ఇక వ్యూహాలకు పదును…! మున్సిపల్ ఎన్నికలపై బీజేపీ అధినాయకత్వం ఫోకస్
రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఆ పార్టీ జాతీయ నాయకత్వం… ఇంఛార్జులను నియమించింది. మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని భావిస్తోంది.
రాష్ట్రంలో త్వరలో మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ అధినాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోసం ఇంఛార్జులను నియమించింది. ఈ మేరకు జాతీయ నాయకత్వం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఇంఛార్జుల నియామకం…
ఎన్నికల ఇన్‌ఛార్జ్‌గా మహారాష్ట్ర మంత్రి ఆశిష్ షెలార్, సహ ఇన్‌ఛార్జ్‌లుగా రాజస్థాన్ మాజీ అధ్యక్షుడు అశోక్ పర్నామి, రాజ్యసభ సభ్యురాలు రేఖాశర్మలను నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ ఆదేశాలు జారీ చేశారు. తక్షణమే ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు.
ఇటీవలే జరిగిన ముంబై కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటిన బీజేపీ… ఇక తెలంగాణలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం ముందస్తుగానే ఇంఛార్జులను నియమించింది. రాష్ట్ర నాయకత్వానికి కీలక సూచనలు చేయటంతో పాటు మెజార్టీ సీట్లలో పాగా వేయటమే లక్ష్యంగా దిశానిర్దేశం చేసేందుకు సిద్ధమవుతోంది.
రాష్ట్రంలో మొత్తం 121 మున్సిపాలిటీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్లు ఉన్నాయి. వీటిల్లో 117 మున్సిపాలిటీలు, ఆరు మున్సిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగనున్నాయి. వీటి తర్వాత గ్రేటర్ హైదరాబాద్, గ్రేటర్ వరంగల్ ఎన్నికలుంటాయి. అయితే ముందుగానే జరగబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోంది. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లోని ఓటర్లు బీజేపీ వైపు చూస్తున్నారని… ఇదే అదునుగా బలమైన అభ్యర్థులను రంగంలోకి దించి మెజార్టీ సీట్లను గెలవాలని భావిస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు తర్వాత…. కంటోన్మెంట్, జూబ్లీహిల్స్ ఉపఎన్నికలు వచ్చాయి. అయితే ఇక్కడ ఆశించిన స్థాయిలో బీజేపీ రాణించలేకపోయింది. ఈ రెండు స్థానాలు కూడా గ్రేటర్ హైదరాబాద్ లోనేవి. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యంత బలంగా బీజేపీ ఉన్నప్పటికీ…. ఈ రెండు ఉపఎన్నికల్లో ఢీలా పడిపోయిన పరిస్థితులు కనిపించాయి.
వీటన్నింటిపై సమీక్షించిన పార్టీ అధినాయకత్వం… రూట్ మార్చే పనిలో పడింది. రాబోయే మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో పాగా వేయాలని చూస్తోంది. ఆలస్యం చేయకుండా… ఇంఛార్జులను నియమించేసింది. దీంతో మున్సిపల్ ఎన్నికల విషయంలో రాష్ట్ర నాయకత్వానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు అయింది.
అభ్యర్థుల ఎంపిక, ప్రచార నిర్వహణతో పాటు అనుసరించాల్సిన వ్యూహాలపై ఇంఛార్జులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు. రాష్ట్ర - కేంద్ర నాయకత్వాల మధ్య సంప్రదింపులు జరుపుతూ… కావాల్సిన సూచనలు చేసే అకాశం ఉంది. ఎప్పటికప్పుడు వ్యూహాలకు పదును పెట్డటంతో పాటు… క్షేత్రస్థాయిలోని పరిస్థితులను అనుకూలంగా మార్చుకునే దిశగా అడుగు కార్యాచరణను సిద్ధం
మొత్తంగా ముంబై స్థానిక ఎన్నికల విజయం తర్వాత ఆ పార్టీ జాతీయ నాయకత్వం… తెలంగాణలో జరగబోయే స్థానిక ఎన్నికలపై దృష్టి సారించినట్లు కనిపిస్తోంది.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

