...
...
Next Story

ఆగస్టు 10న నాగార్జునసాగర్‌ వద్ద ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం!

Varuna Yagam : తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 10వ తేదీన నాగర్జునసాగర్ వద్ద వరుణ యాగం నిర్వహించనుంది. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.

Published on: Aug 7, 2026, 12:36:59 IST
Advertisement

వర్షాలు సమృద్ధిగా కురిసి, జలాశయాలు జలకళతో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతాంగం సంతోషంగా ఉండాలని, పాడిపంటలు బాగా పండాలని కోరుకుంటూ నాగార్జునసాగర్ వేదికగా మహా వరుణ యాగం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక సూచనల మేరకు ఆగస్టు 10వ తేదీన ఈ వేద క్రతువును అత్యంత వైభవంగా చేపట్టేందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం
తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో వరుణ యాగం

ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన నాగార్జునసాగర్‌ విజయ విహార్ ప్రాంగణం ఈ మహా యాగానికి వేదిక కానుంది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన ప్రధాన వేద పండితులు, అర్చకుల పర్యవేక్షణలో ఈ యాగం సాగనుంది. వర్షభావానికి కారణమయ్యే ఎల్-నినో ప్రతికూల ప్రభావాలు రాష్ట్రంపై పడకుండా ఉండాలనే ప్రత్యేక సంకల్పంతో ఈ యాగ క్రతువును రూపకల్పన చేశారు.

యాగం చేసే ప్రాంగణంలో ప్రత్యేకంగా 11 హోమకుండాలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 108 మంది ప్రముఖ ఋత్వికులు, వేద పండితులు ఏకధాటిగా మంత్రోచ్ఛారణల మధ్య యాగ ప్రసాదాలను సమర్పిస్తారు. రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ వరుణ యాగానికి పూర్తి సారథ్యం వహించనున్నారు.

యాగంలో అత్యంత కీలకమైన పూర్ణాహుతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.

రాష్ట్రంలోని జీవనదులైన కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతాలు నిండుగా పారాలని, అన్నదాతలు సుభిక్షంగా ఉండాలనే సత్సంకల్పంతోనే ప్రభుత్వం ఈ యాగం తలపెట్టిందని యాదగిరిగుట్ట దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ వెల్లడించారు. తీవ్రమైన ఎండలు, వాతావరణ మార్పుల నుంచి ఉపశమనం పొంది, వానకాలం పంటలకు తగినంత నీరు లభించేలా ఈ ఆధ్యాత్మిక వేడుక దోహదపడుతుందని స్థానిక ప్రజాప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

శ్రీశైలంలో యాగం

భక్తుల రద్దీ దృష్ట్యా ఆర్జిత సేవలు, స్పర్శ దర్శనాలు తాత్కాలికంగా రద్దు చేశారు. యజ్ఞ క్రతువులు, వారాంతపు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయంలో పలు సేవలపై తాత్కాలిక ఆంక్షలు విధించారు. ఆగస్టు 9 నుంచి 11 వరకు దేవస్థానంలో గణపతి హోమం, రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, చండీ హోమాలతో పాటు శ్రీ వృద్ధ మల్లికార్జున స్వామివారి ఆలయంలో జరిగే పూజలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు.

ఆగస్టు 9, 10 తేదీలలో భక్తులకు స్వామివారి స్పర్శ దర్శనాన్ని పూర్తిగా రద్దు చేశారు. అలాగే ఆగస్టు 11న ఉదయం, మధ్యాహ్నం వేళల్లో స్పర్శ దర్శనం అందుబాటులో ఉండదు. ఆగస్టు 9 (శనివారం), ఆగస్టు 10 (ఆదివారం) వారాంతాలు కావడంతో గర్భాలయ అభిషేకం, సమూహిక అభిషేకాలను నిర్వహించడం లేదని ఆలయ అధికారులు స్పష్టం చేశారు. భక్తులు ఈ మార్పులను గమనించి, ఆలయ యాజమాన్యానికి సహకరించాలని కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe