...
...
Next Story

ఆగస్టులో హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ ధరలు చాలా కాస్ట్‌లీ.. షాకిస్తున్న ధరలు.. కారణం ఏంటి?

ఆగస్టు ప్రయాణానికి సంబంధించి.. యూఏఈ-భారత్ ప్రయాణ విమాన ఛార్జీల విషయంలో హైదరాబాద్ అగ్రస్థానంలో ఉంది. ఆ తర్వాతే దేశంలోని ఇతర నగరాలు ఉన్నాయి.

Published on: Jun 28, 2026, 17:12:08 IST
Advertisement

ఈ ఆగస్టు నెలలో గల్ఫ్ దేశాల(UAE) నుండి భారతదేశానికి ప్రయాణించాలనుకునే ప్రయాణికులకు విమాన చార్జీలు చుక్కలు చూపిస్తున్నాయి. అక్కడ వేసవి సెలవుల డిమాండ్ కారణంగా యూఏఈ ప్రయాణికులకు భారతదేశంలోనే అత్యంత ఖరీదైన గమ్యస్థానంగా హైదరాబాద్ నిలిచింది. ఇక్కడికి రిటర్న్ ఎయిర్‌ఫేర్ (రానుపోను టికెట్ ధర) ఏకంగా 9,000 దిర్హామ్‌లు (భారత కరెన్సీలో రూ. 2,31,000 పైమాటే) దాటేసింది. ముంబై విమాన టికెట్ ధరలతో పోలిస్తే హైదరాబాద్ ఛార్జీలు దాదాపు 6 రెట్లు ఎక్కువగా ఉండటం గమనార్హం.

యూఏఈ-హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ల ధరలు
యూఏఈ-హైదరాబాద్ ఫ్లైట్ టికెట్ల ధరలు

ప్రముఖ అంతర్జాతీయ పత్రిక ఖలీజ్ టైమ్స్ కథనం ప్రకారం.. ఆగస్టు 1 నుండి 31 మధ్య ప్రయాణాల కోసం ఎమిరేట్స్, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ప్రధాన ఎయిర్‌లైన్స్‌లో టికెట్ ధరలను విశ్లేషించగా ఎక్కువగా ఉన్నాయి.

హైదరాబాద్‌లో అత్యధికంగా 9,250 దిర్హామ్‌లు (రూ. 2,37,667) రానుపోను విమాన ఛార్జీ నమోదైనట్లు గుర్తించారు. ఢిల్లీ 9,090 దిర్హామ్‌లు (రూ. 2,33,556) రానుపోను ఛార్జీలతో రెండో స్థానంలో నిలవగా, కొచ్చి 7,800(రూ.2,00,411)తో దాని తర్వాతి స్థానంలో ఉంది. మరోవైపు ముంబైకి రానుపోను టిక్కెట్లు 1,404 దిర్హామ్‌లు (రూ. 35,971) నుండి ప్రారంభం కాగా, చెన్నైకి ఛార్జీలు 1,678 దిర్హామ్‌లు(రూ. 43,114) నుండి అందుబాటులో ఉన్నాయి.

యూఏఈలో పాఠశాలలకు వేసవి సెలవులు కావడం, పండగల సీజన్ డిమాండ్, కొన్ని ప్రముఖ రూట్లలో పరిమిత సీట్ల లభ్యత కారణంగానే ఈ ధరల పెరుగుదల ఉందని ట్రావెల్ కంపెనీలు చెబుతున్నాయి. దక్షిణ భారతదేశానికి వెళ్లే విమానాలకు విపరీతమైన డిమాండ్ ఉందని పేర్కొంటున్నాయి. ప్రయాణ తేదీకి కొన్ని వారాల ముందే చాలా ఫ్లైట్స్ ఫుల్ అయిపోయాయని అంటున్నారు. హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల ప్రయాణికుల సంఖ్య ఎక్కువగా ఉండటం కూడా దీనికి ఒక కారణంగా చెబుతున్నారు. ప్రయాణ ఖర్చులు తగ్గించుకోవడానికి కొందరు ప్రయాణికులు దుబాయ్ నుండి ముంబై వచ్చి, అక్కడి నుండి డొమెస్టిక్ కనెక్టింగ్ ఫ్లైట్స్ ద్వారా కేరళ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్తున్నట్లు వెల్లడించారు.

విమాన సమాచారం కోసం 'మేనేజ్ యువర్ బుకింగ్' సర్వీస్ ద్వారా కాంటాక్ట్ వివరాలను అప్‌డేట్ చేసుకోవాలి. వ్యాపారాలు, పర్యాటకం, ప్రవాస భారతీయుల రాకపోకలతో యూఏఈ-ఇండియా ఫ్లైట్ రూట్ ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే అంతర్జాతీయ విమాన మార్గాలలో ఒకటిగా కొనసాగుతోంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks