Singareni BESS : సింగరేణిలో 'బ్యాటరీ ప్లాంట్' సూపర్ హిట్..! మిగులు విద్యుత్ స్టోరేజీతో లాభాలు

Singareni Battery Energy Storage System : సింగరేణి సోలార్ ప్లాంట్ పరిధిలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన 'బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్' (BESS) సత్ఫలితాలనిస్తోంది. వృథాగా పోయే మిగులు విద్యుత్‌ను నిల్వ చేస్తూ సింగరేణి సంస్థకు భారీగా ఆర్థిక లబ్ధి చేకూరుస్తోంది.

Published on: May 21, 2026, 18:13:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Singareni Battery Energy Storage System : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) ఏర్పాటు చేసిన బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ (BESS) అద్భుత ఫలితాలను ఇస్తోంది. పగటిపూట సోలార్ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో….. స్థానిక అవసరాలకు పోను మిగిలిపోయే కరెంటును వృథాగా గ్రిడ్‌కు వదలకుండా ఈ బ్యాటరీ వ్యవస్థలో నిల్వ చేస్తున్నారు. ఇలా దాచిన విద్యుత్‌ను డిమాండ్ ఉన్న సమయంలో తిరిగి వినియోగించుకుంటూ సింగరేణి సంస్థ భారీగా ఆర్థిక ప్రయోజనాలను పొందుతోంది.

సింగరేణిలో బ్యాటరీ ప్లాంట్ సూపర్ హిట్
సింగరేణిలో బ్యాటరీ ప్లాంట్ సూపర్ హిట్

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మార్గదర్శకాలకు అనుగుణంగా నాలుగు నెలల క్రితం ఈ ప్రాజెక్టును ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా మందమర్రి ఏరియాలోని 28 మెగావాట్ల సింగరేణి సోలార్ ప్లాంట్‌కు అనుబంధంగా 1 మెగావాట్ సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్‌ను నెలకొల్పారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ కోసం సింగరేణి యాజమాన్యం రూ. 2.5 కోట్లను వెచ్చించింది.

అసలు ఏంటి బీఈఎస్ఎస్ (BESS)….?

ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం పునరుత్పాదక ఇంధన వనరుల (సౌర విద్యుత్) ఉత్పత్తిని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే సింగరేణి సంస్థ ఇప్పటివరకు 8 ప్రాంతాల్లో మొత్తం 245.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్లను నిర్మించింది. వీటిలో 147 మెగావాట్ల ప్లాంట్లను 'ఓపెన్ యాక్సెస్' ప్లాంట్లుగా, మిగిలిన 98.50 మెగావాట్ల ప్లాంట్లను 'ఇన్-హౌస్' ప్లాంట్లుగా వర్గీకరించి తెలంగాణ విద్యుత్ గ్రిడ్‌కు అనుసంధానించారు.

ఇక్కడే అసలైన సవాలు ఎదురైంది. ఇన్-హౌస్ ప్లాంట్ల నుండి వచ్చే విద్యుత్‌ను గ్రిడ్‌కు అనుసంధానం చేసినప్పటికీ…. ప్రస్తుత విద్యుత్ కొనుగోలు ఒప్పందాల (PPA) ప్రకారం స్థానిక అవసరాలకు వాడగా మిగిలిపోయే అదనపు విద్యుత్‌కు తెలంగాణ డిస్కమ్‌లు ఎలాంటి చెల్లింపులు చేయవు. ఆ మిగులు విద్యుత్‌ను ఉచితంగానే గ్రిడ్‌కు సరఫరా చేయాల్సి వచ్చేది. దీనివల్ల రోజుకు వేలాది యూనిట్ల సౌర విద్యుత్ రూపంలో సింగరేణికి ఎలాంటి ఆర్థిక ప్రయోజనం దక్కేది కాదు. ఈ నష్టాన్ని నివారించి, ప్రతి యూనిట్ విద్యుత్‌ను సొమ్ము చేసుకోవాలనే లక్ష్యంతోనే మందమర్రిలో ఈ ప్రయోగాత్మక బ్యాటరీ స్టోరేజీ వ్యవస్థను తీసుకొచ్చారు.

రూ.25 లక్షలు ఆదా….

మందమర్రిలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్ ప్రస్తుతం అత్యంత సమర్థంగా పనిచేస్తోంది. ఇది మందమర్రి, శ్రీరాంపూర్ ఏరియాల్లోని గనులు, కార్యాలయాలు, కార్మిక కాలనీలకు అవసరమైన విద్యుత్‌ను నిరంతరం అందిస్తోంది. అయితే, పగటిపూట ఈ ప్రాంతాల స్థానిక అవసరాలకు పోను ఇంకా భారీగా విద్యుత్ మిగిలిపోతోంది. దీనిని నిల్వ చేసేందుకు గత జనవరి నెలలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ను అందుబాటులోకి తెచ్చారు.

జనవరిలో ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు ఈ బీఈఎస్ఎస్ యూనిట్ ద్వారా స్థానికంగా వాడగా మిగిలిన 3,35,485 యూనిట్ల విద్యుత్‌ను విజయవంతంగా బ్యాటరీలలో నిల్వ చేశారు. ఆ తర్వాత గనుల అవసరాలకు, పీక్ అవర్స్‌లో ఈ విద్యుత్‌ను వాడుకున్నారు. తద్వారా కేవలం నాలుగు నెలల కాలంలోనే సింగరేణి సంస్థకు రూ. 25,66,460 ల ఆర్థిక లబ్ధి చేకూరింది. కేవలం ఒక మెగావాట్ సామర్థ్యం ఉన్న చిన్న యూనిట్ ఇంత పెద్ద మొత్తంలో విద్యుత్‌ను….. ప్రభుత్వ సొమ్మును ఆదా చేయడం పట్ల విద్యుత్ రంగ నిపుణులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ప్రయోగాత్మకంగా చేపట్టిన ఈ సరికొత్త ఇంధన నిల్వ విధానం (BESS) వంద శాతం విజయవంతం కావడం పట్ల సింగరేణి యాజమాన్యం సంతోషం వ్యక్తం చేసింది. పర్యావరణహిత హరిత ఇంధనాన్ని ప్రోత్సహించాలనే ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా, రాబోయే రోజుల్లో మరిన్ని సోలార్ ప్లాంట్ల వద్ద ఇలాంటి బ్యాటరీ స్టోరేజీ ప్రాజెక్టులను విస్తరిస్తామని యాజమాన్యం స్పష్టం చేసింది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More