ఈరోజు అమలక ఏకాదశి+శుక్రవారం చాలా విశేషమైన రోజు.. పూజా విధానం, పాటించాల్సిన నియమాలు, పరిహారాలు!

ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి, అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. శుక్రవారం రావడం మరింత శక్తివంతమైనదని చెప్పొచ్చు. శ్రీమహా విష్ణువు అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారట. అయితే ఈ అమలక ఏకాదశి నాడు ఏం చేయాలి? ఎలా పూజ చేయాలి? ఉసిరి దీపాలను ఏ విధంగా వెలిగించుకోవాలి? 

Published on: Feb 27, 2026 6:00 AM IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ప్రతి ఏటా ఫాల్గుణ మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని అమలక ఏకాదశిగా జరుపుకుంటాము. ఏకాదశి విష్ణువుకి ఎంతో ఇష్టమైన రోజు. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి, అంటే సంవత్సరంలో 24 ఏకాదశులు వస్తాయి. శుక్రవారం రావడం మరింత శక్తివంతమైనదని చెప్పొచ్చు. అయితే ఈ అమలక ఏకాదశి నాడు ఏం చేయాలి? ఎలా పూజ చేయాలి? ఉసిరి దీపాలను ఏ విధంగా వెలిగించుకోవాలి? ఇలాంటి విషయాలను తెలుసుకుందాం.

ఈరోజు అమలక ఏకాదశి+శుక్రవారం చాలా విశేషమైన రోజు (pinterest)
ఈరోజు అమలక ఏకాదశి+శుక్రవారం చాలా విశేషమైన రోజు (pinterest)

అమలక ఏకాదశి 2026

శ్రీమహా విష్ణువు అమలక ఏకాదశి నాడు ఉసిరి చెట్టులో కొలువై ఉంటారట. అందుకని ఈ ఏకాదశి నాడు పూజ చేయడం వలన ఎంతో విశేష ఫలితాలను పొందడానికి వీలవుతుంది. ఇంట్లో పూజ చేయాలనుకుంటే పూజ గదిలో ఉసిరి కొమ్మును పెట్టి పూజించొచ్చు. వరి పిండిలో బెల్లం, అరటిపండు కలిపి ముద్దలా చేసుకుని దాంతో పిండి దీపాలను చేసుకోవాలి. ఈరోజు పిండి దీపాలను వెలిగిస్తే కూడా చాలా మంచిది. రెండు, ఐదు, ఏడు, తొమ్మిది లేదా 11 పిండి దీపాలను వెలిగించవచ్చు.

ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసేటప్పుడు ఇలా చెయ్యాలి

ఉసిరి చెట్టు దగ్గర పూజ చేసే వారు ఉసిరి చెట్టు దగ్గర కొంచెం నీళ్లు జల్లి, పసుపు కుంకుమలను చెట్టుకు రాసి, ఆ తర్వాత చుట్టూ ముగ్గులు వేసి, ఉసిరి చెట్టు ముందు పద్మం వేసి పూజ చేసుకోవచ్చు. దీపారాధన కూడా చేయండి.

ఇంట్లో పూజ చేస్తే ఇలా చెయ్యాలి

ఇంట్లో పూజ చేసుకునే వారు లక్ష్మీదేవి, విష్ణువును ఉంచి పూజించచ్చు.

ప్రధానంగా ఉసిరి దీపం, పిండి దీపాలను వెలిగించండి.

ఈరోజు విష్ణు సహస్రం చదువుకుంటే కూడా ఎంతో మంచిది.

కుదిరితే ఆలయం వద్ద ఉన్న ఉసిరి చెట్టు కింద కూడా దీపారాధన చేయడం మంచిది. అలాగే ఉసిరికాయలను కూడా విష్ణువుకి నైవేద్యంగా పెడితే శుభ ఫలితాలను పొందవచ్చు. ఇలా నారాయణుడిగా ఉసిరి చెట్టును భావించి పూజలు చేయడం వలన బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సంపద కలుగుతుంది, దీర్ఘాయుష్షు కలుగుతుంది, మానసిక ప్రశాంతత, ఆరోగ్యం కూడా పొందవచ్చు.

ఏకాదశి ఉపవాసం సమయంలో పాటించాల్సిన నియమాలు:

ఏకాదశి నాడు ఉపవాసం ఉండి, ద్వాదశి సేవలు పూర్తి కాకుండా ఉపవాసాన్ని విరమించాలి. అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే పండ్లు తీసుకోవచ్చు. ఉపవాసం ఉండలేని వారు భక్తిశ్రద్ధలతో విష్ణువుని ఆరాధించాలి. విష్ణు సహస్రనామం పఠిస్తే ఎంతో మంచిది.

అలాగే ఏకాదశి నాడు సాత్విక ఆహారాన్ని మాత్రమే తినాలి. ఇతరులను దూషించడం, వివాదాలు పెట్టుకోవడం, పెద్దలను అవమానించడం, బాధ పెట్టడం వంటివి మంచిది కాదు.

ఏకాదశి నాడు ఉపవాసం ఉంటే జీవితంలో ఐక్యత, ప్రేమ పెరుగుతాయి. ఇంట్లో శాంతి, సంతోషం ఉంటాయి. సంతాన ప్రాప్తి కూడా కలుగుతుంది.

ఈరోజు ఉసిరికాయలను దానం చేయడం కూడా ఎంతో మంచి ఫలితాన్ని తీసుకొస్తుంది. అలాగే ఉసిరి చెట్టు కింద కూర్చుని విష్ణువుని పూజించి, చెట్ల వేర్లకు నీళ్లు పోసి, దీపారాధన చేస్తే కూడా చాలా మంచిది.

అమలక ఏకాదశిని శ్రద్ధగా ఆచరిస్తే అనుకోకుండా చేసిన పాపాలు తొలగిపోతాయి. మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది. అలాగే శుక్రవారం వచ్చింది కాబట్టి లక్ష్మీనారాయణ యోగంగా భావిస్తారు. కాబట్టి ఈరోజు విష్ణువుని ఆరాధిస్తే ఐశ్వర్యం, సంపద కూడా కలుగుతాయి.