మూడేళ్ళకొచ్చే పరమ ఏకాదశి ఎప్పుడు? ఆ రోజు ఏకాదశి వ్రతం చేస్తే అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం!
అధిక మాసంలో వచ్చే పరమ ఏకాదశి వ్రతం విశేషమైంది. 2026 జూన్ 11న ఈ ఏకాదశి వచ్చింది. ఈ రోజున విష్ణుమూర్తి, లక్ష్మీదేవి అనుగ్రహం కోసం ఎలాంటి పరిహారాలు చేయాలో, ఉపవాస సమయాలేంటో ఇక్కడ తెలుసుకోండి.
హిందూ సంప్రదాయంలో పరమ ఏకాదశి వ్రతానికి ఎంతో ప్రత్యేకత, విశిష్టత ఉన్నాయి. ప్రతి మూడేళ్లకు ఒకసారి వచ్చే అధిక మాసం (పురుషోత్తమ మాసం) లో మాత్రమే ఈ ఏకాదశి వస్తుంది. ఈ పవిత్రమైన రోజున నియమ నిష్టలతో ఉపవాసం ఉండి, శ్రీమహావిష్ణువును భక్తిశ్రద్ధలతో పూజిస్తే సమస్త పాపాలు నశిస్తాయని భక్తులు నమ్ముతారు. వంద యజ్ఞాలు చేసినంత పుణ్యం ఈ ఒక్క వ్రతం వల్లే లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.

ఈ వ్రత ప్రభావంతో ఇంట్లో సిరిసంపదలు వృద్ధి చెందుతాయి. జీవితంలో అన్ని సుఖాలను అనుభవించి, చివరికి మోక్షాన్ని పొందుతారని ప్రతీతి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి పొందడానికి పరమ ఏకాదశి రోజున చేసే పరిహారాలు అద్భుతంగా పనిచేస్తాయి. 2026లో అధిక మాస పరమ ఏకాదశి ఎప్పుడు వచ్చింది? ఉపవాస విరమణ ముహూర్తం? ధన లాభం కోసం చేయాల్సిన 3 సులువైన పరిహారాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
పరమ ఏకాదశి ఎప్పుడు?
పంచాంగం ప్రకారం, ఏకాదశి తిథి 2026 జూన్ 11వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 12 గంటల 57 నిమిషాలకు ప్రారంభమవుతుంది. అదే రోజు రాత్రి 10 గంటల 36 నిమిషాలకు ముగుస్తుంది. అందువల్ల పరమ ఏకాదశి వ్రతాన్ని 2026 జూన్ 11, గురువారం నాడు ఆచరించాలి.
పరమ ఏకాదశి విశిష్టత
'పరమ' అంటే శ్రేష్ఠమైనది లేదా అన్నింటికంటే ఉత్తమమైనది అని అర్థం. "అన్ని ఏకాదశి వ్రతాల కంటే పరమ ఏకాదశి వ్రతం అత్యంత ఎక్కువ పుణ్యఫలాన్ని ఇస్తుంది," అని పండితులు వివరిస్తున్నారు. ఈ వ్రతాన్ని ఆచరించే సాధకుడికి అశ్వమేధ యజ్ఞం చేసినంత ఫలితం దక్కుతుంది.
ఏకాదశి వ్రత పారణ సమయం
పరమ ఏకాదశి వ్రత పారణ 2026 జూన్ 12న చేయాలి. శుభ ముహూర్తం ఉదయం 05 గంటల 23 నిమిషాల నుంచి ఉదయం 08 గంటల 10 నిమిషాల వరకు ఉంటుంది. ఆ రోజు ద్వాదశి తిథి సాయంత్రం 07 గంటల 36 నిమిషాలకు ముగుస్తుంది.
ధన లాభం కోసం 3 సులువైన పరిహారాలు
ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలనే వారు ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేయవచ్చు.
ఏకాదశి తిథి శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఈ రోజు సాయంత్రం తులసి మొక్క దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది. దీనివల్ల ధన లాభ యోగాలు పడతాయి.
ఏకాదశి రోజున లక్ష్మీదేవికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించి, దానిని ప్రసాదంగా పంచిపెట్టాలి. "ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవితో పాటు విష్ణుమూర్తి అనుగ్రహం కూడా లభిస్తుంది అని పెద్దలు చెబుతారు.
జ్యోతిష్య నమ్మకాల ప్రకారం, ఏకాదశి పూజ సమయంలో ఒక పసుపు రంగు వస్త్రంలో 11 గవ్వలు లేదా నాణేలను కట్టి లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ముందు ఉంచాలి. పూజ పూర్తయిన తర్వాత ఆ మూటను డబ్బులు దాచుకునే స్థలంలో లేదా బీరువాలో పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది, ఇంట్లో సంపద పెరుగుతుంది.
గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, జ్యోతిష్య ఆధారంగా రాసినది మాత్రమే. దీనిని పూర్తిగా ధృవీకరించడం లేదు. మరింత సమాచారం కోసం సంబంధిత నిపుణులను సంప్రదించగలరు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


