ఇవాళ తెలంగాణకు అమిత్ షా - హైదరాబాద్‌లో 'మహా పాదయాత్ర'
‘సర్’పై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందంటూ హైదరాబాద్‌లో ఇవాళ బీజేపీ పాదయాత్ర చేపట్టనుంది. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొంటారు. ఢిల్లీ రామ్‌లీలా మైదాన్ ప్రదర్శనలో ఇండియా కూటమి చేసిన విమర్శలకు ఇక్కడి నుంచే అమిత్ షా బదులిచ్చే అవకాశం ఉంది.
ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR)పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు బీజేపీ సిద్ధమైంది. ఈ మేరకు తెలంగాణ బీజేపీ నాయకత్వం భారీ పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ మధ్యాహ్నం హైదరాబాద్ నగరానికి రానున్నారు.

ఆదివారం ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో 'ఓట్ బచావో' పేరిట ఇండియా కూటమి నిర్వహించిన భారీ ర్యాలీలో బీజేపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా, భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై దేశద్రోహం మోపి జైలుకు పంపుతామని…. ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు చట్టం నుంచి తప్పించుకోలేరని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా జరిగే పాదయాత్ర బహిరంగ సభ ద్వారా కాంగ్రెస్ విమర్శలకు అమిత్ షా కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది.
పాదయాత్ర రూట్ ఇలా….
ఇవాళ మధ్యాహ్నం బషీర్‌బాగ్‌లోని బాబు జగజ్జీవన్ రామ్ విగ్రహం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. మొజంజాహి మార్కెట్ (MJ మార్కెట్) వరకు సాగుతుంది. యాత్ర ముగింపులో మొజంజాహి మార్కెట్ వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగిస్తారు.
ఈ పర్యటనను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావులు ఆదివారం స్వయంగా పాదయాత్ర మార్గాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాత్ర విజయవంతం కావడానికి అవసరమైన భద్రతా చర్యలు, రూట్ మ్యాప్, సభా ఏర్పాట్లపై అధికారులతో, పార్టీ శ్రేణులతో సమీక్షించారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్ రావు మీడియాతో మాట్లాడుతూ…. ఈ యాత్రలో న్యాయవాదులు, వైద్యులు, బుద్ధిజీవులు, విద్యార్థులు, వేలాది మంది పార్టీ కార్యకర్తలు, సామాన్య ప్రజలు పాల్గొంటారని తెలిపారు. కాంగ్రెస్ వ్యాప్తి చేస్తున్న రాజకీయ అబద్ధాలను తిప్పికొట్టి ప్రజాస్వామ్య వ్యవస్థల విశ్వసనీయతను కాపాడటమే ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

