...
...
Next Story

Godavari Floods : గోదావరి పరవళ్లు.. ధవళేశ్వరం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక!

భద్రాచలం వద్ద గోదావరి నదికి వరద కొనసాగుతోంది. దీంతో అధికారులు మెుదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో పలు ప్రాజెక్టుల్లోకి నీరు వచ్చి చేరుతోంది. ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు.

Updated on: Jul 31, 2026, 16:03:48 IST
Advertisement

ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న భారీ వరద నీటి ప్రవాహంతో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నది ఉప్పొంగుతోంది. శుక్రవారం భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 45.9 అడుగులకు చేరుకుంది. ఇప్పటికే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక
భద్రాచలం వద్ద మెుదటి ప్రమాద హెచ్చరిక

ఫ్లడ్ మాన్యువల్ నిబంధనల ప్రకారం అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. కొత్తగూడెంలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో 24 గంటలూ పనిచేసే ప్రత్యేక ఫ్లడ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అందుబాటులోకి తెచ్చారు.

వరద పరిస్థితులు, సహాయం కోసం ప్రజలు అధికారులను సంప్రదించేందుకు ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను ప్రకటించారు. కంట్రోల్ రూమ్ నంబర్: 08744241950, వాట్సాప్ నంబర్: 9392919743 అందుబాటులోకి తీసుకొచ్చారు.

ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉండటంతో, గోదావరి పరీవాహక ప్రాంతాలు, లంక గ్రామాలు, లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని, నదిలోకి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

ధవళేశ్వరం వద్ద భారీగా వరద నీరు

ధవళేశ్వరం వద్ద ప్రస్తుత ఇన్ అండ్ ఔట్ ఫ్లో 2,36,870 క్యూసెక్కులుగా ఉంది.ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. ఆగస్టు 1 ఉదయానికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేయవచ్చు. గోదావరి పరీవాహక జిల్లాల్లో పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ అన్నారు. లంక గ్రామ ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు.

మరోవైపు పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నిండుకుండలా మారింది. ప్రాజెక్ట్ పూర్తి స్థాయి నీటి మట్టం 148 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 147.41 మీటర్లకు చేరుకుంది. శుక్రవారం ఉదయం 11.48 గంటల సమయానికి ప్రాజెక్ట్‌లోకి 1.31 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. అధికారులు ప్రాజెక్ట్ 62 గేట్లలో 15 గేట్లను ఎత్తి దిగువకు 1.08 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు నది ప్రవాహాన్ని పర్యవేక్షిస్తున్నారు. అత్యవసర సహాయం కోసం అధికార యంత్రాంగం పూర్తి సన్నద్ధంగా ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రభుత్వ సూచనలను పాటించాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.

గాయత్రి పంప్ హౌస్ నుంచి ఎత్తిపోత

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గాయత్రి పంప్ హౌస్ నుంచి గోదావరి నది జలాల ఎత్తిపోతలు కొనసాగుతున్నాయి. 5 భారీ పంపుసెట్లతో సుమారు 16వేల క్యూసెక్కుల నీటిని మానేరు ప్రాజెక్టుకు తరలిస్తున్నారు. ఎగువన భారీ వర్షాల కారణంగా నీటి నిల్వ పెరగడంతో దిగువ ప్రాంతం నుంచి గోదావరి జలాల ఎత్తిపోతలు చేస్తున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe