తొలి ఏకాదశి 2026: మహావిష్ణువు పూజా విధానం, విశిష్టత, ఇష్టమైన పుష్పాలు, నైవేద్యాలతో పాటు పూర్తి వివరాలు!
తొలి ఏకాదశి (దేవశయనీ ఏకాదశి) సందర్భంగా మహావిష్ణు పూజ విశిష్టత, ఉపవాసం ప్రాముఖ్యత, విష్ణు అనుగ్రహం పొందేందుకు జపించాల్సిన మంత్రాలు, ఇష్టమైన పుష్పాలు, నైవేద్యాలు, పూజకు శుభప్రదమైన రోజులు, ప్రత్యేక అనుగ్రహం పొందే రాశులు, విష్ణు ఆరాధన వల్ల కలిగే శుభ ఫలితాల గురించి పూర్తి వివరాలు తెలుసుకోండి.
మహావిష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన అనేక ప్రయోజనాలను పొందవచ్చు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడంతో పాటు ఉద్యోగ, వ్యాపారాల్లో పురోగతి, కుటుంబంలో సుఖశాంతులు కలుగుతాయి. అలాగే పాపాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. సంతాన సౌభాగ్యం కలుగుతుంది.

గ్రహ దోషాల ప్రభావం నుంచి కూడా బయటపడడానికి వీలవుతుంది. అంతేకాదు, విష్ణువుని భక్తిశ్రద్ధలతో ఆరాధించడం వలన ఆధ్యాత్మిక పురోగతి కలుగుతుంది. మోక్షప్రాప్తికి మార్గం కూడా లభిస్తుంది. అయితే, రేపు తొలి ఏకాదశి వేళ విష్ణువుని ఆరాధించేటప్పుడు వీటిని కచ్చితంగా గుర్తుపెట్టుకొని పాటించడం మంచిది.
రేపే తొలి ఏకాదశి.. తొలి ఏకాదశి విశిష్టత తెలుసుకోండి
రేపు తొలి ఏకాదశి. దీనిని దేవశయనీ ఏకాదశి లేదా ఆషాఢ శుక్ల ఏకాదశి అని కూడా అంటారు. హరిశయనీ ఏకాదశి అని కూడా దీనికి పేరు. ఈ రోజు విష్ణువు క్షీరసాగరంలో యోగనిద్రలోకి ప్రవేశిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. చాతుర్మాసం కూడా తొలి ఏకాదశి నుంచే మొదలవుతుంది.
తొలి ఏకాదశి విశిష్టత
రేపు తొలి ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వలన విష్ణువు అనుగ్రహం కలుగుతుంది. అలాగే విష్ణు సహస్రనామం, విష్ణు అష్టోత్తర శతనామావళి, "ఓం నమో నారాయణాయ నమః" మంత్రాన్ని జపిస్తే అద్భుతమైన ఫలితాలను చూడొచ్చు. తులసి దళాలతో విష్ణువుకు అర్చన చేయడం వలన విష్ణువు ప్రత్యేక అనుగ్రహం లభిస్తుంది. చాతుర్మాస్య దీక్షలను రేపటి నుంచి మొదలుపెడతారు.
అలాగే దానధర్మాలు, అన్నదానం, గోసేవ, భగవన్నామ స్మరణ చేయడం వలన ఎంతో విశిష్టమైన ఫలితాలను పొందడానికి వీలవుతుంది. అంతేకాదు, ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖశాంతులు ఇలా అనేక విధాలుగా లాభాలను తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా పొందవచ్చు.
విష్ణు ఆరాధనలో తప్పక జపించాల్సిన మంత్రం
"ఓం నమో నారాయణాయ నమః" లేదా "ఓం నమో భగవతే వాసుదేవాయ నమః".
ఈ మంత్రాన్ని భక్తిశ్రద్ధలతో జపిస్తే విష్ణు కటాక్షం, లక్ష్మీ అనుగ్రహం కలుగుతాయి. మనశ్శాంతి, ధనసమృద్ధి, కుటుంబ సుఖ శాంతులు లభిస్తాయి.
విష్ణు పూజకు అత్యంత శుభప్రదమైన రోజులు
అన్ని ఏకాదశులు, తొలి ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, గురుపౌర్ణమి, శ్రావణమాసంలో వచ్చే గురువారాలు, ప్రతి గురువారం, శ్రీరామనవమి, శ్రీకృష్ణ జన్మాష్టమి, కార్తీకమాసం, ధనుర్మాసం.
ఈ రాశుల వారికి ఎప్పుడూ విష్ణు అనుగ్రహం ఉంటుంది
జ్యోతిష్యం ప్రకారం విష్ణు ఆరాధన అందరికీ శుభప్రదమే. కానీ కొన్ని రాశుల వారికి విష్ణువు నుంచి ప్రత్యేక అనుగ్రహం కలుగుతుంది. వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, కన్యా రాశి, తులా రాశి, ధనస్సు రాశి, మీన రాశికి విష్ణు అనుగ్రహం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. విష్ణువుని ఆరాధించడం వలన ఈ రాశుల వారు మరిన్ని శుభఫలితాలను పొందడానికి వీలవుతుంది.
విష్ణు పూజలో తప్పక ఉపయోగించాల్సిన పుష్పాలు
విష్ణువుకు పుష్పాలు అంటే ఎంతో ఇష్టం. విష్ణువుని ఆరాధించేటప్పుడు ఖచ్చితంగా వీటిని సమర్పించేటట్లు చూడండి. మొదటగా విష్ణువుకు చాలా ఇష్టమైనవి తులసి దళాలు. కచ్చితంగా తులసి దళాలతో విష్ణువుని పూజించండి. అలాగే కమలపూలు, మల్లెపూలు, సంపంగి పూలు, పారిజాత పూలు, తెల్ల కలువ పూలు, చామంతి పూలు, నందివర్ధనం పూలు, మొగలి పువ్వులు కూడా విష్ణువుకు ఎంతో ఇష్టం.
విష్ణువుకు ఈ నైవేద్యాలు సమర్పించండి
విష్ణువుకు చక్కెర పొంగలి, పరమాన్నం, పులిహోర, దద్దోజనం, పంచామృతం, వెన్న, పాలు, అరటిపండ్లు, బెల్లం-నెయ్యితో చేసిన ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించవచ్చు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


