శ్రావణ సోమవారం వ్రత కథ.. శివుడి అనుగ్రహంతో బాలుడికి పునర్జన్మ!
శ్రావణ మాసంలోని తొలి సోమవారం, నాగుల పంచమి పర్వదినం సందర్భంగా శివాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఈ రోజున ఉపవాసం, శివపూజతో పాటు సోమవారం వ్రత కథను చదవడం, వినడం ఆనవాయితీ.
శ్రావణ మాసం మొదటి సోమవారం వేళ తెలుగు రాష్ట్రాల్లో శివాలయాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. నేడు నాగుల పంచమి పర్వదినం కూడా తోడవడంతో భక్తులు ఉదయమే లేచి శివాలయాలను దర్శించుకుంటున్నారు. ఈ ప్రత్యేక రోజున ఉపవాసాలు ఆచరించి, పరమశివుని పూజించడంతో పాటు సోమవార వ్రత కథను చదవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సందర్భంగా భక్తుల కోసం ఆ పవిత్ర వ్రత కథ మరియు విశేషాలు ఇక్కడ తెలుసుకుందాం.

వ్రత కథ
నాటి రోజుల్లో ఒక ధనవంతుడైన షావుకారు ఉండేవాడు. ఆయన నిత్యం శివ భజన చేస్తూ, పరమ శివ భక్తుడిగా పేరుగాంచాడు. ఆయన వద్ద సమస్త సంపదలు ఉన్నప్పటికీ, సంతానం మాత్రం లేదు. ఆ లోటుతోనే ఆయన ప్రతి సోమవారం వ్రతం ఆచరిస్తూ, శివాలయానికి వెళ్లి దీపారాధన చేసేవాడు.
ఒకరోజు పరమ శివుడిని పార్వతీ దేవి ఇలా ప్రశ్నించింది. "మహారాజ్, ఈ షావుకారు మీపై అచంచల భక్తి కలిగి ఉన్నాడు. ఎల్లప్పుడూ మిమ్మల్ని పూజిస్తున్నాడు. మరి ఆయన కోరికను ఎందుకు నెరవేర్చడం లేదు?" అని అడిగింది. అప్పుడు శివుడు, "దేవి, మనిషి ఎటువంటి బీజాన్ని నాటుతాడో అటువంటి పంటనే కోస్తాడు" అని బదులిచ్చాడు. భక్తుడి దుఃఖాన్ని చూడలేక పార్వతీ దేవి పట్టుబట్టడంతో, శివుడు ఒక వరం ప్రసాదించాడు. "అతని భవితవ్యంలో సంతానం లేదు. అయినప్పటికీ నేను పుత్రుడిని ప్రసాదిస్తాను. కానీ ఆ బాలుడు కేవలం పన్నెండు సంవత్సరాలు మాత్రమే ఆయువు కలిగి ఉంటాడు" అని శివుడు స్పష్టం చేశాడు.
కుమారుడి జననం - తల్లిదండ్రుల ఆందోళన
శివ పార్వతుల సంభాషణను సాహుకారు విన్నప్పటికీ, దైవ భక్తిని వీడలేదు. కాలక్రమేణా సాహుకారు భార్య గర్భం దాల్చి, పదవ నెలలో ఒక సుందరమైన మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే బిడ్డ పుట్టినప్పటికీ సాహుకారు సంతోషపడలేదు. ఎందుకంటే ఆ బాలుడి ఆయువు పన్నెండు సంవత్సరాలేనని అతనికి తెలుసు.
బాలుడికి పదకొండేళ్లు నిండిన తర్వాత, తల్లి వివాహం గురించి ప్రస్తావించగా, తండ్రి మాత్రం నిరాకరించి, కాశీకి చదువుకోవడానికి పంపిస్తానని చెప్పాడు. బాలుడి మేనమామను పిలిచి, దారాళంగా ధనం ఇచ్చి కాశీకి తీసుకెళ్లమనీ, దారిలో ఎక్కడ కనిపించినా యజ్ఞాలు చేయిస్తూ, బ్రాహ్మణులకు దానధర్మాలు చేస్తూ వెళ్లాలని సూచించాడు.
విచిత్ర వివాహం - కాశీ ప్రయాణం
మామా-అల్లుళ్లు ప్రయాణమై వెళ్తుండగా మార్గమధ్యంలో ఒక నగరానికి చేరుకున్నారు. అక్కడ రాజు కూతురి వివాహం జరుగుతోంది. అయితే పెళ్లికి వచ్చిన రాజకుమారుడు ఒక్క కన్ను లేనివాడు. ఆ విషయం బయటపడితే వివాహం ఆగిపోతుందని భావించిన రాజకుమారుడి తండ్రి, అందంగా ఉన్న ఇతన్ని చూసి ఒక ఉపాయం ఆలోచించాడు.
ఆ షావుకారి కుమారుడితో మాట్లాడి, అసలు రాజకుమారుడి స్థానంలో వివాహం జరిపించి, చివరకు రాజకుమారుడితో అమ్మాయిని కాశీ పంపాలని నిర్ణయించారు. వివాహం ఘనంగా ముగిసింది. అయితే, బాలుడు అక్కడి నుండి బయలుదేరే ముందు, వధువు వస్త్రంపై "నీ వివాహం నాతో జరిగింది, కానీ పంపేది వేరే వ్యక్తితో. నేను కాశీకి చదువుకోవడానికి వెళ్తున్నాను" అని రాసి వెళ్లాడు. ఆ మాటలు చూసిన రాకుమారి వెళ్లడానికి నిరాకరించింది.
శివుడి అనుగ్రహంతో పునర్జన్మ
కాశీకి చేరుకున్న బాలుడు వేదాలు అభ్యసించడం ప్రారంభించాడు. పన్నెండేళ్లు నిండగానే బాలుడికి తీవ్రమైన అస్వస్థత ఏర్పడింది. లోపలికి వెళ్లిన మేనమామ అల్లుడు విగతజీవిగా పడి ఉండటం చూసి బోరున విలపించాడు. అయితే యజ్ఞ కార్యాలు పూర్తయిన తర్వాత అందరూ చూస్తుండగా రోధించడం మొదలుపెట్టాడు.
అదే సమయంలో అటుగా వెళ్తున్న శివపార్వతులు ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు. పార్వతీ దేవి కోరిక మేరకు పరమశివుడు ఆ బాలుడికి మళ్లీ ఆయువునిచ్చి బతికించాడు. చదువు ముగించుకుని మామతో కలిసి స్వగ్రామానికి బయలుదేరిన ఆ బాలుడిని మార్గమధ్యంలో రాజు గుర్తించి ఘనంగా సత్కరించాడు.
కుమారుడు సజీవుడిగా ఇంటికి తిరిగి రావడంతో, ప్రాణాలు విడిచేందుకు సిద్ధంగా ఉన్న ఆ తల్లిదండ్రులు పరమానందం చెందారు. కుమారుడిని, కోడలిని సాదరంగా ఆహ్వానించి జీవితాంతం ఆనందంగా గడిపారు. ఈ సోమవారం వ్రతం ఆచరించి ఈ కథ విన్నవారికి సకల సౌభాగ్యాలు చేకూరుతాయి.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


