అజ్ఞానం నుంచి పరాయి ఇంటి వరకు.. మనిషిని కుంగదీసే 3 ప్రధాన కష్టాలు
ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో మనిషి జీవితాన్ని కష్టాల్లోకి నెట్టే కొన్ని పరిస్థితుల గురించి వివరించారు. సరైన జ్ఞానం లేకపోవడం, యౌవనంలో విచక్షణ కోల్పోవడం, ఇతరుల ఇంట్లో ఆశ్రయం పొందాల్సి రావడం వంటి పరిస్థితులు మనిషికి తీవ్ర ఇబ్బందులను కలిగిస్తాయని పేర్కొన్నారు.
ప్రతి మనిషి జీవితంలో ప్రశాంతతను, సంతోషాన్ని కోరుకుంటాడు. అయితే కొన్ని సార్లు తెలియకుండా చేసే పొరపాట్లు, సరైన అవగాహన లేకపోవడమే వారి జీవితంలో పెద్ద సమస్యలుగా మారుతుంటాయి. మహానుభావుడు ఆచార్య చాణక్యుడు తన 'నీతి శాస్త్రం'లో మానవ జీవితాన్ని సులభతరం చేసే అనేక అమూల్యమైన సూత్రాలను ప్రసాదించారు.

నాటి కాలంలో చెప్పిన ఈ నీతులు నేటి ఆధునిక కాలానికి కూడా వంద శాతం సరిపోతాయి. మనిషి జీవితంలో కొన్ని పరిస్థితులు దారుణమైన నష్టాన్ని, మానసిక క్షోభను మిగులుస్తాయని చాణక్యుడు స్పష్టం చేశారు. ముఖ్యంగా జీవితాన్ని నరకప్రాయం చేసే ఆ మూడు ప్రధాన కష్టాలు ఏమిటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
అజ్ఞానం లేదా మూర్ఖత్వం ఒక పెద్ద శాపం
సరైన జ్ఞానం లేకపోవడం లేదా మూర్ఖంగా వ్యవహరించడం మనిషి జీవితంలో మొదటి మరియు అత్యంత పెద్ద కష్టమని ఆయన హెచ్చరించారు. లోకజ్ఞానం కొరవడినప్పుడు మనిషి అడుగువద్ద తప్పులు చేస్తూ జీవితాంతం ఇబ్బందుల పాలవుతాడు. సరైన సమాచారం, అవగాహన లేని వ్యక్తి ఏ రంగంలోనూ సరైన నిర్ణయాలు తీసుకోలేడు. చదువు ఒక్కటే కాదు.. బంధాలు, ఆర్థిక వ్యవహారాలు, వ్యాపారంలో విజ్ఞత లేకపోతే నష్టపోవాల్సి వస్తుంది. తన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకోకపోవడం కూడా అజ్ఞానమేనని చాణక్య నీతి చెబుతోంది.
అదుపు తప్పుతున్న యౌవనం - తెచ్చిపెట్టుకునే ముప్పు
యూత్ అంటేనే అంతులేని ఉత్సాహం, శక్తి మరియు సరికొత్త అవకాశాల సమయం. అయితే ఈ వయస్సులో జోష్‌తో పాటు విచక్షణ, సంయమనం చాలా అవసరమని చాణక్యుడు గుర్తుచేశారు. ఒకవేళ యౌవనంలో ఒడుపు లేకపోతే, ఉద్వేగాలను అదుపులో ఉంచుకోలేకపోతే మనిషి తప్పుడు మార్గంలో పయనించి తన జీవితాన్ని తానే నాశనం చేసుకుంటాడు. సంయమనం కోల్పోయిన యౌవనం మనిషికి మేలు కంటే కీడే ఎక్కువగా చేస్తుంది.
పరాయి ఇళ్లల్లో తలదాచుకోవడం - మనుషులకే అతి పెద్ద వేదన
అజ్ఞానం, అదుపులేని యౌవనం కష్టకరమైనవే అయినప్పటికీ.. వాటన్నింటికంటే మించి అత్యంత బాధాకరమైన విషయం మరొకటి ఉంది. అదే "పరగేహ నివాసనం" అనగా సొంత ఇల్లు ఉండి కూడా ఇతరుల ఆశ్రయంలో, పరాయి ఇళ్లల్లో బతకాల్సి రావడం.
చాణక్యుని ప్రకారం, ఎదుట వారి ఇంటిలో ఎవరికీ స్వేచ్ఛగా జీవించే అవకాశం ఉండదు. ప్రతి క్షణం భయం, బిడియం ఆవరించి ఉంటాయి. ఎదుటివారి అభిరుచులు, పరిస్థితులకు తగినట్లుగా సర్దుకుపోవాల్సి రావడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడి ఎదురవుతుంది. అందుకే సొంతిల్లు లేక పరాయివారి నీడన బతకడం మనిషికి నరకంతో సమానమని చాణక్యుడు అభివర్ణించారు.
ABOUT THE AUTHORPeddinti Sravyaపెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More

E-Paper


