...
...
Next Story

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లకు ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరణ

బీసీ మహిళల ఆర్థిక స్వావలంబనకు ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు దరఖాస్తుల స్వీకరించనుంది.

Published on: Aug 13, 2026, 14:31:00 IST
Advertisement

బీసీ మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, కుట్టు వృత్తి ద్వారా స్వయం ఉపాధి పొందేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకాన్ని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ డా. బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో లాంఛనంగా ప్రారంభించారు.

ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం ప్రారంభం
ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్ల పథకం ప్రారంభం

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా పాలన ప్రభుత్వంలో బీసీ మహిళల స్వయం ఉపాధి, ఆర్థిక సాధికారతకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. బీసీ మహిళలకు 100 శాతం సబ్సిడీపై ఆటోమేటిక్ కుట్టు మిషన్లు అందించి, వారిని కేవలం ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా కాకుండా స్వయం ఉపాధి పొందే మహిళా పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

రాష్ట్రంలోని 119 శాసనసభ నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గానికి 1,000 చొప్పున మొత్తం 1,19,000 ఆటోమేటిక్ కుట్టు మిషన్లను పంపిణీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒక్కో కుట్టు మిషన్ విలువ రూ.12,000 కాగా, లబ్ధిదారులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా 100 శాతం సబ్సిడీపై అందజేస్తామని చెప్పారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు అర్హులైన బీసీ మహిళల నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు మంత్రి వెల్లడించారు.

కుట్టు వృత్తిపై ఆసక్తి ఉన్న నిరుద్యోగ బీసీ మహిళలకు ఈ పథకం ద్వారా స్వయం ఉపాధి కల్పించడమే ప్రధాన ఉద్దేశమని మంత్రి తెలిపారు. అత్యంత పేదలు, వితంతువులు, ఒంటరి మహిళలు, నిరాశ్రయులు, అనాథలు, వికలాంగులు, అలాగే కుట్టు వృత్తిలో అనుభవం ఉన్న మహిళలకు నిబంధనల మేరకు ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా, ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కుట్టు మిషన్ల వినియోగంపై అవసరమైన శిక్షణను కూడా తప్పనిసరి చేస్తున్నట్లు తెలిపారు.

మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో పాటు పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులు, ఇతర స్వయం ఉపాధి కార్యక్రమాల ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. అదే విధంగా ‘ఇంటింటా ఇందిరమ్మ కుట్టు మిషన్లు’ పథకం ద్వారా బీసీ మహిళలకు ఇంటి నుంచే ఆదాయం పొందే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఆత్మగౌరవ భవనాలకు నిధులు కేటాయిస్తూ, వాటి నిర్మాణాలను పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు. ఇటీవల బలహీన వర్గాల ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి బీసీల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ రూపొందించామని చెప్పారు. కులగణన అనంతరం బీసీల అభివృద్ధికి సంబంధించిన తదుపరి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తామని మంత్రి పేర్కొన్నారు.

ఈనెల 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు హెచ్ఎండీఏ గ్రౌండ్స్ ఎదురుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా మహాత్మా జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలను ఆవిష్కరించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈనెల 18వ తేదీన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై ఆయన విగ్రహాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారని మంత్రి తెలిపారు. ఈ రెండు కార్యక్రమాల్లో బీసీ ప్రజాప్రతినిధులు, బీసీ సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, బిర్ల ఐలయ్య, ఎమ్మెల్యేలు ఈర్లపల్లి శంకరయ్య, నవీన్ యాదవ్, కాలేరు వెంకటేష్, వివిధ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి బాలమయాదేవి, బీసీ సంక్షేమ శాఖ అధికారులు మల్లయ్య బట్టు, అలోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe