ఆచరించు. ఆ ఒక్క రోజు చేసే వ్రతం, ఏడాదిలో చేసే మిగిలిన అన్ని ఏకాదశుల పుణ్యఫలాన్ని నీకు అందిస్తుంది" అని చెబుతారు. అప్పటి నుండి భీముడు ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల దీనికి 'పాండవ ఏకాదశి' లేదా 'భీమ ఏకాదశి' అనే పేరు వచ్చింది.
ఎలా ఆచరించాలి? నియమాలివే!
ఈ వ్రతాన్ని ఆచరించే వారు ఎంతో నిష్ఠగా వ్యవహరించాలి.
నిర్జల దీక్ష: ఏకాదశి సూర్యోదయం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు నీటిని కూడా తీసుకోకూడదు. కేవలం ఆచమనం కోసం మాత్రమే కొద్దిగా నీటిని తీసుకోవాలి.
దానధర్మాలు: ఈ రోజున నీటితో నిండిన కలశాలను, చక్కెరను బ్రాహ్మణులకు దానం చేయడం ఎంతో శ్రేష్ఠం. అలాగే వస్త్రాలు, గోదానం, చెప్పులు, గొడుగు వంటివి దానం చేస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని నమ్మకం.
భగవత్ ఆరాధన: ఈ రోజంతా శ్రీహరిని స్మరిస్తూ, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం, రాత్రిపూట జాగరణ చేయడం చాలా మంచిది.
పారణ: ద్వాదశి రోజున స్నానానంతరం, బ్రాహ్మణులకు భోజనం పెట్టి, దక్షిణాంబూలాలు సమర్పించి, ఆ తర్వాతే మనం భోజనం చేయాలి.
ఈ వ్రత మహిమ ఏంటి?
నిర్జల ఏకాదశిని నియమ నిష్ఠలతో పాటించిన వారికి, వారు చేసిన పాపాలన్నీ నశిస్తాయని శాస్త్రం చెబుతోంది. ఈ వ్రత కథను భక్తితో విన్నా, చదివినా సూర్యగ్రహణ సమయంలో పవిత్ర నదీ స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. అంతేకాదు, ఈ వ్రతాన్ని ఆచరించిన వారు తమ గత వంద తరాల వారికి, రాబోయే వంద తరాల వారికి మోక్ష మార్గాన్ని సుగమం చేస్తారని వ్యాస మహర్షి భీముడికి వివరించారు.
ద్వాదశి రోజున ఏం చేయాలి?
ద్వాదశి రోజున ఉదయాన్నే స్నానం చేసి, బ్రాహ్మణులకు దానాలు ఇచ్చి, వారిని తృప్తి పరిచిన తర్వాతే భోజనం చేయడం ఈ వ్రతంలో అతి ముఖ్యమైన ఘట్టం.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


