4 కోట్ల ప్రజలకు అవకాశాలు అందించటమే లక్ష్యంగా 'విజన్ డాక్యుమెంట్' - సీఎం రేవంత్ రెడ్డి

4 కోట్ల ప్రజలకు సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నామని సీఎం రేవంత్ ప్రకటించారు. గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో మాట్లాడిన ఆయన…పేదలకు సక్షేమ ఫలాలు అందించాలన్నదే తమ ప్రభుత్వ ఆకాంక్ష అని చెప్పారు.

Published on: Dec 10, 2025 6:40 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

అణగారిన అట్టడుగు వర్గాల అభ్యున్నతి, తెలంగాణ రాష్ట్ర సమగ్రాభివృద్ధి చెందాలన్న దృఢ సంకల్పంతో రూపొందించిన తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరూ సహకారం అందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో దేశ, విదేశీ ప్రతినిధుల సమక్షంలో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించి ప్రజలకు అంకితమిచ్చారు.

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ ముగింపు వేదికపై విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ
తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమిట్‌ ముగింపు వేదికపై విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ

మంగళవారం రాత్రి జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో నీతి ఆయోగ్ వైస్-చైర్మన్ సుమన్ బెరీ, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మహీంద్రా గ్రూప్ సంస్థల చైర్మన్, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ చైర్ పర్సన్ ఆనంద్ మహీంద్రా, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, కాలిఫోర్నియా యూనివర్సిటీ ఎకనమిక్స్ ప్రొఫెసర్, కేంద్ర ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు ప్రొఫెసర్ కార్తీక్ మురళీధరన్ , ప్రముఖ ఆర్థిక వేత్త, కేంద్ర మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అర్వింద్ సుబ్రమణ్యం, ప్రముఖ సినీ నటుడు కొణిదెల చిరంజీవి పాల్గొని ప్రసంగించారు.

అందరికీ సమాన అవకాశాలు - సీఎం రేవంత్

ఈ సదస్సును ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో భాగస్వాములైన వారందరికీ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల పక్షాన అభినందనలు తెలిపారు.

“ఈ దార్శనిక పత్రం రూపకల్పన కోసం ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ , నీతి ఆయోగ్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటు 4 లక్షల మంది ఆన్‌లైన్‌లో తమ సూచనలు అందించారు. ఈ ప్రాంత మట్టికి ఒక గొప్ప చైతన్యం ఉంది. జల్, జమీన్, జంగల్ కోసం కొమురం భీమ్ ఆనాడు పోరాటం చేయగా, భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం, పేదరిక నిర్మూలన కోసం, ఈ భూమి మీద ఆధిపత్యం చెలాయించాలనుకున్న వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు జరిగాయి. అలాంటి ఉద్యమాల స్ఫూర్తితో తెలంగాణ ఆకాంక్ష నెరవేరినప్పటికీ ఆశించినంత స్థాయిలో ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగలేదు. అందుకే 4 కోట్ల ప్రజలకు సమాన అవకాశాలు అందించాలన్న లక్ష్యంతో విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించి లక్ష్యాలను నిర్ధేశించుకున్నాం" అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు.

“వందేళ్ల స్వాతంత్య్ర ఉత్సవాలు నిర్వహించే 2047 నాటికి బలమైన ఆర్థిక దేశంగా ప్రపంచంలోనే నాలుగో ఆర్థిక శక్తిగా ఆవిర్భవించాలని ప్రధానమంత్రి నిర్దేశించుకున్న లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా తెలంగాణ 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా అవతరించాలని విజన్‌ను రూపొందించాం. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ నాలుగు గోడల మధ్య తయారు చేసిన కాగితం కాదు. మేధావులు, ఆర్థిక నిపుణులనే కాకుండా మహిళలు, విద్యార్థులను కూడా భాగస్వామ్యం చేసిన ఈ డాక్యుమెంట్‌ను ఈరోజు ప్రజలకు అంకితం చేస్తున్నాం” అని ప్రకటించారు.

“దేశంలోనే తెలంగాణ ఒక రోల్ మాడల్‌గా నిలబెట్టాలి. ఈరోజుల్లో పేదరికం కొందరికి ఎక్స్‌కర్షన్‌గా మారింది. చిన్నతనంలో అంటరానితనం, పేదరికాన్ని ప్రత్యక్షంగా చూసిన వాడిని. వాటిని సమూలంగా రూపుమాపాలని అనుకుంటున్నా. అత్యంత నిరుపేదలకు అభ్యున్నతి లక్ష్యంగా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఈ విధాన పత్రం రూపొందించాం" అని సీఎం పేర్కొన్నారు.

“ఒకవైపు వివక్ష రూపుమాపాలని చెబుతూ, కులాల వారిగా వేర్వేరు పాఠశాలలు నిర్మించాం. మన విద్యా విధానంలో నాణ్యత, నైపుణ్యత లేదు. అందుకనే వాటి స్థానంలో అందరికీ ఒకే చోట విద్యను అందించాలన్న లక్ష్యంతో 20 వేల కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. దేశంలో 140 కోట్ల జనాభా కలిగి ఉన్నప్పటికీ విశ్వక్రీడల్లో ఒక్ బంగారు పతకం సాధించలేకపోతున్నాం. ఇలాంటి అనుభవాల నేపథ్యంలోనే తెలంగాణలో స్పోర్ట్స్‌ యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. యువతలో నైపుణ్యత కొరవడుతోందని రాష్ట్రంలో స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. విద్యపై పెట్టే ఖర్చు పెట్టుబడిగా చూడాలి. మన పిల్లలు భవిష్యత్తులో దేశ పునర్నిర్మాణంలో భాగస్వాములవుతారు” అని సీఎం అభిప్రాయపడ్డారు.

ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యునికేషన్ నినాదంతో ముందుకు సాగుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నది మా ఆకాంక్ష అని చెప్పారు. ఎంతో ఉదాత్తమైన లక్ష్యంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్ లక్ష్యాలను నెరవేర్చడంలో మీరంతా మద్దతుగా నిలవాలని పిలుపునిస్తూ తన ప్రసంగాన్ని ముగించారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More