CM Revanth Reddy Speech : తెలంగాణ స్వరాష్ట్ర అస్తిత్వం కోసం దశాబ్దాల పాటు సాగిన ఉద్యమంలో ఎందరో అమరులయ్యారని, వారి త్యాగాలకు, తెగువకు ఈ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతి ఏటా త్యాగాల చరిత్రను స్మరిస్తూ…. రేపటి భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసుకునే ఒక భావోద్వేగ సందర్భం జూన్ 2 అని ఆయన పేర్కొన్నారు.

స్వరాష్ట్ర స్వప్నాన్ని నిజం చేసిన ఆనాటి ప్రధానమంత్రి స్వర్గీయ మన్మోహన్ సింగ్, నాటి యు.పి.ఎ ఛైర్ పర్సన్ సోనియాగాంధీలకు తెలంగాణ సమాజం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు సీఎం తెలిపారు. ప్రజా కవి కాళోజీ నారాయణరావు రాసిన “పుట్టుక నీది... చావు నీది, బతుకంతా దేశానిది” అన్న మాటలే స్ఫూర్తిగా డిసెంబర్ 7, 2023 న బాధ్యతలు స్వీకరించిన క్షణం నుండి ప్రతిక్షణం తెలంగాణ హితమే పరమార్ధంగా ప్రజా ప్రభుత్వం పని చేస్తోందని సీఎం వివరించారు. ఎవరెన్ని విమర్శలు, కుట్రలు చేసినా ప్రజలు అండగా నిలవడం తమకు ఎనలేని శక్తిని ఇచ్చిందని వివరించారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం - కీలక పాయింట్లు :
వ్యవసాయం, వ్యవసాయ ఆధారిత పరిశ్రమల రంగంలో తెలంగాణను నెంబర్ వన్ గా నిలపాలనే సంకల్పంతో “తెలంగాణ రైజింగ్ - 2047” విధాన పత్రంలో ప్రాధాన్యత అంశంగా తీసుకున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. దీనిని “రూరల్ అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ" గా అభివృద్ధి చేస్తామన్నారు.
- "రాష్ట్రంలో రైతుల అప్పుల భారాన్ని తగ్గించేందుకు ఒకే సారి రూ.2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేశాం. ఇందుకోసం రూ.20,616 కోట్లు ఖర్చు చేసి దాదాపు 25 లక్షల మంది రైతులను రుణ విముక్తులను చేశాం.
- గత రెండున్నరేళ్లలో వ్యవసాయ రంగానికి మొత్తం రూ.1,56,496 కోట్లు ఖర్చు చేశాం. రైతు భరోసా కింద ఇప్పటి వరకు రూ.27,529 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేశాం.
- ధాన్య సేకరణలో దేశంలోనే యాసంగి సీజన్లో సేకరించిన మొత్తం ధాన్యంలో తెలంగాణ వాటా 60 శాతంగా నమోదైంది. ఇప్పటివరకు 8575 కొనుగోలు కేంద్రాల ద్వారా 63.65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి రూ.11,903 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశాం. అకాల వర్షాల వల్ల తడిసిన 10 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసింది.
- సాగునీటి రంగంలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుకు తిరిగి ప్రాణం పోసేందుకు మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతాం. అలాగే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ బ్యారేజీల పునరుద్ధరణ పనులు మొదలుపెట్టాం.
- కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం బ్యాంక్ లింకేజీ మరియు స్త్రీ నిధి ద్వారా రూ.లక్ష కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకుంది, ఇప్పటికే రూ.60 వేల కోట్ల సున్నా వడ్డీ రుణాలను పంపిణీ చేశాం.
- మహిళా సంఘాలకు ఇందిరమ్మ క్యాంటీన్లు, సౌర విద్యుత్తు ప్లాంట్లు, పెట్రోల్ బంకులు, బస్సులు, సూపర్ బజార్లు మరియు రైస్ మిల్లుల నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తున్నాం.
- రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు 8 వేల స్త్రీ శక్తి భవనాల నిర్మాణానికి శంకుస్థాపన చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించే మహాలక్ష్మి పథకం ద్వారా ఆడబిడ్డలు దాదాపు రూ.10 వేల కోట్లు ఆదా చేసుకోగలిగారు.
- గృహజ్యోతి కింద 53.09 లక్షల ఇళ్లకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందజేస్తున్నాం.
- యువతకు ఇచ్చిన మాట ప్రకారం రికార్డు సమయంలో లీగల్ సమస్యలు లేకుండా 67,763 పోస్టులను భర్తీ చేసి దేశానికే ఆదర్శంగా నిలిచాం. ఈ నెలలోనే టీజీపీఎస్సీ (TGPSC) ద్వారా ఇంజినీరింగ్, అటవీశాఖ, విద్యాశాఖల్లో మరో 18 వందల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వనున్నారు.
- పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు మొదటి ఏడాదే రూ.22,500 కోట్లతో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశాం. కేవలం 13 నెలల్లోనే లక్ష ఇళ్ల నిర్మాణం పూర్తయింది. రాబోయే సెప్టెంబర్ 17 ప్రజా పాలన దినోత్సవం నాటికి మిగతా రెండు లక్షల ఇళ్లు పూర్తి చేస్తాం.
- ఆహార భద్రతలో భాగంగా 15.12 లక్షల కొత్త రేషన్ కార్డులు జారీ చేసి, మొత్తం 3.38 కోట్ల మందికి సన్నబియ్యం భోజనం అందించే పరిస్థితి కల్పించాం " అని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు.