డ్రైవింగ్ లైసెన్స్ కావాలా? కొత్తగా మరో టెస్ట్ రాయాల్సిందే.. అందులో ఏముంటాయి?
Driving License New Rule : తెలంగాణలో డ్రైవింగ్ టెస్ట్ పాస్ అయ్యేందుకు మరో పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఈ విధానం ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, రహదారి భద్రతపై అవగాహన లేకపోవడం కారణాలతో రోడ్డు ప్రమాదాలకు గణనీయంగా పెరుగుతున్నాయి. సరైన డ్రైవింగ్ నైపుణ్యాలు లేని చాలా మంది డ్రైవర్లు తమ ప్రాణాలనే కాకుండా.. రహదారిపై ఉన్న ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేస్తున్నారు. భారతదేశంలో ప్రతి ఏటా రోడ్డు ప్రమాదాలలో దాదాపు 1.7 లక్షల మంది మరణిస్తున్నారు. ఒక్క తెలంగాణలోనే ఏటా సుమారు 7,500 మంది ప్రాణాలు కోల్పోతుండగా దాదాపు 23,000 మంది గాయపడుతున్నారు. ఈ గణాంకాల దృష్ట్యా రోడ్డు ప్రమాదాలు, మరణాలను నియంత్రించడానికి చర్యలు తీసుకోవాలని కొన్ని నెలల క్రితం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రవాణా శాఖ రోడ్డు భద్రతా చర్యలను పటిష్టం చేయాలని నిర్ణయించింది.

ఈ చర్యలలో భాగంగా డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియలో కీలక మార్పులు చేయడానికి శాఖ ప్రణాళిక రచిస్తోంది. ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్ ప్రక్రియలో రెండు దశలు ఉంటాయి. లెర్నర్స్ లైసెన్స్ రిజిస్ట్రేషన్ (LLR) పరీక్ష, శాశ్వత డ్రైవింగ్ పరీక్ష. రవాణా శాఖ ఇప్పుడు అదనంగా ఆన్‌లైన్ రోడ్ సేఫ్టీ అవేర్‌నెస్ మాడ్యూల్స్ పరీక్షను ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. దీనితో ఇది మూడు దశల వ్యవస్థగా మారుతుంది.
కొత్త విధానం ఏప్రిల్ మొదటి వారం నుంచి అమలులోకి వస్తుందని భావిస్తున్నారు. సవరించిన విధానం ప్రకారం, దరఖాస్తుదారులు లెర్నర్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునే ముందు తప్పనిసరిగా ఆన్‌లైన్ రోడ్డు భద్రతా అవగాహన పరీక్షను పూర్తి చేయాలి. ఆరు మాడ్యూల్స్ ఉంటాయి, ఒక్కో మాడ్యూల్ 30 నిమిషాల నిడివితో మొత్తం వ్యవధి మూడు గంటలు. ఈ మాడ్యూల్స్‌లో రోడ్డు భద్రతా అవగాహనకు సంబంధించిన శిక్షణతో పాటు మూల్యాంకనాలు కూడా ఉంటాయి.
పరీక్ష రాయడానికి అభ్యర్థులు ఏ కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేదు. కెమెరాతో కూడిన ల్యాప్‌టాప్ లేదా డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను ఉపయోగించి ఇంటి నుండి లేదా కార్యాలయం నుండి పరీక్షకు హాజరు కావచ్చు. ప్రత్యామ్నాయంగా, దరఖాస్తుదారులు నిర్దేశిత డ్రైవింగ్ స్కూల్ కేంద్రాలలో కూడా పరీక్ష రాయవచ్చు. మాడ్యూల్స్ పూర్తి చేసిన తర్వాత.. అభ్యర్థులు ఒక ప్రత్యేక సర్టిఫికేట్ నంబర్‌ను పొందుతారు. ఇది లెర్నర్ లైసెన్స్ పరీక్షకు దరఖాస్తు చేసుకోవడానికి అవసరం అవుతుంది.
ఈ మాడ్యూల్స్‌లో రవాణా శాఖ వీడియోల ద్వారా నిజ జీవిత రోడ్డు ప్రమాద దృశ్యాలను, సాధారణ డ్రైవింగ్ తప్పులను ప్రదర్శిస్తారు. రోడ్లపై ఎలా డ్రైవ్ చేయాలి, అద్దాలను ఎలా సర్దుకోవాలి, వాహనాలను సురక్షితంగా ఎలా ఓవర్‌టేక్ చేయాలి వంటి సురక్షిత డ్రైవింగ్ పద్ధతులపై ఈ కార్యక్రమం మార్గదర్శనం కూడా అందిస్తుంది.
ప్రమాదాలు ఎలా జరుగుతాయి, అటువంటి పరిస్థితులలో ఎవరు బాధ్యత వహిస్తారు, ప్రమాద బాధితులు, వారి కుటుంబాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనే విషయాలకు సంబంధించిన ఉదాహరణలను కూడా దరఖాస్తుదారులకు చూపిస్తారు. ఈ చొరవ కొత్త డ్రైవర్లు అసురక్షిత డ్రైవింగ్ పరిణామాలను అర్థం చేసుకోవడానికి, సాధారణ తప్పులను నివారించడానికి సహాయపడుతుందని రవాణా శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.
ప్రతి మాడ్యూల్‌లో ఒక చిన్న పరీక్ష ఉంటుంది, కానీ అది కష్టంగా ఉండదు. వారు ఇచ్చే ట్రైనింగ్‌ను ఫాలో అయితే సులభంగా ఉత్తీర్ణత సాధించగలరు. కొత్త విధానం డ్రైవింగ్ లైసెన్స్ పొందే ప్రక్రియను కొంచెం కఠినతరం చేసినప్పటికీ.. ఇది రహదారి భద్రతపై అవగాహనను గణనీయంగా మెరుగుపరుస్తుందని, రాష్ట్రంలో ప్రమాదాలను తగ్గించడంలో సహాయపడుతుందని అధికారులు భావిస్తున్నారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


