...
...
Next Story

Bandi Bhagirath : పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్ - 14 రోజుల రిమాండ్, జైలుకు తరలింపు

Bandi Bhagirath POCSO Case : పోక్సో కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. మేడ్చల్ కోర్టులో హాజరుపర్చగా…. అతనికి 14 రోజుల రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు.

Published on: May 17, 2026, 05:51:25 IST
Advertisement

Bandi Bhagirath POCSO Case : సంచలనం సృష్టించిన పేట్‌బషీరాబాద్ పోక్సో కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఈ కేసులోని ప్రధాన నిందితుడు బండి భగీరథ్ ను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. అర్ధరాత్రి మేడ్చల్ కోర్టులో హాజరుపరిచారు. న్యాయమూర్తి అతనికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో…. భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించారు.

పోక్సో కేసులో  బండి భగీరథ్ అరెస్ట్
పోక్సో కేసులో బండి భగీరథ్ అరెస్ట్

ఈ కేసులో శనివారం ఉదయం నుంచే అత్యంత నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముందస్తు బెయిల్ కోసం, అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ భగీరథ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో ఎలాంటి ఉపశమనం లభించలేదు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు చర్యలను వేగవంతం చేశారు. నిందితుడు దేశం విడిచి పారిపోయే అవకాశం ఉందనే అనుమానంతో శనివారం ఉదయమే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు. అతడిని పట్టుకోవడానికి ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

గాలింపు చర్యల్లో భాగంగా ప్రత్యేక బృందాలు…. బంజారాహిల్స్ సాగర్ సొసైటీలోని కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి చేరుకుని సోదాలు నిర్వహించాయి. అయితే ఆ సమయంలో నిందితుడు అక్కడ లేకపోవడంతో గంట తర్వాత పోలీసులు వెనుతిరిగారు.

ఈ నెల 8వ తేదీన పేట్‌బషీరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో భగీరథ్‌పై పోక్సో కేసు నమోదైనప్పటి నుంచి భగీరథ్ అందుబాటులోకి రాలేదు. పైగా అతని ఫోన్ కూడా స్వీచ్ ఆఫ్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాల్ డేటా రికార్డులను (CDR) క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సమాచారం ఆధారంగానే… బండి భగీరథ్ కోసం పలు ప్రాంతాల్లో గాలించారు. అంతేకాకుండా కరీంనగర్‌లోని భగీరథ్ స్వగృహంతో పాటు అతని మేనమామ వంశీకృష్ణ ఇల్లు, స్నేహితులు, పలువురు బీజేపీ కార్యకర్తల నివాసాల్లోనూ పోలీసులు తనిఖీలు చేసినా ఫలితం దక్కలేదు. సాయంత్రం వేళ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్లను ఉన్నతాధికారులు అప్రమత్తం చేయడంతో…. నిందితుడు ఎక్కడో ఒకచోట లొంగిపోవడం ఖాయమనే సంకేతాలు వెలువడ్డాయి.

బండి సంజయ్ ప్రకటన

శనివారం రాత్రి 9 గంటల సమయంలో నాలుగు కార్లలో ఇద్దరు న్యాయవాదులను వెంటబెట్టుకుని భగీరథ్ నేరుగా పేట్‌బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినట్లు కొన్ని ఫొటోలు, వీడియోలు వైరల్ అయ్యాయి. తానే స్వయంగా పోలీసులకు అప్పగించినట్లు బండి సంజయ్ పేర్కొనగా… పోలీసులు మాత్రం అప్పా జంక్షన్ సమీపంలో అదుపులోకి తీసుకున్నట్లు తెలపటం చర్చనీయాంశంగా మారింది.

భగీరథ్‌ను స్టేషన్‌కు తీసుకురావటంతో కేసును పర్యవేక్షిస్తున్న డీసీపీ రితిరాజ్ అక్కడికి చేరుకుని విచారణను పర్యవేక్షించారు. అప్పటికే స్టేషన్ పరిసరాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. భగీరథ్ అరెస్ట్ ప్రక్రియ పూర్తయిన తర్వాత భగీరథ్‌కు స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం రాత్రి వేళ మేడ్చల్ న్యాయమూర్తి నివాసంలో హాజరుపరచగా….. కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.

మరోవైపు ఈ కేసులో మైనర్‌ బాధితురాలిని పోలీసులు మేడ్చల్‌ కోర్టు మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచారు. బాధితురాలు, ఆమె తల్లి మేజిస్ట్రేట్‌ ఎదుట తమ వాంగ్మూలం ఇచ్చారు. సుమారు 40 నిమిషాలపాటు వారిద్దరు ఇచ్చిన వాంగ్మూలాలను రికార్డు చేశారు. పోలీసులు బాధితురాలి వాంగ్మూలాలను ఇప్పటికే రెండుసార్లు రికార్డు చేసిన సంగతి తెలిసిందే.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks