నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ వద్దు: బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి.. కేంద్ర మంత్రి బెదిరించారంటూ ఆరోపణలు

ఒక మైనర్ బాలికపై అఘాయిత్యం, అధికార బలం చూపి బాధితులను భయపెట్టడం, పోలీసుల తాత్సారం.. బండి భగీరథ్ మీద నమోదైన పోక్సో కేసులో బాధితురాలి తల్లి విడుదల చేసిన పూర్తి ప్రకటన ఇదే.

Published on: May 15, 2026, 08:42:29 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో (POCSO) కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. ఈ కేసులో నిందితుడు పరారీలో ఉండగా, బాధితురాలైన మైనర్ బాలిక తల్లి తొలిసారిగా నోరు విప్పారు. తమకు జరిగిన అన్యాయం, ఎదురైన బెదిరింపులు, వ్యవస్థల నిర్లక్ష్యంపై ఆమె ఒక వివరణాత్మక ప్రకటన విడుదల చేశారు.

నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ వద్దు: బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి.. కేంద్ర మంత్రి బెదిరించారంటూ ఆరోపణలు (HT_PRINT)
నా బిడ్డకు జరిగిన అన్యాయం ఇంకెవరికీ వద్దు: బండి భగీరథ్ కేసులో బాధితురాలి తల్లి.. కేంద్ర మంత్రి బెదిరించారంటూ ఆరోపణలు (HT_PRINT)

పరిచయం పేరుతో వల.. మాయమాటలతో అఘాయిత్యం

2025లో బండి భగీరథ్‌తో తన కుమార్తెకు పరిచయం ఏర్పడిందని బాధితురాలి తల్లి తెలిపారు. మొదట్లో సాధారణంగా సాగిన ఈ పరిచయం, ఆ తర్వాత భగీరథ్ పదేపదే ఫోన్లు చేయడం, ప్రలోభాలకు గురిచేయడంతో అది మానసిక ఒత్తిడికి దారితీసింది. మైనర్ అని కూడా చూడకుండా తన కుమార్తెను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడని ఆమె ఆరోపించారు.

"నా కుమార్తెకు ఇష్టం లేకపోయినా, ఆమె తీవ్రంగా ప్రతిఘటించినా భగీరథ్ పదేపదే శారీరక సంబంధం కోసం ఒత్తిడి తెచ్చేవాడు" అని ఆమె వాపోయారు. ముఖ్యంగా 2025 డిసెంబర్ 31వ తేదీ రాత్రి, కొత్త సంవత్సరం వేడుకల నెపంతో మోయినాబాద్‌లోని ఒక ప్రదేశానికి తీసుకెళ్లి, బలవంతంగా మద్యం సేవించేలా చేసి, అచేతన స్థితిలో ఉన్న బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆమె వివరించారు.

న్యాయం కోసం వెళ్తే.. కేంద్ర మంత్రి ఇంటి వద్ద బెదిరింపులు

జరిగిన దారుణంపై ప్రశ్నించేందుకు, సమస్యను పరిష్కరించుకునేందుకు 2026 ఏప్రిల్ 23న కేంద్ర మంత్రి బండి సంజయ్ నివాసానికి వెళ్లినట్లు బాధితురాలి కుటుంబం తెలిపింది. భగీరథ్ అనుచరుడు సంగప్ప తో కలిసి వెళ్లిన తమకు అక్కడ భరోసా లభిస్తుందని ఆశించామని, కానీ దానికి భిన్నంగా బెదిరింపులు ఎదురయ్యాయని ఆమె పేర్కొన్నారు.

"మేము అక్కడికి వెళ్ళింది న్యాయం కోసం. కానీ బండి సంజయ్ తన రాజకీయ ప్రాబల్యాన్ని చూపిస్తూ మమ్మల్ని హెచ్చరించారు. తన అనుచరుల ద్వారా మా కుటుంబానికి కష్టాలు తప్పవని బెదిరించారు. ఆ రోజు నుంచి మేము నిరంతరం ప్రాణభయంతో బతుకుతున్నాం" అని ఆ తల్లి పేర్కొన్నారు.

పోలీసుల తాత్సారం - ప్రజల ఆందోళనతో కదిలిన యంత్రాంగం

ఈ నెల 8వ తేదీన పేట్ బషీరాబాద్ పోలీసులను ఆశ్రయించినా, చట్టం తన పని తాను చేయడంలో తీవ్ర జాప్యం చేసిందని బాధితురాలి తల్లి ఆరోపించారు. మైనర్ బాలిక అంతటి బాధను వివరిస్తున్నా, జూరిస్డిక్షన్ పేరుతో ఐదు గంటల పాటు స్టేషన్‌లోనే కూర్చోబెట్టారని, చివరకు 'జీరో ఎఫ్ఐఆర్' కోసం పట్టుబట్టిన తర్వాతే ఫిర్యాదు తీసుకున్నారని ఆమె తెలిపారు. మొదట బెయిల్ వచ్చే సెక్షన్లే పెట్టిన పోలీసులు, ప్రజల నుంచి నిరసనలు వ్యక్తమయ్యాక, ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) ఏర్పాటు చేసి కఠినమైన సెక్షన్లు నమోదు చేశారని వివరించారు.

