...
...
Next Story

ఈ వర్షాలకే తొందరపడి పంటలు వేయవద్దు.. రైతులకు వ్యవసాయ శాఖ కీలక సూచనలు

ఇప్పటికే తెలంగాణలోని చాలా ప్రాంతాల్లో రైతులు పంట వేసేందుకు భూములను సిద్ధం చేశారు. వర్షాల కోసం చూస్తున్నారు. కానీ వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలు కీలక సూచనలు చేశారు.

Published on: Jun 13, 2026, 06:12:23 IST
Advertisement

తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించినప్పటికీ, ఎల్ నినో(El Nino) ప్రభావం వల్ల ఈ ఏడాది వర్షపాతంలో అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ రైతులను హెచ్చరించింది. రుతుపవనాల ఆరంభంలో కురిసే మొదటి వర్షానికే రైతులు తొందరపడి విత్తనాలు నాటవద్దని అధికారులు గట్టిగా విజ్ఞప్తి చేస్తున్నారు.

రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు
రైతులకు వ్యవసాయ శాఖ సూచనలు

ఈ ఏడాది సాగు ప్రణాళికలపై వ్యవసాయ కమిషనర్ డాక్టర్ బి. గోపి మాట్లాడారు. 'కనీసం 50 నుండి 70 మి.మీ వర్షపాతం నమోదై, భూమిలో విత్తనం మొలకెత్తడానికి సరిపడా తేమ ఉందని నమ్మకం కుదిరిన తర్వాతే రైతులు విత్తనాలు వేయాలి. ప్రస్తుత అంచనాల ప్రకారం, రాబోయే వారంలో వర్షాలు రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయి. కాబట్టి రైతులు సాగు విషయంలో కాస్త ఓపిక పట్టాలి.' అని సూచించారు.

తెలంగాణలోని మొత్తం సాగు భూమిలో చాలా వరకు కేవలం వర్షధార పంటలపైనే ఆధారపడి ఉంది. ఈ భారీ విస్తీర్ణాన్ని దృష్టిలో ఉంచుకుని, వర్షాలు ఆలస్యమవడం లేదా మధ్యలో ముఖం చాటేయడం వంటి పరిస్థితులను తట్టుకునేలా వ్యవసాయ శాఖ ఇప్పటికే ప్రత్యామ్నాయ ప్రణాళికలను సిద్ధం చేసింది. రైతులు ప్రస్తుతానికి వేచి చూసే ధోరణిని అవలంబించాలని, వీలైనంత వరకు తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను ఎంచుకోవాలని కమిషనర్ గోపి కోరారు. వర్షాల రాకను బట్టి ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను రైతులకు అందుబాటులో ఉంచేందుకు శాఖ ఏర్పాట్లు చేస్తోంది.

మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో రైతులు అప్పుడే వ్యవసాయ పనులను ప్రారంభించారు. వ్యవసాయ శాఖకు చెందిన ఫెర్టిలైజర్ యాప్ ద్వారా శుక్రవారం నాటికి దాదాపు 3 లక్షల మంది రైతులు యూరియాను కొనుగోలు చేశారు. ముఖ్యంగా నిజామాబాద్, కామారెడ్డి, వరంగల్ లోని కొన్ని ప్రాంతాల్లో యూరియాకు మంచి డిమాండ్ కనిపిస్తోందని, దీన్ని బట్టి అక్కడ సాగు పనులు మొదలైనట్లు గుర్తిస్తున్నామని డాక్టర్ గోపి తెలిపారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe