శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం మీకు తెలుసా?

శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు? కొత్త ఇల్లు, కారు కొన్నా లేదా ఏదైనా పూజ చేసినా కొబ్బరికాయ కొట్టడం మన సంప్రదాయం. అసలు కొబ్బరికాయకు, మన వ్యక్తిత్వానికి ఉన్న సంబంధం ఏంటి? దీని వెనుక ఉన్న ఆధ్యాత్మిక, శాస్త్రీయ కారణాలేంటో ఈ కథనంలో చూడండి.

Published on: May 15, 2026, 09:30:52 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

హిందూ ధర్మంలో కొబ్బరికాయకు విశిష్టమైన స్థానం ఉంది. గృహప్రవేశం అయినా, కొత్త వాహనం కొన్నా లేదా ఏదైనా వ్యాపారం మొదలుపెట్టినా.. ముందుగా కొబ్బరికాయ కొట్టి శుభారంభం చేయడం మనకు తరతరాలుగా వస్తున్న ఆచారం. అసలు ప్రతి పనిలోనూ కొబ్బరికాయనే ఎందుకు వాడతాం? దీన్ని అంత పవిత్రంగా ఎందుకు భావిస్తాం? దీని వెనుక కేవలం విశ్వాసం మాత్రమే కాదు, లోతైన ఆధ్యాత్మిక అర్థం, శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయి.

శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?
శుభకార్యాల్లో కొబ్బరికాయ ఎందుకు కొడతారు?

అహంకారానికి స్వస్తి.. ఆత్మశుద్ధికి నాంది

కొబ్బరికాయను మన శరీరంతో, మనసుతో పోలుస్తారు పెద్దలు. కొబ్బరికాయ పైన ఉండే పెంకు చాలా గట్టిగా ఉంటుంది. లోపల మాత్రం తెల్లటి కొబ్బరి, తియ్యటి నీరు ఉంటాయి. ఇది సరిగ్గా మనిషి స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. బయట గట్టిగా కనిపించే పెంకు మనిషిలోని అహంకారం, కఠినత్వం, కోపం వంటి నెగటివ్ లక్షణాలకు గుర్తు.

మనం దైవ సన్నిధిలో కొబ్బరికాయను కొట్టినప్పుడు, మనలోని అహంకారాన్ని పటాపంచలు చేసి, నిర్మలమైన మనసుతో దైవానికి శరణాగతి చెందుతున్నామని అర్థం. లోపల ఉండే తెల్లటి కొబ్బరి శాంతికి, పవిత్రతకు నిదర్శనం. "మనం మన అహంకారాన్ని వదిలిపెట్టినప్పుడే దైవ అనుగ్రహం లభిస్తుంది" అనే గొప్ప సందేశం ఈ ఆచారం వెనుక దాగి ఉంది.

బలి ఆచారానికి ప్రత్యామ్నాయంగా

కొబ్బరికాయ కొట్టడం వెనుక ఒక పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. ప్రాచీన కాలంలో పూజలు, యజ్ఞాలు చేసేటప్పుడు జంతు బలులు ఇచ్చే ఆచారం ఉండేది. కాలక్రమేణా సాత్విక పూజలకు ప్రాధాన్యత పెరిగింది. జంతు హింసను నిరసిస్తూ మహర్షులు, పండితులు బలి ఆచారానికి స్వస్తి పలికారు. కొబ్బరికాయ ఆకారం మనిషి తలని పోలి ఉంటుంది. పైన ఉండే పీచు జుట్టులా, పెంకు పుర్రెలా, లోపలి నీరు రక్తంలా భావించి, జంతు బలికి ప్రత్యామ్నాయంగా కొబ్బరికాయను సమర్పించడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి కొబ్బరికాయ కొట్టడం అనేది ఒక పవిత్ర సంప్రదాయంగా మారిపోయింది.

శాస్త్రీయ కోణం.. సానుకూల శక్తి

కొబ్బరికాయ కొట్టడం వెనుక శాస్త్రీయ కారణాలు కూడా లేకపోలేదు. కొబ్బరికాయ కొట్టినప్పుడు వచ్చే శబ్దం చుట్టుపక్కల ఉన్న ప్రతికూల ప్రకంపనలను తొలగించి, సానుకూల శక్తిని నింపుతుందని విశ్వసిస్తారు. అలాగే కొబ్బరి నీరు అత్యంత స్వచ్ఛమైనది. పూజా సమయంలో కొబ్బరి నీరు చిందడం వల్ల ఆ ప్రాంతం పవిత్రం అవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. ఇక ఆరోగ్య పరంగా చూస్తే, కొబ్బరిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే పూజ ముగిసిన తర్వాత దీన్ని ప్రసాదంగా పంచుతారు. ఇది కేవలం దైవ భక్తి మాత్రమే కాదు, ఆరోగ్య ప్రదాయిని కూడా.

మన సంస్కృతిలో కొబ్బరికాయను 'శ్రీఫలం' అని పిలుస్తారు. అంటే లక్ష్మీదేవికి ఇష్టమైన ఫలం అని అర్థం. అందుకే ఏ శుభకార్యం జరిగినా కొబ్బరికాయ లేనిదే ఆ వేడుక పూర్తి కాదు. మనలోని అహంకారాన్ని వదిలి, స్వచ్ఛమైన మనసుతో కొత్త జీవితాన్ని ప్రారంభించాలనేదే ఈ కొబ్బరికాయ కొట్టే సంప్రదాయం మనకు నేర్పే పాఠం.

  • Peddinti Sravya
    ABOUT THE AUTHOR
    Peddinti Sravya

    పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు. హిందూ సంప్రదాయాలు, ఆచారాలు అందరికీ తెలియాలనే ఉద్దేశంతో జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలను అందిస్తున్నారు. 2024 డిసెంబర్ నుంచి హిందుస్తాన్ టైమ్స్ లో పని చేస్తున్నారు. కాలేజీలో చదువుతున్నప్పటి నుంచి కవితలు, కథలు రాయడం మొదలు పెట్టారు. బాలబాట మాస పత్రిక నుంచి బాలసాహిత్య పురస్కారాన్ని పొందారు. ఐదు వందల కైతికలు రాశి కైతిక కవిరత్న అవార్డు పొందారు. శత పద్యాల పోటీలో పాల్గొని ఏకధాటిగా వంద పద్యాలు చెప్పి శతపద్య రత్న అవార్డు కూడా పొందారు. ఎన్నో కవి సమ్మెళనాల్లో పాల్గొని తన కవితలను ఆలాపించి ప్రశంసలను పొందారు. ఆల్ ఇండియా రేడియోలో కూడా ప్రోగ్రామ్స్ ఇచ్చారు. పలు వార్తా పత్రికల్లో, వెబ్ సైట్స్ లో రచనలు ప్రచురితమయ్యాయి. పిల్లలకు తానే పద్యాలు, శ్లోకాలు వంటి నేర్పి వారిలో కాంపిటీటివ్ స్పిరిట్ ఉండాలని, స్టేజ్ ఫియర్ పోవాలని పోటీలను కూడా నిర్వహిస్తుంటారుRead More