బెడ్ కింద నోట్ల కట్టలు.. అవినీతికి మరిగిన నరహరి అక్రమాస్తులు రూ.150 కోట్లపైనే!

ఏసీబీ వలకు మరో అవినీతి తిమింగలం చిక్కింది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి అక్రమాస్తులు రూ.150 కోట్లపైనే ఉంది.

Published on: Jun 16, 2026, 21:30:23 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో అవినీతి అధికారులపై అవినీతి నిరోధక శాఖ (ACB) ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నారాయణగూడ సర్వే భవన్ ల్యాండ్స్‌ అండ్‌ సర్వే డిప్యూటీ డైరెక్టర్‌(Multi Zone-2) సుంకరి నరహరిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఏసీబీ డీఎస్పీ గంగసాని శ్రీధర్ నేతృత్వంలోని ప్రత్యేక బృందాలు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని మొత్తం 11 నుండి 12 ప్రాంతాల్లో ఏకకాలంలో ఈ దాడులు నిర్వహించాయి. నరహరి నివాసముంటున్న పాతబస్తీ ఛత్రినాకలోని ఇల్లు, ఆయన కార్యాలయం, బంధువుల ఇళ్లలో జరిపిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే స్థాయిలో అక్రమాస్తులు వెలుగులోకి వచ్చాయి.

ఏసీబీ వలలో అవినీతి తిమింగలం
ఏసీబీ వలలో అవినీతి తిమింగలం

ఏసీబీ సోదాల్లో దొరికిన డాక్యుమెంట్లు, ఆస్తుల విలువ ప్రభుత్వ లెక్కల (రిజిస్ట్రేషన్ వాల్యూ) ప్రకారం రూ.13.05 కోట్లుగా ఉన్నప్పటికీ, బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ దాదాపు రూ.150 కోట్ల నుండి రూ.200 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా సోదాల సమయంలో నరహరి తన బెడ్‌రూమ్‌లోని మంచం కింద, అటకపై బ్యాగుల్లో దాచిన రూ.1.54 కోట్ల భారీ నగదును చూసి అధికారులు సైతం విస్తుపోయారు. నగదును లెక్కించడానికి ఏసీబీ అధికారులు ప్రత్యేకంగా కరెన్సీ కౌంటింగ్ మిషన్లను ఉపయోగించాల్సి వచ్చింది.

సుంకరి నరహరి ఇల్లు, లాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, స్థిరాస్తుల చిట్టా చూసి అధికారులు సైతం షాక్ అయ్యారు. ఇల్లు, ఆఫీసుల్లో లభ్యమైన రూ.1.54 కోట్ల నెట్ క్యాష్.. వివిధ బ్యాంకుల్లో రూ.5.04 కోట్ల విలువైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బ్యాంకు ఖాతాల్లో నిల్వ ఉన్న మరో రూ.2.29 కోట్లు.. ఇలా చాలా లెక్కలు ఉన్నాయి. నరహరి అవినీతికి అంతులేకుండా పోయింది. దాదాపు 1.3 కిలోల బంగారు ఆభరణాలు, 8 కిలోల వెండి వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

నరహరి భార్య పేరిట రెండు బ్యాంకు లాకర్లు, ఒక విలాసవంతమైన కారును గుర్తించారు. రంగారెడ్డి జిల్లా పరిధిలోని వివిధ ప్రాంతాల్లో 5 ఓపెన్ ప్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల ఖరీదైన వ్యవసాయ భూమి ఉన్నట్లు ఏసీబీ దర్యాప్తులో తేలింది. పుప్పాలగూడలో ఒక అపార్ట్‌మెంట్, నార్సింగిలోని లగ్జరీ అపార్ట్‌మెంట్‌లో రెండు విడివిడి ఫ్లాట్లు, రాజేంద్రనగర్‌లో మరో ఫ్లాట్‌ను కొనుగోలు చేసినట్లు పత్రాలు లభించాయి. వీటితోపాటు టీఎన్జీవో కాలనీలో జీప్లస్‌ 3 (G+3) అంతస్తుల భవనం, ఛత్రినాకలో మూడంతస్తుల కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు ఏసీబీ నిర్ధారించింది.

గత వారం రోడ్లు, భవనాల శాఖ ఇంజినీర్-ఇన్-చీఫ్ మోహన్ నాయక్‌ను అక్రమాస్తుల కేసులో అరెస్ట్ చేసిన ఏసీబీ.. సరిగ్గా వారం తిరగకముందే సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరి భారీ అవినీతి సామ్రాజ్యాన్ని బట్టబయలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సామాన్య ప్రజల నుంచి, భూ రికార్డుల సవరణల పేరిట లంచాల రూపంలో వసూలు చేసిన సొమ్ముతోనే నరహరి ఈ ఆస్తులు కూడబెట్టినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. నరహరికి సంబంధించిన మరికొన్ని బ్యాంకు లాకర్లను కూడా తెరిచి తనిఖీ చేయాల్సి ఉందని, ఈ కేసులో మరిన్ని ఆస్తులు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More