...
...
Next Story

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 90 సీట్లతో గెలుస్తాం - సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

2028 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 90 సీట్లు సాధించి మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని సీఎం రేవంత్ రెడ్డి జోస్యం చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరుకావాలని, లేకపోతే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Published on: Sep 5, 2026, 22:16:49 IST
Advertisement

మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సవాల్ విసిరారు మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ కనీసం 90 సీట్లు గెలుచుకుని మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, ఒకవేళ నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్) జరిగి స్థానాల సంఖ్య పెరిగితే ఏకంగా 117 స్థానాలను కైవసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

నల్గొండ జిల్లా నకిరేకల్‌లో శనివారం నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. తన విద్యార్హతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. "కాంగ్రెస్ కార్యకర్తలు నీకు తిరుగులేని రీతిలో సమాధానం చెబుతారు. వారు ఎన్నడూ వెనకడుగు వేయరు. బీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ శ్రేణులు రాజకీయంగా బొందపెడతాయి. ఇది నీవు జీవితాంతం గుర్తుంచుకోవాలి. కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో తేల్చుకుందాం రా" అని సవాల్ విసిరారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఇప్పటివరకు ఉన్న రాజకీయ చరిత్రను రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఉమ్మడి ఏపీలో తెలుగుదేశం పార్టీ (1994-2004) రెండుసార్లు, కాంగ్రెస్ పార్టీ (2004-2014) రెండుసార్లు వరుసగా అధికారంలోకి వచ్చాయని తెలిపారు. అలాగే తెలంగాణ సిద్ధించిన తర్వాత బీఆర్ఎస్ (2014-2024) రెండు విడతలు పాలించిందని గుర్తు చేశారు. అదే రీతిలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా 2028 ఎన్నికల్లో విజయం సాధించి రెండోసారి వరుసగా అధికార పీఠాన్ని దక్కించుకోవడం ఖాయమని స్పష్టం చేశారు. స్థానాల సంఖ్య 119గానే ఉంటే 90 సీట్లు, పెరిగితే 117 సీట్లు సాధిస్తామని చెప్పారు.

కేసీఆర్ రాజీనామా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల, హరీష్ రావు నియోజకవర్గమైన సిద్ధిపేటల్లో కాంగ్రెస్ తరఫున భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పిసిసి అధ్యక్షుడు బి. మహేష్ కుమార్ గౌడ్‌ను సీఎం వేదికపైనే ఆదేశించారు. "రాష్ట్రంలో బీఆర్ఎస్‌ను మళ్లీ కోలుకోకుండా చేస్తాం," అని స్పష్టం చేశారు.

తనను సంస్కారం లేనివాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్న కేటీఆర్ వైఖరిని సీఎం ఎండగట్టారు. "నేను సంస్కారం కలిగిన వ్యక్తిని కాబట్టే బీఆర్ఎస్ నేతలు నేడు స్వేచ్ఛగా తిరగగలుగుతున్నారు," అని వ్యాఖ్యానించారు. కుటుంబ ఆస్తిలో వాటా ఇవ్వడం ఇష్టం లేకే సొంత చెల్లెలు కవితను కేటీఆర్ బయటకు నెట్టేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. "తెలంగాణ ఉద్యమ సమయంలో తాను రాష్ట్రానికి కాపలాదారుగా ఉంటానని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ తర్వాత ఆయన కుమారుడు, కుమార్తె, ఇతర కుటుంబ సభ్యులు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రాన్ని దోచుకున్నారు," అని మండిపడ్డారు.

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైలు నుంచి విడుదలై హైదరాబాద్ వచ్చిన కవితను.... ఆమె సోదరుడు కేటీఆర్ ఇంటి నుంచి బయటకు పంపించి, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయించారని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. "సొంత చెల్లెలికే న్యాయం చేయలేని వ్యక్తి, కోటి మంది మహిళల సంక్షేమం కోసం ఏం పనిచేస్తారు?" అని నిలదీశారు. కుమార్తెను పంపించేసినా, కేటీఆర్ భయంతోనే కేసీఆర్ ప్రస్తుతం ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని విమర్శించారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాక్షేమ పథకాలను సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. మహాలక్ష్మి పథకం కింద ఆర్‌టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు రుణాలు రద్దు చేయడం, రైతు భరోసా పెట్టుబడి సాయం, మహిళా స్వయం సహాయక సంఘాల (SHG) సాధికారతకు తీసుకుంటున్న చర్యలను సభలో వివరించి, ప్రజా సంక్షేమమే తమ ధ్యేయమని స్పష్టం చేశారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe