...
...
Next Story

జీహెచ్‌ఎంసీ పార్కుల ఎంట్రీ ఫీజు డబుల్.. పెద్దలకు రూ.20, పిల్లలకు రూ.5!

హైదరాబాద్ వాసులకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది. పార్కుల ఎంట్రీ ఫీజును డబుల్ చేసింది. పెద్దలకు రూ.10 నుంచి రూ.20కి, పిల్లల టికెట్ ధర రూ.2 నుంచి రూ.5కు సవరణ చేసింది.

Published on: Nov 17, 2026, 11:19:25 IST
Advertisement

హైదరాబాద్ నగరంలోని ఆహ్లాదకరమైన వాతావరణంలో కాసేపు సేదతీరాలనుకునే హైదరాబాద్ వాసులకు జీహెచ్‌ఎంసీ ధరలను పెంచింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పార్కుల ప్రవేశ రుసుములను భారీగా పెంచుతూ బల్దియా స్టాండింగ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. సవరించిన కొత్త ధరల ప్రకారం.. పెద్దలకు ప్రవేశ రుసుము డబుల్ కాగా.. పిల్లల టికెట్ ధరను కూడా పెంచారు.

జీహెచ్ఎంసీ పార్కుల్లో ఎంట్రీ ఫీజు డబుల్
జీహెచ్ఎంసీ పార్కుల్లో ఎంట్రీ ఫీజు డబుల్

జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీ ఆమోదించిన తాజా ప్రతిపాదనల ప్రకారం పార్కుల ప్రవేశ ధరలు ఈ విధంగా మారనున్నాయి. పెద్దలకు ఇప్పటివరకు రూ.10గా ఉన్న టికెట్ ధరను రూ.20కి పెంచారు. అంటే 12 సంవత్సరాలు దాటిన పిల్లలు, పెద్దలందరూ ఇకపై రూ.20 చెల్లించాల్సి ఉంటుంది.

5 నుంచి 12 ఏళ్లలోపు వారికి గతంలో రూ.2గా ఉన్న ఎంట్రీ ఫీజును రూ.5కు సవరించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు యథావిధిగా ఉచిత ప్రవేశం కొనసాగనుంది.

నిజానికి పార్కుల నిర్వహణ వ్యయం విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో పెద్దల ప్రవేశ రుసుమును రూ.10 నుంచి ఏకంగా రూ.30కి పెంచాలని జీహెచ్‌ఎంసీ అధికారులు తొలుత ప్రతిపాదించారు. అయితే ఒకేసారి మూడు రెట్లు పెంచితే సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతుందని భావించిన స్టాండింగ్ కమిటీ, ఆ ప్రతిపాదనను సవరిస్తూ రూ.20కి పరిమితం చేస్తూ ఆమోదముద్ర వేసింది.

పార్కులలో ప్రవేశ టికెట్లు జారీ చేసే సమయాల్లో ఎలాంటి మార్పులు చేయలేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం అమలులో ఉన్నట్లుగానే ఉదయం 8 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఎంట్రీ టికెట్లు జారీ చేస్తారు. కాగా ఉదయం పూట వాకింగ్‌కు వచ్చే సీనియర్ సిటిజన్లు, రెగ్యులర్ వాకర్స్‌కు ఇచ్చే నెలవారీ/వార్షిక పాసుల విషయంలో పాత నిబంధనలే కొనసాగే అవకాశం ఉంది.

మరోవైపు పెంచిన ధరలకు అనుగుణంగా పార్కులలో కనీస మౌలిక సదుపాయాలు, తాగునీరు, టాయిలెట్ల నిర్వహణ, పిల్లల ఆట వస్తువుల మరమ్మతులపై కూడా అధికారులు దృష్టి సారించాలని నగరవాసులు కోరుతున్నారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks