Shani Jayanti 2026: 30 ఏళ్ళ తర్వాత అరుదైన శని జయంతి.. ఈ 3 రాశుల వారికి ఇక కనకవర్షమే!
Shani Jayanti 2026: రేపు మే 16న శని జయంతి సందర్భంగా 30 ఏళ్ల తర్వాత కుంభరాశిలో శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతోంది. ఈ అరుదైన యోగం వల్ల మేష, మీన, కుంభ రాశుల జాతకాలు ఎలా మారనున్నాయో, శని దోష నివారణకు ఏం చేయాలో పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహంగా పరిగణించే శనీశ్వరుడి జన్మదినం అంటే శని జయంతి వచ్చేసింది. మే 16, శనివారం నాడు వైశాఖ మాస అమావాస్య సందర్భంగా దేశవ్యాప్తంగా శని జయంతి వేడుకలు జరగనున్నాయి. అయితే, ఈ ఏడాది శని జయంతికి ఒక ప్రత్యేకత ఉంది.

దాదాపు మూడు దశాబ్దాల తర్వాత అంటే 30 ఏళ్ల తర్వాత శని తన సొంత రాశి అయిన కుంభంలో సంచరిస్తూ 'శశ మహాపురుష రాజయోగం' సృష్టిస్తున్నారు. గడిచిన 13 ఏళ్లలో ఇటువంటి శుభ యోగాలు కలవడం ఇదే మొదటిసారి. ఈ రాజయోగం ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం తలుపు తట్టబోతోంది.
అమావాస్య తిథి సమయాలు
జ్యేష్ట అమావాస్య తిథి మే 16వ తేదీ శనివారం ఉదయం 5:11 గంటలకు ప్రారంభమై, మే 17వ తేదీ ఆదివారం అర్ధరాత్రి 1:30 గంటలకు ముగుస్తుంది. శాస్త్రం ప్రకారం ఉదయ తిథికి ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి, శనివారం నాడే శని జయంతిని జరుపుకోవాలి. శనివారం రోజే శని జయంతి రావడం జ్యోతిష్య రీత్యా అత్యంత శక్తివంతమైన సమయంగా పండితులు పేర్కొంటున్నారు.
శశ మహాపురుష రాజయోగం విశిష్టత
కుంభరాశిలో శని స్వక్షేత్రంలో ఉండటం వల్ల శశ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఇది వ్యక్తికి స్థిరత్వం, అధికారం, ఆర్థిక బలాన్ని ప్రసాదిస్తుంది. ముఖ్యంగా శని ప్రభావం ఎక్కువగా ఉండే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, శని మహాదశ నడుస్తున్న వారు ఈ రోజున ప్రత్యేక పూజలు చేయడం వల్ల ఉపశమనం పొందుతారు. శని దేవుడు న్యాయాధికారి కాబట్టి, మనం చేసే కర్మల ఆధారంగానే ఫలితాలను ఇస్తారు.
ఈ పవిత్ర రోజున భక్తితో శని దేవుడికి ఆవ నూనెతో అభిషేకం చేసి, నల్ల నువ్వులను దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. ఇంటి దగ్గర శని ఆలయం లేని పక్షంలో, శివలింగానికి ఆవ నూనె, నల్ల నువ్వులు సమర్పించినా శని దేవుడి కృప లభిస్తుంది. "ఓం శం శనైశ్చరాయ నమః" మంత్రాన్ని 108 సార్లు జపించడం మర్చిపోవద్దు.
అదృష్టం వరించే మూడు రాశులు ఇవే
1.మేష రాశి:
మేష రాశి వారికి ప్రస్తుతం ఏలినాటి శని మొదటి దశ నడుస్తోంది. అయినప్పటికీ, ఈ రాజయోగం వల్ల వీరికి కెరీర్‌లో కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగ వేటలో ఉన్న వారికి శుభవార్తలు అందే సూచనలు ఉన్నాయి. వ్యాపారస్తులు కష్టపడితే మంచి లాభాలను ఆర్జిస్తారు. పెళ్లి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గి, ఆర్థికంగా నిలదొక్కుకుంటారు.
2.మీన రాశి:
మీన రాశి వారికి ఈ శశ రాజయోగం శుభ ఫలితాలను ఇస్తుంది. గతంలో మీరు పడ్డ కష్టానికి, క్రమశిక్షణకు తగిన ప్రతిఫలాన్ని శని దేవుడు ఇప్పుడు ప్రసాదిస్తారు. వ్యాపారంలో లాభాలు కనిపిస్తున్నాయి. అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాలి. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తగ్గి, జీవితంలో సానుకూలత పెరుగుతుంది.
3.కుంభ రాశి:
శని తన సొంత రాశి అయిన కుంభంలో ఉండటం వల్ల శశ రాజయోగం మీకే ఎక్కువగా వర్తిస్తుంది. శని దేవుడి ప్రత్యేక ఆశీస్సులు మీపై ఉంటాయి. జీవితంలో ఎదురవుతున్న అడ్డంకులు తొలగిపోతాయి. కెరీర్ పరంగా విజయాలు అందుకుంటారు. విద్యార్థులకు ఇది సరైన సమయం. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుంభ రాశి వారికి ఏలినాటి శని చివరి దశ నడుస్తోంది, ఇది వచ్చే ఏడాది నాటికి ముగుస్తుంది కాబట్టి పరిస్థితులు చాలా వరకు మెరుగుపడతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