బాధితురాలి గుర్తింపుపై కుట్ర

ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా, సామాజిక మాధ్యమాల్లో బాధితురాలి వయసుపై వివాదం రేపడం, ఆమె ఫోటోలను, గుర్తింపును బయటపెట్టడం వంటి చర్యల ద్వారా తమను మరింత మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మైనర్ల గుర్తింపును కాపాడటం సమాజం యొక్క నైతిక బాధ్యతని ఆమె గుర్తు చేశారు.

తమకు ప్రాణహాని ఉందని, నిష్పాక్షికంగా విచారణ జరిపి నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆమె తెలంగాణ ప్రభుత్వానికి, న్యాయస్థానానికి విజ్ఞప్తి చేశారు.

  • Praveen Kumar Lenkala
    ABOUT THE AUTHOR
    Praveen Kumar Lenkala

    ప్రవీణ్ కుమార్ లెంకల ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. జర్నలిజంలో 25 ఏళ్ల సుదీర్ఘ అనుభవం కలిగిన వీరు, గతంలో సాక్షి దినపత్రికలో ఢిల్లీ నేషనల్ బ్యూరో చీఫ్‌గా (2014-2021) సుమారు ఎనిమిదేళ్ల పాటు పనిచేశారు. ఆ సమయంలో జాతీయ రాజకీయాలు, ప్రభుత్వ విధానాలు, కేంద్ర బడ్జెట్, సార్వత్రిక ఎన్నికలు, రాష్ట్రాల శాసన సభలకు ఎన్నికలు తదితర అనేక అంశాలపై కథనాలు, విశ్లేషణలు, పరిశీలనాత్మక వార్తలు అందించారు. పార్లమెంటు ప్రొసీడింగ్స్ నుంచి.. సుప్రీంకోర్టు విచారణల వరకు కవరేజీలో విశేష అనుభవం ఉంది. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల రాజకీయ పరిణామాలు, అభివృద్ధి సంబంధిత పెండింగ్ సమస్యలు లోతుగా అందించారు. అంతకుముందు హైదరాబాద్‌లో సాక్షి టాస్క్‌ఫోర్స్ బ్యూరోలో (2008-2013) పనిచేస్తూ భూకుంభకోణాలు, ఫైనాన్స్ సంస్థల మోసాలు, వైట్ కాలర్ స్కామ్స్‌ను వెలికితీశారు. ముఖ్యంగా పోలీసు వ్యవస్థలోని 'ఆర్డర్లీ వ్యవస్థ'పై వీరు చేసిన పరిశోధనాత్మక కథనాలు ప్రభుత్వం ఆ వ్యవస్థను రద్దు చేయడానికి కారణమయ్యాయి. ఈనాడు దినపత్రికలో (2003-2007) నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో రిపోర్టర్‌గా, సబ్ ఎడిటర్‌గా పనిచేసి గిరిజన తండాల్లో ఆడపిల్లల అమ్మకాలు, గ్రామీణ ప్రాంతాల వెనుకబాటుతనం, ప్రభుత్వ పథకాల్లో అవినీతిపై సంచలనాత్మక కథనాలు రాశారు. ప్రస్తుతం జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు, బిజినెస్, స్టాక్ మార్కెట్, టెక్నాలజీ, ఆటోమొబైల్ రంగాలపై నిశితమైన విశ్లేషణలు అందిస్తున్నారు. హిందుస్తాన్ టైమ్స్ నుంచి రెండుసార్లు Digi Journo పురస్కారం పొందారు. కమ్యూనికేషన్ అండ్ జర్నలిజంలో పీజీ (MCJ) పట్టా పొందిన వీరు, కామర్స్ (B.Com) నేపథ్యం కలిగి ఉండటం వల్ల ఆర్థిక అంశాలను సరళంగా వివరించడంలో సిద్ధహస్తులు. ప్రజా సమస్యలపై పోరాటం, విధానపరమైన మార్పులకు కారణమైన వీరి రిపోర్టింగ్ శైలి తెలుగు జర్నలిజంలో వీరికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. 2001లో సీ ఛానెల్ అనే కేబుల్ టీవీలో చేరి కెరీర్ ప్రారంభించి హైదరాబాద్ నగర ఆర్థిక, సామాజిక రంగాలపై కథనాలతో పాటు సినిమా వార్తలను కూడా అందించారు.Read More