Slokas for kids: పిల్లల మెదడు చురుగ్గా మారాలా? ఈ వేసవిలో వారికి ఈ 7 శక్తివంతమైన శ్లోకాలు నేర్పించండి!
Slokas for kids: పిల్లలకు కేవలం ఆటపాటలే కాదు, మన సంస్కృతిని ప్రతిబింబించే శ్లోకాలను నేర్పించడం వల్ల వారి జ్ఞాపకశక్తి, ఏకాగ్రత అద్భుతంగా పెరుగుతాయి. ఈ సమ్మర్ హాలిడేస్‌లో మీ పిల్లల కోసం కొన్ని అద్భుతమైన శ్లోకాలు ఇవే! కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా కలుగుతుంది.
చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు శ్లోకాలు నేర్పించడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు. నిజానికి పిల్లలు శ్లోకాలు నేర్చుకోవడం వలన అనేక రకాల ప్రయోజనాలను పొందవచ్చు. ప్రతిరోజు పిల్లలు శ్లోకాలను పఠించడం వలన మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. ప్రతి రోజు పిల్లలు శ్లోకాలు చదివితే జ్ఞాపక శక్తి పెరుగుతుంది. అలాగే పిల్లలు శ్లోకాలను స్పష్టంగా చదివితే మాట తీరు, ఉచ్ఛరణ బాగుంటుంది. దేవుని పట్ల భక్తి, విశ్వాసం కూడా పెరుగుతాయి.

ఉదయం, సాయంత్రం పిల్లలు శ్లోకాలు చదివితే ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం ఏర్పడుతుంది. రాత్రిపూట పిల్లలు శ్లోకాలు విన్నా, చదివినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. నిద్ర కూడా బాగా పడుతుంది. పిల్లలకు శ్లోకాలు నేర్పిస్తే క్రమశిక్షణ, గౌరవభావం, సంస్కారం కూడా వారిలో పెరుగుతాయి. భక్తితో శ్లోకాలను పిల్లలు పఠిస్తే మనసుకు ధైర్యం కలుగుతుంది. కష్టాలను ఎదుర్కొనే శక్తి కూడా వారికి కలుగుతుంది.
ఈ వేసవిలో పిల్లల కోసం మంచి శ్లోకాలు ఇవి. వీటిని మీ పిల్లలకు కూడా నేర్పించండి..
1.దీప ప్రార్థన:
దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమోపహం
దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్తుతే
శ్లోకానికి అర్థం: జ్యోతి స్వరూపమైనటువంటి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం. దీపం అజ్ఞానం అనే అంధకారాన్ని పారద్రోలి జ్ఞానం అనే వెలుగుని ఇస్తుంది. అన్ని వైపులా వెలుగులు నింపే ఉదయ లేదా సాయంకాల దీపలక్ష్మికి నమస్కారం.
2.భూమాత ప్రార్థన:
సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే
విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే
అర్థం: సముద్రాన్ని వస్త్రంగా ధరించి, పర్వతాలను స్థనములుగా కలిగిన భూమాత నీవు విష్ణుపత్నివి. అలాంటి నీవు నా పాదస్పర్శను క్షమించు అమ్మ. (ఈ శ్లోకం పిల్లలకు నేర్పించి ఉదయం లేవగానే భూమాతకు నమస్కారం చేసుకుని చదువుకోమని చెప్పండి).
3.వినాయక ప్రార్థన:
ఏకదంతం శూర్పకర్ణం గజవక్త్రం చతుర్భుజం
పాశాంకుశధరం దేవం ధ్యాయే త్సిద్ధి వినాయకం
అర్థం: ఏకదంతుడు, చేటల వంటి చెవులు కలిగిన వాడు, గజముఖుడు, నాలుగు భుజాలు కలవాడు, పాశాంకుశములను ధరించిన సిద్ధి వినాయకుడికి నమస్కారం.
4.సూర్య ప్రార్థన:
జపాకుసుమ సంకాశం కాశ్యపేయం మహాద్యుతిం
తమోరిం సర్వ పాపఘ్నం ప్రణతోస్మి దివాకరం
అర్థం: మందార పువ్వు రంగుతో ప్రకాశిస్తున్న, కశ్యప ప్రజాపతి వంశంలో పుట్టిన, మహోజ్వలమైన కాంతితో వెలుగొందుతూ సర్వపాపాలను పోగొట్టే దివాకరుడైన సూర్య భగవానుడికి నేను నమస్కరిస్తున్నాను.
5.దక్షిణామూర్తి ప్రార్థన:
ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైక మూర్తయే
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః
అర్థం: ప్రణవనాదమైన ఓంకార స్వరూపుడు, స్వచ్ఛమైన జ్ఞానమే మూర్తిగా కలవాడు, నిర్మలాకరుడు, ప్రశాంతుడు అయిన దక్షిణామూర్తికి నమస్కారములు. (ఈ శ్లోకం పిల్లలకు నేర్పితే ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే ఇంట్లో దక్షిణామూర్తి చిత్రపటం కూడా పెట్టుకుంటే మంచిది).
6.మహామృత్యుంజయ మంత్రం:
త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్
అర్థం: సకల జీవరాశులను చక్కగా పోషించువాడు, సుగంధయుక్తుడు అయిన త్రినేత్రునికి నమస్కారం. దోసపండును తొడిమి నుంచి విడదీసినట్లుగా మృత్యువు నుంచి నన్ను విడదీసి అమృతత్వాన్ని ప్రసాదించు స్వామి.
7.హయగ్రీవ ప్రార్థన:
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం
ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే
అర్థం: జ్ఞానానందమయుడైన పరమాత్ముడు, నిర్మలమైన స్ఫటికం వంటి ఆకారముగలవాడు, సర్వవిద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవ స్వామిని ఉపాసిస్తున్నాను, పూజిస్తున్నాను.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


