Bandi Bhagirath POCSO Case : హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్ - పోక్సో కేసు కొట్టివేయాలని పిటిషన్
Bandi Sanjay Son Bhagirath POCSO Case: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ తనపై నమోదైన పోక్సో కేసును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై మే 14న వెకేషన్ బెంచ్ విచారణ జరపనుంది.
Bandi Sanjay Son Bhagirath POCSO Case : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం సంచలనంగా మారింది. ఈ కేసుపై ఇప్పటికే ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసింది. ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా…. మరోవైపు భగీరథ్ ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

తనపై నమోదైన పోక్సో (POCSO) కేసును కొట్టివేయాలని కోరుతూ ఆయన తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులకు వేసవి సెలవులు ఉన్న నేపథ్యంలో… ఈ పిటిషన్‌పై ఈనెల 14వ తేదీన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టనుంది.
అసలేం జరిగింది…?
తన 17 ఏళ్ల కుమార్తెను బండి భగీరథ్ వేధిస్తున్నాడంటూ ఒక బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా ఈ నెల 8వ తేదీన హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో భగీరథ్‌పై పోక్సో చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ కేసు రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది.
భగీరథ్ ఎదురు ఫిర్యాదు
మరోవైపు…. ఈ వ్యవహారంలో బండి భగీరథ్ కూడా పోలీసులను ఆశ్రయించారు. సదరు బాలిక మరియు ఆమె తల్లి తనను లక్ష్యంగా చేసుకున్నారని, తప్పుడు ఆరోపణలు చేస్తూ డబ్బు కోసం తనను బెదిరిస్తున్నారని (Extortion) ఆయన ఆరోపించారు. భగీరథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కరీంనగర్ పోలీసులు మే 7వ తేదీన కేసు నమోదు చేశారు.
తనపై నమోదైన కేసులో ఎలాంటి వాస్తవం లేదని…. అది కేవలం తనను, తన తండ్రి ప్రతిష్టను దెబ్బతీసేందుకు చేసిన కుట్ర అని భగీరథ్ తన పిటిషన్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో హైకోర్టు వెకేషన్ బెంచ్ ఇచ్చే తీర్పు ప్రాధాన్యత సంతరించుకుంది. పోక్సో కేసు తీవ్రత దృష్ట్యా పోలీసులు ఎలా స్పందిస్తారు..? కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది…!
ఇదిలా ఉంటే కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ ను కాపాడేందుకు కాంగ్రెస్ సర్కార్ ప్రయత్నిస్తోందని బీఆర్ఎస్ తీవ్రస్థాయిలో ఆరోపిస్తోంది. ఈ కేసులోని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది. కేసు నమోదైనప్పటికీ… ఇప్పటి వరకు నిందితుడిని ఎందుకు అదుపులోకి తీసుకోలేదని ప్రశ్నిస్తోంది. బాధితులకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటామని… అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని కూడా ఆ పార్టీ నేతలు స్పష్టం చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ…. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఆ పార్టీ నాయకులు, శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

