...
...
Next Story

ఖమ్మం జిల్లాలో భారీ వర్షం.. నవంబర్ 5న 13 జిల్లాల్లో ఉరుములతో కూడిన వాన

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. ఖమ్మం జిల్లాలో వర్షం భారీగా కురుస్తోంది. మరోవైపు నవంబర్ 5న 13 జిల్లాల్లో ఉరుములతో కూడిన వానలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.

Published on: Nov 4, 2026, 19:23:59 IST
Advertisement

భారత వాతావరణ శాఖ (ఐఎండీ) గురువారం (నవంబర్ 5, 2026) తెలంగాణలోని 13 జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని అంచనా జారీ చేసింది. ఐఎండీ ప్రకారం మురసు తుపాను తీవ్ర అల్పపీడనంగా బలహీనపడింది. ఐఎండీ తాజా బులెటిన్ ప్రకారం కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్‌నగర్, వరంగల్, హనుమకొండ, జనగాం, రంగారెడ్డి జిల్లాల్లోని అక్కడక్కడా ఉరుములతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఖమ్మంలో భారీ వర్షాలు
ఖమ్మంలో భారీ వర్షాలు

రాబోయే 24 గంటల పాటు హైదరాబాద్ నగరం, దాని పరిసర ప్రాంతాల్లో పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. 'మధ్యాహ్నం లేదా సాయంత్రం వేళల్లో నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు వరుసగా సుమారు 31 డిగ్రీలు, 22 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది.

ఉమ్మడి ఖమ్మం జిల్లా సహా పరిసర ప్రాంతాల్లో వానలు దంచికొడుతున్నాయి. మంగళవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న కుండపోత వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో జనం విలవిలలాడుతున్నారు. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమై జనజీవనం స్తంభించింది. భారీ వర్షాల ధాటికి ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది.

వర్షాల ఉద్ధృతికి వైరా జలాశయానికి భారీగా ప్రవాహ నీరు చేరుతోంది. మల్లెపూల వాగుతో పాటు పరివాహక ప్రాంతాల్లోని వాగులన్నీ డేంజర్ మార్కును దాటి ప్రవహిస్తున్నాయి. పాములేరు వాగు వద్ద ఏర్పాటు చేసిన తాత్కాలిక రహదారి వరద ఉద్ధృతికి కొట్టుకుపోయింది. దీంతో పాల్వంచ – దమ్మపేట మార్గంలో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

అశ్వారావుపేట 27.6 సెంటీమీటర్లు (అత్యధికం), ములకలపల్లి 23.1 సెం.మీ., దమ్మపేట 21.4 సెంటీమీటర్లు, మల్కారం 18.8 సెంటీమీటర్లు, అంకంపాలెం 17.5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా వేలాది ఎకరాల్లో సాగు చేసిన వరి, పత్తి, మిరప పంటలు చెరువులను తలపిస్తున్నాయి. ఏపుగా పెరిగిన పంటలు నీట మునిగిపోవడంతో రైతన్నలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

తుపాను తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాజధాని హైదరాబాద్‌లోనూ అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టారు. నగరం వ్యాప్తంగా భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో సైబరాబాద్, హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అడ్వైజరీ జారీ చేశారు. రహదారులపై ట్రాఫిక్ స్తంభించకుండా ఉండేందుకు ఐటీ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ముందుగానే ఇళ్లకు చేరుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks