తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక.. 2 డీఏలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం దసరా కానుక అందించింది. ఉద్యోగులకు 2 డీఏలు మంజూరు చేసింది. ఈ మేరకు జీవో ఇచ్చింది.
పండుగల వేళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, పెన్షనర్లకు రేవంత్ రెడ్డి సర్కార్ తీపి కబురు అందించింది. దీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న కరువు భత్యం(Dearness Allowance - DA)కు సంబంధించి రెండు విడతల డీఏలను మంజూరు చేస్తూ ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విశ్రాంత ఉద్యోగులకు గణనీయమైన లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర ఆర్థిక శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం 2024 సంవత్సరానికి సంబంధించి నిలిచిపోయిన రెండు డీఏలను ప్రభుత్వం ఒకేసారి విడుదల చేసింది.
రెండు డీఏలు కలిపి 6.27 శాతం పెరుగుదల ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గాలు చెప్పాయి. పెరిగిన డీఏ లెక్కింపు, చెల్లింపుల ప్రక్రియను ఆర్థిక శాఖ అత్యంత పారదర్శకంగా పొందుపరిచింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వేతనంతో కలిపి పెరిగిన నూతన డీఏను ఉద్యోగుల ఖాతాల్లో నగదు రూపంలో జమ చేయనున్నారు.
పాత పెన్షన్ విధానం కింద ఉన్న ఉద్యోగులకు సంబంధించిన డీఏ బకాయిలను వారి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ ఖాతాల్లో జమ చేస్తారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు డీఏ బకాయిలను విడతల వారీగా చెల్లిస్తారు. మొదటి డీఏ బకాయిలు 33, రెండో డీఏ 27 వాయిదాలలో జమ చేయనున్నారు.
పండుగ వాతావరణంలో రెండు డీఏలను ఒకేసారి విడుదల చేయడంపై తెలంగాణ ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, పింఛనర్ల సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. పెరుగుతున్న నిత్యావసర ధరలకు అనుగుణంగా డీఏ విడుదల చేయడం వల్ల కుటుంబాల ఆర్థిక భారం తగ్గుతుందని, అక్టోబర్ నెల జీతంతోనే పెరిగిన డీఏ కలవనుండడం ఉద్యోగుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఉద్యోగ నాయకులు వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం వివిధ విభాగాల ఉద్యోగులకు వర్తించే నూతన డీఏ శాతాలు ఈ విధంగా ఉన్నాయి.
జనవరి 2024 నుంచి డీఏ 33.67 శాతం నుండి 37.31 శాతానికి పెంపు. జులై 2024 నుంచి డీఏ 37.31 శాతం నుండి 40.04 శాతానికి పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2015 పే-స్కేల్ ఉద్యోగులకు కూడా జనవరి 2024 నుంచి డీఏ 73.344 శాతం నుండి 78.06 శాతానికి పెంచారు. జులై 2024 నుంచి డీఏ 78.06 శాతం నుండి 81.728 శాతానికి పెంచింది.
యూజీసీ, ఏఐసీటీఈ పే-స్కేల్స్, 2016 పే-స్కేల్ ఉద్యోగులకు కూడా డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. జనవరి 2024 నుంచి డీఏ 46 శాతం నుండి 50 శాతానికి పెంపు, జులై 2024 నుంచి డీఏ 50 శాతం నుండి 53 శాతానికి పెంచారు.
2006 పే-స్కేల్ వర్తించే ఉద్యోగులకు జనవరి 2024 నుంచి డీఏ 230 శాతం నుండి 239 శాతానికి పెంపు, జులై 2024 నుంచి డీఏ 239 శాతం నుండి 246 శాతానికి పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్ఎడిటర్గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్మెంట్లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్టైన్మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


