Hyderabad : నవంబర్ 1 నుంచి 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' సేవలు - ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకింగ్!
భూగర్భ జలాలు, తాగునీటిపై ఒత్తిడి తగ్గించేందుకు నవంబర్ 1 నుంచి హైదరాబాద్‌లో గ్రీన్ వాటర్ ట్యాంకర్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎస్టీపీల్లో శుద్ధి చేసిన నీటిని నిర్మాణాలు, పరిశ్రమలకు సరఫరా చేయనున్నారు.
ఎల్-నినో పరిస్థితులు, తీవ్ర ఎండల నేపథ్యంలో హైదరాబాద్ నగరంలో భూగర్భ జలాల పరిరక్షణతో పాటు తాగునీటి వనరులపై ఒత్తిడిని తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం, హైదరాబాద్ జలమండలి బృహత్తర కార్యాచరణకు శ్రీకారం చుట్టాయి. రాజధానిలో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని ప్రోత్సహిస్తూ…. నవంబర్ 1వ తేదీ నుంచి 'గ్రీన్ వాటర్ ట్యాంకర్' సేవలను అందుబాటులోకి తేనున్నాయి.

ఈ నూతన విధానం ద్వారా మురుగునీటి శుద్ధి కేంద్రాలలో (STP) రీసైకిల్ చేసిన నీటిని తాగునీరు అవసరం లేని పనుల కోసం వినియోగిస్తారు. ముఖ్యంగా నిర్మాణ రంగం, పరిశ్రమలు, పార్కుల నిర్వహణ, గ్రీనరీ, రోడ్ల శుభ్రత, దుమ్ము నియంత్రణ వంటి పనులకు ఈ గ్రీన్ వాటర్ మాత్రమే వాడేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రత్యామ్నాయ నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తీసుకుంటున్న చర్యలపై జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు.
డిమాండ్‌కు అనుగుణంగా ఫిల్లింగ్ స్టేషన్లు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో శుద్ధి చేసిన నీటికి ఉన్న డిమాండ్‌ను ప్రాథమికంగా అంచనా వేయాలని ఎండీ అధికారులకు సూచించారు. నిర్మాణాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు, పారిశ్రామిక సముదాయాలు, ప్రభుత్వ సంస్థలు, పెద్ద గేటెడ్ కమ్యూనిటీలను గుర్తించి, వాటి సమీపంలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఎస్టీపీలలో గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వీటి వద్ద పంపింగ్ వ్యవస్థలు, ఫ్లో మీటర్లు, లోడింగ్ ప్లాట్‌ఫారాలు త్వరితగతిన సమకూర్చాలని ఆదేశించారు.
జీపీఎస్ అండ్ ఈ-పోస్ యంత్రాలు…
గ్రీన్ వాటర్ సరఫరా విధానంలో పూర్తి పారదర్శకతను పాటించాలని, తాగునీటికి వినియోగించే ట్యాంకర్లతో ఇవి కలవకుండా ఉండేందుకు ప్రతి గ్రీన్ వాటర్ ట్యాంకర్‌కు ప్రత్యేకమైన బ్రాండింగ్ రంగులు, లోగోలు వేయాలని నిర్ణయించారు. అంతేకాకుండా అక్రమ తరలింపును అరికట్టేందుకు ప్రతి ట్యాంకర్‌కు జీపీఎస్ పరికరాన్ని అమర్చడం తప్పనిసరి చేశారు.
ఫిల్లింగ్ స్టేషన్లలో డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం ఈ-పోస్ (e-PoS) యంత్రాలను అందుబాటులో ఉంచుతారు. వీటి ద్వారా నింపిన నీటి పరిమాణం, బుకింగ్ ఐడీ, విక్రయ వేళలు నమోదు అవుతాయి.
వినియోగదారులు సులభంగా నీటిని బుక్ చేసుకునేందుకు, డెలివరీ పర్యవేక్షణకు ప్రత్యేక మొబైల్ యాప్‌ను సిద్ధం చేస్తున్నారు. ఒకే డిజిటల్ వేదికపై ట్యాంకర్ల నమోదు, కస్టమర్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ బుకింగ్, ట్యాంకర్ కేటాయింపు, జీపీఎస్ ట్రాకింగ్, యూపీఐ చెల్లింపులు సాధ్యమవుతాయి.
సొంతంగా ట్యాంకర్లు ఉన్న నిర్మాణ సంస్థలు, పరిశ్రమలు కూడా నిబంధనలకు లోబడి నేరుగా ఫిల్లింగ్ స్టేషన్లలో నీటిని కొనుగోలు చేయవచ్చు. ట్యాంకర్లు లేని వారికి జలమండలి నమోదు చేసుకున్న ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తుంది.
"నిర్మాణాలు, ఇతర పనులకు భూగర్భ జలాలను, తాగునీటిని వాడటం వల్ల నగరంలో భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తే ముప్పు ఉంది. అందుకే ప్రాసెస్ చేసిన నీటిని వాడటం ద్వారా తాగునీటి నిల్వలను కాపాడుకోవచ్చు," అని ఎండీ కె. అశోక్ రెడ్డి వివరించారు. ఈ ప్రక్రియలో శుద్ధి చేసిన నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు ల్యాబ్‌లలో పరీక్షించి నిర్దేశిత ప్రమాణాలు పాటించేలా చర్యలు తీసుకుంటారు.
బిల్డర్లు, కాంట్రాక్టర్లు, పారిశ్రామికవేత్తలు, ప్రజలకు గ్రీన్ వాటర్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు. నవంబర్ 1 నాటికి అన్ని సాంకేతిక, నిర్వహణ ఏర్పాట్లు పూర్తి చేసి ఈ సేవలను నగరవాసులకు అందుబాటులోకి తీసుకురావాలని ఎండీ స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

