ఉచితంగా ఇందిరమ్మ టవర్స్‌లోని ఇళ్ల రిజిస్ట్రేషన్.. లోన్ సదుపాయం కూడా

తొలి దశలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్లన్నీ ఏడాదిలోగా పూర్తి చేసి వచ్చే దసరా నాటికి లబ్ధిదారులకు అప్పగిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఇళ్ల నిర్మాణంలో ఎదురైన జాప్యాలు పునరావృతం కావన్నారు.

Published on: Oct 14, 2026, 19:05:41 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
Copy link
  • copy link

మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పోచారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భూమిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు.

పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన
పోచారంలో ఇందిరమ్మ టవర్స్‌ నిర్మాణానికి శంకుస్థాపన

హైదరాబాద్‌ మహానగర పరిధిలో భూముల విలువ వందల కోట్లు ఎకరం ఉన్నప్పటికీ, పేదలు నివసించే ప్రాంతాల్లోనే వారికి గౌరవప్రదమైన నివాసం కల్పించాలనే లక్ష్యంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ చెప్పారు. గత ప్రభుత్వం కట్టిన ఇండ్లు విషయంలో పేద ప్రజల జీవన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని కేటాయింపు, నిర్ణయం జరగలేదని ఆరోపించారు.

'ఈ ప్రభుత్వం పేద ప్రజల సొంతింటి కల నెరవేర్చే విషయంలో బేషజాలకు పోలేదు. కోట్ల విలువైన భూమి పేదలకు ఎందుకు ఇవ్వాలని ఆలోచన చేయలేదు. వారి ఉపాధి, వారి పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగరంలో ఎక్కడ ప్రభుత్వ భూమి ఉన్నా కూడా అది ఎంత విలువైనది అయినా కూడా పేదలు నివసిస్తున్న ప్రాంతం దగ్గరలోనే వారి ఉపాధికి, వసతులకు ఏలాంటి ఇబ్బంది లేకుండా ఇందిరమ్మ ఇండ్లు టవర్స్ నిర్మాణం చేసి ఇస్తున్నాం.' అని పొంగులేటి అన్నారు.

'ఏడాది లోపు ఈ నిర్మాణాలను పూర్తి చేసి లబ్ధిదారులకు ఇంటి తాలాలు అందించేలా పక్కా ప్రణాళికతో కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. త్వరలో రెండోవిడత కూడ ద‌ర‌ఖాస్తులకు అవకాశం కల్పిస్తాం. ఇందిరమ్మ టవర్స్‌లో ఎంపికైన లబ్ధిదారులకు కేవలం కేటాయింపు పత్రాలు ఇవ్వడమే కాదు, ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తాం. వారి కుటుంబ అవసరాలకు ఈ ఆస్తితో కావాల్సిన రుణాన్ని కూడ తీసుకోవచ్చు. టవర్స్ నిర్మాణం జరిగే సమయంలో లబ్ధిదారులు నేరుగా చూసుకునే అవకాశం కల్పిస్తున్నాం.' అని మంత్రి పొంగులేటి అన్నారు.

ఇక గత ప్రభుత్వం అసంపూర్తిగా కట్టిన ఇండ్లను, కేటాయింపు జరిగి ఖాళీగా ఉన్న ఇళ్లను గుర్తించి, సమీప ప్రాంతాల్లోని అర్హులైన పేదలకు నిబంధనల ప్రకారం కేటాయిస్తున్నామని మంత్రి వెల్లడించారు. కాల‌నీల్లో మౌలిక స‌దుపాయాల కోసం సుమారు 440 కోట్ల రూపాయిలు ఖ‌ర్చు చేశామన్నారు. ఇప్పటికే 90శాతం ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు కేటాయించామని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ లబ్ధిదారుల ఆనందాన్ని, వారి నమ్మకాన్ని ఈ ప్రభుత్వం తప్పకుండా నిలబెడుతుందని పొంగులేటి హామీ ఇచ్చారు. వచ్చే బతుకమ్మ పండుగ వరకు నిర్మాణాలను పూర్తి చేసి ఇక్కడ నుండే ఆడబిడ్డలు సొంతింటిలో బతుకమ్మ ఆడుకునేలా చేస్తామని చెప్పారు.

అత్యంత విలువైన భూమిపై ఈ ఇళ్లను నిర్మిస్తున్నారని, ఇది లబ్ధిదారులకు గణనీయమైన ఆస్తిని అందిస్తుందని మంత్రి పొంగులేటి నొక్కి చెప్పారు. పోచారం ప్రాంతంలో అధికంగా ఉన్న ఆస్తి ధరలను ప్రస్తావిస్తూ, అక్కడ ఒక సింగిల్-బెడ్‌రూమ్ ఫ్లాట్ కొనడానికి కూడా సుమారు రూ.40 లక్షలు ఖర్చవుతుందని అన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 25 లక్షల ఇళ్ల లక్ష్యంతో ఇందిరమ్మ గృహ నిర్మాణ కార్యక్రమం మొదటి దశను ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరాశ్రయ కుటుంబానికి ప్రభుత్వం దశలవారీగా ఇళ్లను అందిస్తుందని స్పష్టం చేశారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More