...
...
Next Story

పాపాంకుశ ఏకాదశి మహత్యం: వేటగాడి జీవితాన్ని మార్చిన శ్రీహరి వ్రతం.. ఇలా చేస్తే 10 తరాలకు మోక్షం!

హిందూ ధర్మంలో పాపాంకుశ ఏకాదశికి ప్రత్యేక స్థానం ఉంది. ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఈ పవిత్రమైన రోజున పద్మనాభుడైన శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించడం, ఉపవాసం పాటించడం, దానధర్మాలు చేయడం విశేషమైనవిగా పురాణాలు పేర్కొంటున్నాయి.

Published on: Oct 22, 2026, 09:30:36 IST
Advertisement

హిందూ సనాతన ధర్మంలో ఏకాదశి వ్రతాలకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. మనుషులు చేసిన సమస్త పాపాలను హరించి, మోక్షాన్ని ప్రసాదించే పవిత్ర దినాలలో ఆశ్వయుజ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

పాపాంకుశ ఏకాదశి మహత్యం: వేటగాడి జీవితాన్ని మార్చిన శ్రీహరి వ్రతం.. ఇలా చేస్తే 10 తరాలకు మోక్షం! (AI)
పాపాంకుశ ఏకాదశి మహత్యం: వేటగాడి జీవితాన్ని మార్చిన శ్రీహరి వ్రతం.. ఇలా చేస్తే 10 తరాలకు మోక్షం! (AI)

దీనినే 'పాపాంకుశ ఏకాదశి' అని పిలుస్తారు. ఈ వ్రత మహత్యం గురించి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు వివరించినట్లు పద్మపురాణంలో పేర్కొనబడింది. జీవితంలో ఎన్నో పాపాలు చేసిన వారైనా సరే, ఈ ఒక్క రోజు భక్తిశ్రద్ధలతో శ్రీహరిని ఆరాధిస్తే సకల పాపాల నుంచి విముక్తి పొందవచ్చని పురాణాలు చెబుతున్నాయి.

పాపాంకుశ ఏకాదశి విశిష్టత

శ్రీకృష్ణుడు తెలిపిన వివరాల ప్రకారం, ఆశ్వయుజ శుక్ల పక్ష ఏకాదశి రోజున పద్మనాభ రూపంలో ఉన్న శ్రీ మహావిష్ణువును పూజించాలి. మునులు ఎన్నో ఏళ్లపాటు కఠినమైన తపస్సు చేస్తే లభించే పుణ్యఫలం కేవలం గరుడధ్వజుడైన శ్రీహరిని మనసారా ప్రార్థించడం ద్వారా లభిస్తుంది.

భూమిపై ఉన్న సమస్త తీర్థాలను దర్శించిన ఫలం కేవలం విష్ణునామ కీర్తనతోనే సాధ్యమవుతుందని ప్రతీతి. భగవంతుని శరణు లేకపోతె ఎప్పటికీ యమయాతనలు తప్పవు. ఏకాదశి రోజున ఉపవాస దీక్ష ఆచరిస్తే యమలోక బాధలు వుండవు. అయితే, విష్ణు భక్తులుగా ఉంటూ శివ నింద చేయడం లేదా శైవ భక్తులు విష్ణు నింద చేయడం మహాపాపమని, అలాంటివారు ఘోర నరకాన్ని చవిచూడాల్సి వస్తుందని పురాణాలు హెచ్చరిస్తున్నాయి.

వేటగాడి కథ

ఈ వ్రత మహత్యాన్ని వివరించేందుకు వింధ్య పర్వత ప్రాంతానికి చెందిన ఓ పాపాత్ముడైన వేటగాడు కథను ఉదాహరణగా చెబుతారు. జీవితాంతం పాప కార్యాలకే పాల్పడిన ఆ వ్యక్తి, తన తుది దశలో యమదూతలను చూసి భయకంపితుడయ్యాడు. వెంటనే మహర్షి అంగిరసుని ఆశ్రయించి తన పాప ప్రక్షాళనకు మార్గం చూపమని వేడుకున్నాడు.

అప్పుడు ఆ మహర్షి అతనికి ఆశ్వయుజ శుక్ల పక్ష పాపాంకుశ ఏకాదశి వ్రతం గురించి వివరించారు. ఆ వేటగాడు శ్రద్ధగా ఈ వ్రతాన్ని ఆచరించి తన సమస్త పాపాల నుంచి విముక్తుడయ్యాడు. చివరికి విష్ణు లోకాన్ని చేరుకున్నాడు. పద్మపురాణం ప్రకారం ఈ రోజు ఉపవాస దీక్షతో పాటు రాత్రి జాగారం చేయడం వల్ల మోక్షాన్ని సులభంగా పొందవచ్చు. అంతేకాకుండా, తల్లి తరఫు పది తరాలు, తండ్రి తరఫు పది తరాల పూర్వీకులను కూడా ఉద్ధరించినవారవుతారు.

దాన ధర్మాల ద్వారా అపార పుణ్యం

హోమం, స్నానం, జప తపాలు, ధ్యానం వంటి పుణ్యకర్మలు ఆచరించే వారికి భయంకరమైన యమయాతనల నుంచి రక్షణ లభిస్తుంది. సమాజంలో ఎంతో దీర్ఘకాలం ఆయువుతో, సిరిసంపదలతో, ఆరోగ్యంతో జీవించేవారు గత జన్మల్లో పుణ్యం చేసుకున్నవారేనని శ్రీకృష్ణుడు స్పష్టం చేశారు. మనుషులు తమ పాపాల వల్ల దుర్గతిని, ధర్మం వల్ల స్వర్గాన్ని పొందుతారని ఈ వ్రత కథ ద్వారా స్పష్టమవుతోంది.

 
ABOUT THE AUTHOR
Peddinti Sravya

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారు

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks