దీపావళి దీపం ఇంట్లో చీకటిని తొలగిస్తే.. డిజిటల్ దీపం విద్యార్థుల భవిష్యత్తుకు వెలుగులు నింపుతుంది. ప్రతి పేదింటి బిడ్డకు నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మార్గదర్శకత్వంలో టీ-సాట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదులకు చేరుస్తూ, ఉపాధ్యాయులకు ఆధునిక బోధనా నైపుణ్యాల్లో శిక్షణ కల్పిస్తూ విద్యారంగంలో సరికొత్త మార్పులకు శ్రీకారం చుడుతోంది. పేద విద్యార్థుల కలలకు సాంకేతిక వెలుగులు అద్దుతూ, వారి భవిష్యత్తును మరింత ఉజ్వలంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

ఏ సమాజమైనా ప్రగతిపథంలో ముందుకు సాగాలంటే దానికి మూలస్తంభం నాణ్యమైన విద్యే. టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ ఆధునిక యుగంలో సాంప్రదాయ పాఠ్యపుస్తకాలతో పాటు డిజిటల్ విద్యా వనరులను తరగతి గదికి అనుసంధానించడం కీలకంగా మారింది. పాఠ్యాంశాలను వీడియోలు, దృశ్య రూపకాలు, ఇతర డిజిటల్ సాధనాల ద్వారా వివరించడం వల్ల విద్యార్థులకు విషయాలను మరింత సులభంగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో టీ-సాట్ ద్వారా కొనసాగుతున్న విద్యా ప్రసారాలు, కేంద్ర ప్రభుత్వ పీఎం ఈ-విద్య కార్యక్రమం కింద అందుబాటులో ఉన్న డిజిటల్ ఛానళ్లు విద్యార్థులకు అదనంగా నేర్చుకునే అవకాశాలను అందిస్తున్నాయి.
'తరగతి గది నాలుగు గోడల మధ్యే దేశ భవిష్యత్తు రూపుదిద్దుకుంటుంది' అనే పెద్దల మాట విద్యార్థుల భవిష్యత్తు నిర్మాణంలో ఉపాధ్యాయుల పాత్రను స్పష్టం చేస్తుంది. డిజిటల్ సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా, దాన్ని విద్యార్థులకు అర్థవంతమైన అభ్యాస అనుభవంగా మార్చేది ఉపాధ్యాయుడే. ఈ నేపథ్యంలో టీ-సాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులకు డిజిటల్ విద్యను మరింత చేరువ చేసేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి.
నాణ్యమైన ఎడ్యుకేషన్ కంటెంట్ రూపకల్పనతో పాటు, ఆధునిక టెక్నాలజీని బోధనలో సమర్థంగా వినియోగించుకునేలా ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంపై టి-సాట్ దృష్టి సారిస్తోంది. తద్వారా డిజిటల్ ప్రసారాలను కేవలం సమాచార వేదికలుగా కాకుండా, విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతున్నది.
{{/usCountry}}నాణ్యమైన ఎడ్యుకేషన్ కంటెంట్ రూపకల్పనతో పాటు, ఆధునిక టెక్నాలజీని బోధనలో సమర్థంగా వినియోగించుకునేలా ఉపాధ్యాయులను సన్నద్ధం చేయడంపై టి-సాట్ దృష్టి సారిస్తోంది. తద్వారా డిజిటల్ ప్రసారాలను కేవలం సమాచార వేదికలుగా కాకుండా, విద్యార్థులు నేర్చుకోవడానికి ఉపయోగపడే సాధనాలుగా తీర్చిదిద్దే అవకాశం ఏర్పడుతున్నది.
{{/usCountry}}విద్యా వ్యవస్థలో అందరికీ సమాన అవకాశాలు కల్పించడంలో డిజిటల్ ఛానళ్లు కీలక పాత్ర పోషించగలవు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘పీఎం ఈ-విద్య’ కార్యక్రమం జాతీయ విద్యా విధానం ప్రతిపాదించిన లభ్యత, సమానత్వం, నాణ్యత, అందుబాటు ధర, జవాబుదారీతనం వంటి ఐదు ప్రాథమిక సూత్రాలకు అనుగుణంగా అమలవుతున్నది. ఈ పథకం కింద దేశవ్యాప్తంగా ప్రసారమవుతున్న డిజిటల్ డీటీహెచ్ ఛానళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యా అవసరాల కోసం ప్రత్యేకంగా ఐదు ఛానళ్లను కేటాయించారు. డీడీ ఫ్రీ డిష్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఈ ఛానళ్లు ఉచితంగా అందుబాటులో ఉన్నాయి.
అంతేకాకుండా పీఎం ఈ-విద్య మొబైల్ యాప్, టీ-సాట్ యాప్, దీక్ష పోర్టల్, యూట్యూబ్ వంటి పలు వేదికల ద్వారా డిజిటల్ పాఠాలను వీక్షించే అవకాశాలున్నాయి. చూపు లేదా వినికిడి లోపం ఉన్న విద్యార్థులకు భారతీయ సంజ్ఞా భాషలో ఎడ్యుకేషన్ కంటెంట్ అందించడం కూడా ఈ కార్యక్రమంలోని ముఖ్యమైన అంశం. తద్వారా విభిన్న అవసరాలు కలిగిన విద్యార్థులకు విద్యా వనరులను చేరువ చేసే అవకాశం ఏర్పడుతున్నది.
తెలంగాణలో శాటిలైట్ ఆధారిత విద్యా ప్రసారాలకు ఇప్పటికే ఒక వ్యవస్థ ఉంది. సాఫ్ట్‌నెట్ ఆధ్వర్యంలో నిర్వహించే టీ-సాట్ నిపుణ, టీ-సాట్ విద్య ఛానళ్లు విద్యాబోధనతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులకు కూడా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు పీఎం ఈ-విద్య కింద కేటాయించిన ఐదు ప్రత్యేక ఛానళ్లు కూడా విద్యార్థులకు అదనపు అభ్యసన వేదికలుగా ఉపయోగపడగలవు. ఈ వేదికలను విద్యార్థులు క్రమం తప్పకుండా వినియోగించేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలి.
డిజిటల్ పాఠాలు అనగానే కెమెరా ముందు నిలబడి పాఠం చెప్తే సరిపోదు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, పాఠ్యాంశాలను సృజనాత్మకంగా, విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే రీతిలో రూపొందించాలి.
ఉపాధ్యాయులు స్వయంగా కంటెంట్ క్రియేటర్లుగా మారినప్పుడు, విద్యార్థుల అభ్యసన స్థాయి, అవసరాలకు అనుగుణంగా పాఠాలను సులభంగా, ఆసక్తికరంగా రూపొందించే అవకాశం ఉంటుంది. డిజిటల్ కంటెంట్‌ను తరగతి గది బోధనతో అనుసంధానించడం ద్వారా విద్యార్థులకు విషయాలను మరోసారి అర్థం చేసుకునే అవకాశం కల్పించవచ్చు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి సంబంధించిన వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ బాధ్యతలను స్వయంగా నిర్వహిస్తున్నందున, పాఠశాలల అభివృద్ధి, విద్యా ప్రమాణాల మెరుగుదల, డిజిటల్ వనరుల వినియోగం వంటి అంశాలు రాష్ట్ర విద్యా వ్యవస్థలో ప్రాధాన్యత కలిగిన అంశాలుగా ఉన్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం పలు అంశాలపై దృష్టి సారిస్తోంది. పాఠశాలల మౌలిక సదుపాయాల అభివృద్ధి, డిజిటల్ వనరుల కల్పన, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ స్కూళ్ల ఏర్పాటు, ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ వంటి చర్యలు ఈ ప్రయత్నాల్లో భాగంగా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న సుమారు ఇరవై లక్షల మంది విద్యార్థులకు నాణ్యమైన విద్యా వనరులను చేరువ చేయడంలో డిజిటల్ విద్య కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లలో టీ-సాట్, పీఎం ఈ-విద్య యాప్‌లను అందుబాటులో ఉంచడం, విద్యార్థులు వాటి ద్వారా పాఠాలను వీక్షించేలా ప్రోత్సహించడం ద్వారా తరగతి గది వెలుపల కూడా అభ్యసాన్ని కొనసాగించవచ్చు. అయితే ఈ ప్రయత్నాల ఫలితాలు విద్యార్థులకు ఎంతవరకు చేరుతున్నాయన్నది వాటి క్షేత్రస్థాయి అమలు, ఉపాధ్యాయుల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుంది.
శిక్షణ అనేది కేవలం నాలుగు రోజుల కార్యక్రమంతో ముగిసే ప్రక్రియ కాదు. నేర్చుకున్న నైపుణ్యాలను ఇతర ఉపాధ్యాయులకు చేరవేయడం, తరగతి గదుల్లో వాటిని అమలు చేయడం కూడా అంతే ముఖ్యం. టీ సాట్‌లో శిక్షణ పొందిన వంద మంది ఉపాధ్యాయులు రాష్ట్రవ్యాప్తంగా ఇతర ఉపాధ్యాయులకు, రిసోర్స్ పర్సన్లకు మార్గదర్శకులుగా నిలవాలి. ఈ ప్రక్రియలో భాగంగా డిజిటల్ బోధనా విధానాల అమలు, కంటెంట్ వినియోగం, ఉపాధ్యాయుల పురోగతిని ప్రతి మూడు నెలలకోసారి ఆన్లైన్ సమావేశాల ద్వారా సమీక్షించే ప్రణాళిక ఉంది. కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 2027 నవంబర్‌లో నిర్వహించనున్న ‘పరాఖ్’ జాతీయ మూల్యాంకనంలో తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని మొదటి పది స్థానాల్లో నిలపాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందుతున్నాయి. ఈ లక్ష్య సాధనలో విద్యార్థుల అభ్యసన స్థాయిని మెరుగుపరచడం, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను బలోపేతం చేయడం కీలకంగా ఉండనున్నాయి.
సాంకేతికత ఎంత వేగంగా దూసుకుపోయినా, దానికి దిశా నిర్దేశం చేసే దిక్సూచి ఉపాధ్యాయుడే. సాంకేతిక పరిజ్ఞానాన్ని తరగతి గదికి సరైన రీతిలో అనుసంధానించినప్పుడే అసలైన జ్ఞాన విప్లవం సంభవిస్తుంది. తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, పీఎం ఈ-విద్య ఛానళ్ల సౌలభ్యం, టీ-సాట్ మౌలిక వసతులు, ఉపాధ్యాయుల అంకితభావం అన్నీ కలిసికట్టుగా సాగితే... రేపటి నవ భారత నిర్మాణంలో తెలంగాణ విద్యార్థులు డిజిటల్ రథసారథులుగా నిలవడం తథ్యం.
దీపావళి నాడు వెలిగించే దీపం కొంతసేపు చీకటిని తొలగిస్తే.. విద్య ద్వారా వెలిగించే జ్ఞానదీపం తరతరాల భవిష్యత్తును ప్రకాశింపజేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం టీ-సాట్ ద్వారా చేపడుతున్న డిజిటల్ విద్యా ప్రయత్నాలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అలాంటి జ్ఞానదీపాలుగా మారాలి. ప్రతి ఉపాధ్యాయుడు సాంకేతికతను అందిపుచ్చుకుని, ప్రతి విద్యార్థి దాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడే ఈ ప్రయత్నాలకు సార్థకత చేకూరుతుంది. పేద, మధ్యతరగతి విద్యార్థులందరికీ సమానమైన నాణ్యమైన విద్యను అందించి, తెలంగాణను డిజిటల్ విద్యలో దేశానికే ఆదర్శంగా నిలపడమే ఈ దీపావళి వెలుగుల వెనుక ఉన్న అసలైన సంకల్పం కావాలి.
-జి.లక్ష్మి, రీసెర్చర్