...
...
Next Story

మూడు నాలుగేళ్లలో తెలంగాణలో 10 లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ విస్తరణ

రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పరిశోధన ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతికతను వినియోగించాలన్నారు. చిన్న, సన్నకారు రైతులే లక్ష్యంగా పరిశోధనలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.

Published on: Aug 19, 2026, 08:27:21 IST
Advertisement

రైతుల అవసరాలకు అనుగుణంగా ఉద్యాన పరిశోధనలు జరగాలని, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాల్లో జరుగుతున్న పరిశోధనల ఫలితాలు రైతుల చెంతకు చేరేలా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన కళాశాల ప్రాంగణంలో హార్టికల్చరల్ రీసెర్చ్ కాంప్లెక్స్‌కు మంత్రి శంకుస్థాన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ ఉద్యాన రంగానికి కొత్త దిశను చూపే చారిత్రాత్మక ఘట్టంగా ఈ పరిశోధనా సముదాయం నిలుస్తుందని అన్నారు.

ఆయిల్ పామ్
ఆయిల్ పామ్

ఇప్పటివరకు విశ్వవిద్యాలయాలు, పరిశోధనా కేంద్రాలు, ప్రయోగశాలల్లో ఎన్నో విలువైన పరిశోధనలు జరిగినప్పటికీ వాటి ఫలితాలు రైతులకు ఆశించిన స్థాయిలో చేరడం లేదని మంత్రి అన్నారు. గతంలో పరిశోధన ఫలితాలను రైతులకు చేరవేయడానికి రేడియో, టెలివిజన్ వంటి పరిమిత మార్గాలు ఉండేవని, ప్రస్తుతం ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్‌ఫోన్, సోషల్ మీడియా, యూట్యూబ్ వంటి శక్తివంతమైన మాధ్యమాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. పరిశోధనల ఫలితాలను వీడియోలు, షార్ట్ ఫిల్మ్‌లు, సోషల్ మీడియా ద్వారా రైతులకు చేరేలా శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాలు, ఉద్యాన శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

రాష్ట్ర వ్యవసాయ భూమిలో ఉద్యాన పంటలు సుమారు 6 శాతం మాత్రమే ఉన్నప్పటికీ, వ్యవసాయ స్థూల విలువలో వాటి వాటా 26 శాతం, సుమారు రూ.30,346 కోట్లుగా ఉందని మంత్రి తుమ్మల తెలిపారు. ఉద్యాన రంగం రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నందున పరిశోధన, సాంకేతికత, విస్తరణ సేవలకు మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

రాష్ట్రంలో కూరగాయల ఉత్పత్తిలో సుమారు 70 శాతం లోటు ఉందని, ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి చేసుకునే పరిస్థితి ఉండటం ఆందోళనకరమని మంత్రి అన్నారు. రాష్ట్రంలోనే డిమాండ్ ఉన్న కూరగాయలు, ఉద్యాన పంటలను పండించేలా ప్రతి జిల్లా, మండల కేంద్రాల్లో డెమాన్‌స్ట్రేషన్ ప్లాట్లను ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు ప్రత్యక్షంగా పంటలను, దిగుబడులను, ఆదాయ అవకాశాలను చూసి నేర్చుకునేలా ఫీల్డ్ డెమాన్‌స్ట్రేషన్లు నిర్వహిస్తే ఉద్యాన పంటల విస్తీర్ణం, ఉత్పాదకత గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.

తెలంగాణ ఇప్పటికే ఆయిల్‌పామ్ సాగు విస్తరణలో దేశంలోనే ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. రానున్న మూడు నాలుగు సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆయిల్‌పామ్ విస్తీర్ణాన్ని 10 లక్షల ఎకరాలకు తీసుకెళ్లే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆయిల్‌పామ్‌తో పాటు కోకో, జాపత్రి తదితర అంతర పంటల ద్వారా రైతులకు అదనపు ఆదాయ అవకాశాలు కల్పించవచ్చని అన్నారు. రైతులు ప్రత్యక్షంగా చూసి నేర్చుకునేలా ఈ పద్ధతులను పరిశోధనా కేంద్రాలు, డెమాన్‌స్ట్రేషన్ ఫారాల్లో ప్రదర్శించాలని సూచించారు.

రైతులు అధికంగా రసాయన ఎరువులు, పురుగుమందులు వినియోగించకుండా శాస్త్రీయ సూచనల మేరకు సమతుల్య ఎరువుల వినియోగం, సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించేలా పరిశోధనా సంస్థలు, వ్యవసాయ శాఖ అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. పంటల్లో రసాయన అవశేషాలను తగ్గించి నాణ్యమైన ఉత్పత్తులను అందించగలిగితే దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా తెలంగాణ పంటలకు మరింత డిమాండ్ ఏర్పడుతుందని అన్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe