Hyderabad : 3 కార్పొరేషన్లకు వర్తించేలా 'కోర్ అర్బన్ చట్టం' రూపొందించండి - సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు
జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పాటైన 3 కార్పొరేషన్లకు ఈ చట్టం వర్తింపజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని స్పష్టం చేశారు.
ఔటర్ రింగురోడ్డు పరిధిలోని (CURE) మూడు కార్పొరేషన్లకు వర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (GHMC) చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. కోర్ అర్బన్ ప్రాంతంలో అనుమతులు, రుసుమలు, అభివృద్ధి పనుల నిర్వహణ, ఇతర వ్యవహారాలన్నింటికీ ఆ చట్టమే ఆధారంగా ఉండాలని సూచించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో మున్సిపల్ శాఖకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న 99 రోజుల కార్యక్రమంలో మున్సిపల్ పరిధిలో చేపట్టే పనులు తొలుత చేపడతామన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు ఆదేశాలిచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి కీలక సూచనలు….
- "కోర్ అర్బన్ ఏరియాలో పారిశుద్ధ్యానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. పలు ప్రాంతాల్లో చెత్త ఎక్కడ వేయాలో తెలియక ప్రజలు ఖాళీ ప్రదేశాల్లో వేస్తున్నారు. ముందుగా చెత్త వేయాల్సిన ప్రాంతాలను గుర్తించి అక్కడ బోర్డులు ఏర్పాటు చేయాలి.
- కోర్ అర్బన్ ఏరియాలో రోడ్ల నిర్మాణ విషయంలో నిర్దేశిత కాలం వరకు ఉండేలా సాంకేతికతను వినియోగించాలి.
- కోర్ అర్బన్ ఏరియాలో వీధి దీపాలు వెలుగుతున్నాయో లేదో తెలుసుకునేలా డ్యాష్ బోర్డులో కనిపించాలి. ఎక్కడైనా సమస్య ఉంటే దానిని వెంటనే తెలుసుకొని పరిష్కరించాలి.
- ఫుడ్ సేఫ్టీకి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. నగరంలోని అన్ని హోటళ్లలోని కిచెన్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానించాలి.
- తరచూ తనిఖీలు తప్పనిసరి చేయడమే కాకుండా, ఫుడ్ సేఫ్టీకి ఆయా హోటళ్లు తీసుకుంటున్న చర్యలను మదింపు చేయాలి.
- కోర్ అర్బన్ ఏరియాలో ఫైర్ సేఫ్టీకి ప్రధాన్యమివ్వాలి. 50 అంతస్తులకుపైగా భవనాల నిర్మాణాలు జరుగుతున్నందున అగ్ని ప్రమాదాలను అరికట్టేందుకు అవసరమైన అధునాతన సామగ్రి, సాంకేతికతను సమకూర్చుకోవాలి.
- నగరంలోని కూడళ్లలో వాటర్ హార్వెస్టింగ్ వెల్స్ ఏర్పాటు చేసి వర్షపు నీటిని ఒడిసి పట్టాలి.
- కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఆర్ అండ్ బీ, ఇతర విభాగాల పరిధిలోని రోడ్లన్నింటిని మున్సిపల్ శాఖ పరిధిలోకి తీసుకురావాలి.
- భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలి. అక్కడ అవసరమైన అనుమతులు, వివిధ ప్రభుత్వ కార్యాలయాల భవనాల పనులు వేగవంతం చేయాలి.
- నగరంలోని పెద్ద చెరువులు, కుంటల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలి. హైడ్రా పరిరక్షించిన చెరువుల చుట్టూ కట్టలు కట్టి వదిలి వేయకుండా వాటి రక్షణతో పాటు సుందరీకరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలి" అని సీఎం ఆదేశించారు.
ఈ సందర్భంగా నగరంలో వివిధ ప్రదేశాల్లో రద్దీ తగ్గించేందుకు డిజైన్ చేసిన ఎలివేటెడ్ కారిడార్ల నమూనాలను ముఖ్యమంత్రి పరిశీలించి… పలు సూచనలు చేశారు. చారిత్రక ప్రాధాన్యం గల కట్టడాలను పర్యాటక ప్రదేశాలుగా తీర్చిదిద్దేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని పేర్కొన్నారు. వాటిని పర్యాటక స్థలాలుగా మార్చాలని దిశానిర్దేశం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

