నాని ప్యారడైజ్ సినిమాలో ధూమావతి దేవిని కొలుస్తారా? ఇంతకీ ఎవరు ఈమె?

Dhumavati Devi : హిందూ ధర్మంలో ధూమవతి దశమహావిద్యలలో ఏడో మహావిద్యగా పూజలందుకునే దేవత. శక్త్యుపాసనలో ఈమెను అత్యంత విశిష్టమైన, శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు. అయితే నాని ప్యారడైజ్ సినిమాలో ఈ దేవి కనిపిస్తుందని అంటున్నారు. ఇంతకీ ఎవరు ఈమె?

Updated on: Sep 23, 2026, 15:50:05 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నేచురల్ స్టార్ నాని-దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దసరాతో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. ఇప్పుడు ప్యారడైజ్‌తో వచ్చారు. ఈ సినిమాలో కాకులకు ఎంత ప్రాధాన్యం ఉందో మెుదటి నుంచి జనాలకు అర్థమవుతూనే ఉంది. క్లియర్ కట్‌గా టీజర్‌లోనూ ఇది కడుపు మండిన కాకుల కథ అని స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాదు ఆయా షేర్ పాటలో ధూం.. ధూం..త:త: అంటూ బీజీఎం ఇచ్చారు. మీరు టీజర్‌లో చూస్తే మెుదటల్లోనే ఒక చెట్టు కింద ఓ రూపంతో ఉన్న విగ్రహం కనిపిస్తుంది. ఆమె ఎవరో కాదు.. ధూమావతి దేవి అంటూ నెటిజన్లు అంటున్నారు. ఇప్పుడు ధూమావతి గురించి చర్చనడుస్తుంది. దీనిపై సినిమా టీమ్ ముందుగా ఎలాంటి విషయం చెప్పకపోయినప్పటికీ.. జనాలు ధూమావతి గురించి సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ ఆమె ఎవరు?

ధూమావతి దేవి
ధూమావతి దేవి

ధూమ అంటే పొగ, వతి అంటే కలిగినది. ధూమవతి అంటే పొగ రూపంలో ఉండేది లేదా పొగ చేత ఆవరించబడినది అని అర్థం. ఈమె సృష్టి నాశనం తర్వాత మిగిలే శూన్యానికి, నిరాశకు, వైరాగ్యానికి సంకేతం. సాధారణంగా దేవీ దేవతల రూపాలు అందంగా, ఆభరణాలతో అలంకరించి ఉంటాయి. కానీ ధూమవతి దేవి స్వరూపం దానికి పూర్తి భిన్నంగా ఉంటుంది.

ఈమె ముసలి రూపంలో, నల్లని లేదా తెల్లని వస్త్రాలు ధరించి, జడలు విప్పుకొని జుట్టుతో వితంతువుగా దర్శనమిస్తుంది. ఈమె రథంపై కాకి ఉంటుంది లేదా కాకినే వాహనంగా కలిగి ఉంటుంది. ఒక చేతిలో బియ్యం చెరిగే చాటను పట్టుకుంటుంది. ఈమె ఆకలి, దాహాలతో అలమటించే రూపాన్ని కలిగి ఉంటుంది.

ఆధ్యాత్మికత పరంగా చూసుకుంటే.. సృష్టి ఉద్భవించక ముందు, సృష్టి అంతమయ్యాక మిగిలే శూన్య స్థితికి ధూమావతి ప్రతీక. ప్రాపంచిక సుఖాలు, మోహాలు, అందం శాశ్వతం కావని... కష్టం, దుఃఖం, ముసలితనం, మరణం కూడా జీవితంలో భాగమేనని ఈమె రూపం గుర్తుచేస్తుంది. బాహ్య రూపాన్ని చూసి మోసపోకుండా, ఆత్మజ్ఞానాన్ని పొందేందుకు ఈమె ఉపాసన తోడ్పడుతుంది.

ధూమావతి గురించి ఒక విచిత్రమైన పురాణ గాథ ఆమె పుట్టుకను వివరిస్తుంది. ఒకసారి సతిదేవి శివుడిని తనకు తినడానికి ఏదైనా తీసుకురమ్మని అడిగింది. ఆయన ఆమెకు ఏం తీసుకురాలేదు. తీవ్రమైన ఆకలితో ఆమె శివుడినే మింగేసింది. అప్పుడు శివుడు ఆమెతో మాట్లాడి, తనను పైకి పంపమని ఒప్పించాడు. ఆమె అంగీకరించింది, శివుడిని బయటకు వదిలిన వెంటనే శపించడంతో ఆమె శరీరం నుండి పొగలు వస్తాయి. పొగలతో ఒకరకమైన ఆకారం ఏర్పడుతుంది. ఆమెనే ధూమావతి అనే కథ కూడా ఉంది.

ధూమవతి దేవిని ఎక్కువగా గృహస్థులు కాకుండా తంత్ర సాధకులు, సన్యాసులు ఉపాసిస్తారు. ఈమెను పూజించడం వల్ల శత్రు బాధలు, తీవ్రమైన రోగాలు, దారిద్య్రం, దుఃఖాలు, దృష్టి దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు. సాధకులకు లోతైన జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక వైరాగ్యాన్ని ప్రసాదించే దేవతగా ఈమెను ఆరాధిస్తారు. 'ధూం ధూమావతి ఠః ఠః॥ ధూం ధూం ధూమవతి త్హః త్హః' మూల మంత్రం అని చెబుతారు.

గమనిక : ఈ కథనంలోని కంటెంట్‌ కేవలం నమ్మకాల మీద ఆధారపడి ఉంటుంది. పుస్తకాలు, ఇంటర్నెట్‌లో దొరికిన సమాచారం ఆధారంగా కథనం ఇచ్చాం. పూర్తి వివరాల కోసం నిపుణులను సంప్రదించండి.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More